29, ఆగస్టు 2009, శనివారం

అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?



"అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?
అని అడిగాడు నాలుగేళ్ల పిల్లవాడు మరోసారి..
అలవోకగా వాడి తల నిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు..
ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మరఫిరంగులు పేలిన జాడలు
కాశ్మీరు సరిహద్దుల్లో కమ్ముకొన్న నల్లని పొగల మధ్య
కాలూని నిల్చున్న సైనికుడు చటుక్కున
ఆమె కళ్ల ముందు నిలిచాడు.

ఆమె కళవళ పడింది...నిట్టూర్చింది...పైట సరిచేసుకుంది
అంతలో మృదుగర్వరేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలిసిపోయింది
పార్కు బెంచీమీద నుండి లేచి పిల్లవాడికి చేయూతనిచ్చి
మెల్లగా నడుస్తూ మునిమాపు చీకట్లలో కలిసిపోయింది.

ఆమె రోజూ వస్తుంది పార్కులోకి వార్తలకోసం
అలాగే తెల్లని చీర కట్టుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు తురుముకుని
అదే పార్కు అదే రోడ్డు అదే బజారు అదే ఇల్లు
అయినా ఆమె ఏదో మార్పుని పసికట్టింది
అందరూ తింటున్నారు తిరుగుతున్నారు
అయినా ఎక్కడో డెక్కు పట్టింది.

బిగవట్టిన నగరాల నరాల మీద ఏవో వార్తల గుసగుసలు
బిగించిన పిడికిళ్ళ సందులనుండి జారిన నెత్తుటి ప్రతిజ్ఞలు
ఒకే వూరు ఒకే తూగు ఒకే దీక్ష...జాలి మేల్కొన్న గుర్తులు,
ఒక దేశం తన దారిన తాను పోతూవుంటే
ఊరుకోదు ఇరవయ్యో శతాబ్దపు నాగరికత
పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది
పక్కవాడి సౌభాగ్యం బాలీశుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది
ఆసియారంగం మీద నియంతలవతరించిన దుర్ముహూర్తాలివి ...చరిత్రకు సిగ్గుచేటు.

ప్రజల నోళ్లుకొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి
గజదొంగ లీనాడు రాజులై రారాజులై ఏలుతున్నారు
అందుకే భారతం పొడ వారికి కిట్టదు, రాజకీయ ద్యూతంలో...లాభం ముట్టదు.

మెత్తగా వుంటే పిల్లి అన్నారు
తిరగబడి మొత్తితే బెబ్బులి అన్నారు
అవకాశవాదులు నోరు తెరిస్తే దుర్వాసన
నీతిని విడిచిపెడితే రాజనీతి అవుతుంది
జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది
పాకిస్తాన్ చైనాల పరస్పర మైత్రి
పాము తోడేలూ కలిసినట్టు
ఇది రెండు దేశాల మధ్య యుధమే కాదు
ఇది కాస్త భూమికై కయ్యమే కాదు
ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది
భావనా స్వాతంత్ర్యం వ్యక్తీ గౌరవం వర్ణ వర్గ మతభేద రాహిత్యం దీనికి పునాది
ప్రతి భారతీయుడు ఒక సోల్జర్ ప్రతి హృదయం ఒక శతఘ్ని
రేడియోలో వార్తలు రోజూ వస్తున్నాయి
విజయ పరంపరను అందిస్తున్నాయి.

శత్రువుల టాంకులు విమానాలు ఎన్నో ఎన్నో కూలిపోయాయి
సాహసోపేతమైన భారతీయ సైన్యతరంగం
లాహొర్ సరిహద్దుల మీద విరుచుకుపడింది.
నిర్నిద్రహర్యక్షమై జాతి నిలబడి గర్జించింది
కీలర్, అబ్దుల్ హమీద్, హవల్దార్ పోతరాజు
ఇంకా లక్షలాది అజ్ఞాత సైనికుల కాబాలగోపాలం కృతజ్ఞాతాంజలి సమర్పించింది.

ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది
అలాగే తెల్లచీర కట్టుకుందిగాని ఎర్రని బొట్టులేదు
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు , చేతులకు గాజులు లేవు
ఆమె సోగకన్నులలో వానకురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది
ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంటితో నొక్కుతోంది
అక్కడ చేరిన గుంపులు "జైహింద్" అన్న నినాదం చేశారు
"అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు... ఇంకా రాడేం?"
అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని
ఆమె కూడా రుద్ద కంఠంతో "జైహింద్" అని మెల్లగా పలికింది
ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినపడింది"...

జూలై 26th, 2000..!! కార్గిల్ యుధం అయిపోయి యేడాది..రాజ్ భవన్ లో కార్గిల్ వీరుల సంస్మరణ సభ. మమ్మల్నీ ఆహ్వానించారు. కార్గిల్ యుద్ధ వీరుల (జీవించి వున్నవారు, అమరులైనవారు) తల్లులని, భార్యలని సత్కరించి గౌరవించారు మన రాష్ట్ర గవర్నర్ గారు . అలాంటి ఎందరో స్త్రీ మూర్తుల మనసు యొక్క దర్పణం...బాల గంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి లోని ఈ "అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?" కవిత. నాకెంతో నచ్చిన ఈ కవిత, నా జీవితానికి యెంతో దగ్గరగా వుండే ఈ కవిత మీ అందరితో పంచుకోవాలనిపించింది.

10 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

ఏం రాయాలో అర్ధంకాకుండా ఉంది ప్రణీత గారూ.. గొంతు పట్టేసిన భావన.. ప్రతి అక్షరం వంద ఆలోచనలను రేపింది.. ఎన్నో జవాబు లేని ప్రశ్నలని ముందు పెట్టింది...

మా ఊరు చెప్పారు...

బావుందండి .
ముగింపు బావుంది.

Unknown చెప్పారు...

చాలా బాగుందండి...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మురళి గారి స్పందనే నాదీనూ!! అద్భుతంగా ఉంది తిలక్ గారి కవిత...

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి : ధన్యవాదాలండి
మా ఊరు : ధన్యవాదాలండి
satya_eee1 : ధన్యవాదాలండి
శేఖర్ : ధన్యవాదాలండి

పరిమళం చెప్పారు...

మురళి గారి మాటే నాదీనూ ...

ప్రణీత స్వాతి చెప్పారు...

పరిమళం: ధన్యవాదాలు.

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

కవిత చదువుతూ అబ్బ ప్రణిత గారికి ఎంత ప్రతిభ ఉందీ అని ఆశ్చర్యపోతూ చదివాను. తీరా క్రిందకి వచ్చిన తరువాత తిలక్ గారిది అని చూసి నివ్వెరపోయాను. ఏది ఏమైనా మీ టాపాల శైలిలో ఓ కొత్తదనం ఉంది. బాగుంది.

చాలా మంచి కవితని చదివించారు. ధన్యవాదాలు. :)

ప్రణీత స్వాతి చెప్పారు...

విశ్వ ప్రేమికుడు : ఆ కవిత ఒక్కటే కాదండీ "అమృతం కురిసిన రాత్రి" పుస్తకం మొత్తం చాలా బాగుంటుంది. బహుశా చదివే వుంటారు..మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకం !! ధన్యవాదాలు.

cartheek చెప్పారు...

chaala bagundipraneetha gaaru...