2, మార్చి 2011, బుధవారం

మధురము శివ మంత్రము..



"మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు"






మధురము శివ మంత్రము..మదిలో మరువకే ఓ మనసా..





ఓ మహదేవా..నీ పద సేవా..భవతరణానికి నావ..








23, ఫిబ్రవరి 2011, బుధవారం

పూవై విరిసిన...



కేవలం..బేలా అన్న ఆ ఒక్క మాట కోసం ఈ పాటని కొన్ని వేల సార్లుగా వింటూనే వున్నాను..అంటే నమ్ముతారా..? అతిశయోక్తిలా అనిపిస్తోంది కదూ..కానీ అక్షరాలా నిజం. 

చాలా కాలం క్రితం టీవీ లో ఒక లైవ్ షో లో ఈ పాట విన్నాను(చూశాను). ఆ తరువాత కనిపించిన ప్రతీ చిన్న, పెద్ద మ్యూజిక్ స్టోర్ లు వెతికాను పిచ్చిగా...చివరికి సంగీత్ సాగర్ లో "గోల్డెన్ హిట్స్ అఫ్ ఘంటసాల" లో పట్టుకున్నాను. అప్పటినించీ మనసారా..తనివి తీరా విన్నాను..వింటూనే వున్నాను..ఆనందిస్తూనే వున్నాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అక్క భర్త సి.హెచ్.సురేష్ అని బ్యాంకు ఉద్యోగి..ఘంటసాల గారి పాటలు, మాధవపెద్దిగారి పాటలు (అందుకే ఈయన మాధవ పెద్ది గారి కుటుంబానికి చాలా సన్నిహితుడయ్యాట్ట) టీవీ లలో, స్టేజి షో లలో పాడుతూ వుంటారు.. మొన్నామధ్య కాస్త తీరికగా కనిపిస్తే అడిగి పాడించుకున్నాను ఈ పాట. అద్భుతంగా పాడారు. నాకీ పాట ఎందుకిష్టమో చెప్తే విని ఆశ్చర్య పోయారు అలా కూడా ఉంటారా (వింటారా) అంటూ..


సుతి మెత్తగా..మృదు మధురంగా సాగే ఈ పాట..శ్రీ తిరుపతమ్మ కధ సినిమాలోనిది. సి. నారాయణరెడ్డి గారు రాసి శంకర్ , పామర్తి గార్లు సంగీతాన్ని అందించగా..మనకోసమే గంధర్వ లోకం నించి వచ్చి తన గళం తో పాటల పూలు పూయించి తిరిగి అదే లోకానికి వెళ్ళిపోయిన ఘంటసాల గారు పాడగా విరిసిన పువ్విది. 






పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా..!!పూవై!! 


చల్లని గాలులు సందడి చేసే..
తోలి తోలి వలపులు తొందర చేసే..
జలతారంచుల మేలిముసుగులో 
తలను వాల్తువేలా..బేలా..!!పూవై!!



మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఆ..ఆ..ఆ..
తెలిసెనులే నీ తలపులేమిటో...
తొలగిపోదువేలా...బేలా !!పూవై!!



తీయని వలపుల పాయసమాని..
మాయని మమతల ఊయలలూగి..
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా!!పూవై!!



16, ఫిబ్రవరి 2011, బుధవారం

నేనే రాధనోయి..గోపాలా..



డా!! భానుమతి..బహుముఖ ప్రజ్ఞాశాలి. రచన, నటన, గానం అన్నింటిలో ఆవిడది ఒక ప్రత్యేక శైలి. సినిమాల్లో ఆవిడని చూస్తే గర్విష్టి అని , డామినేట్ చేసేస్తుందని అనిపించడం కద్దు. కానీ భానుమతి గారి ఆత్మ కధ  "నాలోనేను " ఆవిడ అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించేస్తుంది.


నాకు భానుమతిగారి అన్ని పార్శ్వాలు నచ్చినా..ఆవిడ రచనలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. విశిష్టమైన కంఠస్వరం..అందులో పలికే అద్భుతమైన గమకం..గొప్ప స్వరజ్ఞానం.. ఆవిడకే ప్రత్యేకం. అంతా మనమంచికే అన్న సినిమాలోని ఈ పాట చాలా అద్భుతంగా పాడారావిడ. 



ఈ పాట కి సంగీతం భానుమతి, సత్యం గారు సమకూర్చారట. పాట చివర్లో ఆలాపన హిందుస్తానీ ఆలాపనని గుర్తు చేస్తుంది. పండిట్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి తో ఇన్స్ పైర్ అయ్యి చేసిన పాట అని శైలజ గారు జీ తెలుగు లో చెప్పగా విన్నాను. నాకెంతో ఇష్టమైన ఈ పాట మీరందరూ కూడా విని ఆనందించాలని నా కోరిక.



ఇంకో విశేషమేంటంటే..జీ తెలుగు స రి గ మ నువ్వా నేనా..లో సాహితి అనే అమ్మాయి (10 ఏళ్ళు ఉంటాయేమో) అద్భుతంగా పాడింది. అంత చిన్న వయసు లో ఆ పాట సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటే..అద్భుతంగా పాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో కూడా అటాచ్ చేశాను. చూస్తారుగా..








నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..!!నేనే!!

విరిసిన పున్నమి వెన్నెలలో...
చల్లని యమునా తీరములో...
నీ పెదవులపై వేణు గానమై...
పొంగి పోదురా... నేనే వేళా...!!నేనే!!

ఆడే పొన్నల నీడలలో...
నీ మృదు పదముల జాడలలో...
నేనే నీవై...నీవే నేనై...కృష్ణా...ఆ...ఆ...ఆ...
అనుసరింతురా నేనే వేళా..!!నేనే!!











1, ఫిబ్రవరి 2011, మంగళవారం

గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా..


ఏ మహానుభావుడు రాశాడో ఇంత మంచి తత్వాన్ని, ఇంత గొప్ప సత్యాన్ని.  రెప్పపాటు జీవిత కాలం లో...నా అంత వీరుడు లేడని గొప్పలు పోతాం... అంతా నా ప్రతిభే...అన్నీ నా సొంతమే అనుకుంటాం.  శరీరమనే ఈ గూటి నించి ప్రాణమనే రామచిలుక ఎగిరిపోయాక...  కేవలం స్మృతి గా మిగిలిపోతాం. 

ఎంత వద్దనుకున్నా..ఈ మధ్యకాలంలో నేను కోల్పోయిన బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల జ్ఞాపకాలు విపరీతంగా బాధ పెడుతున్నాయ్.  జీవితం  క్షణ  బంగురం  అని అనుకునే  స్థితప్రజ్ఞత  ఎప్పుడొస్తుందో..







గూడు చిన్న బోయెరా..చిన్నన్నా గూడు చిన్న బోయెరా..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!

ఎక్కలేని పర్వతాలు..వేయి నూర్లు నిచ్చెనేసినా..
ఎక్కడ చూచినా గానీ చిలక జాడ కాన రాదు..!!గూడు!!

పంచ పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చినా..
మాణిక్యం చేతికిచ్చినా మాటలాడదు రామ చిలుక !!గూడు!!

కొండ మీద బండి వాలేను..గుండె రెండు చెక్కలాయెను..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!



27, జనవరి 2011, గురువారం

సిరిమల్లె నీవే..



వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాను..ఈ పాట నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పాలని..కానీ ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పదమూ నాకు సహకరించక మూగనైపోయాను. అదేపనిగా పదే పదే ప్రయత్నించగా.. ఓ నాలుగక్షరాలు నన్ను కనికరించాయి.. అవి మీతో పంచుకుందామని..ఇలా వచ్చాను.

ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాలూ గారి గళం ఇంకా చాలా ఇష్టం. రేడియో లోను, టేప్ రికార్డర్ లోను, ఇంటర్నెట్ లో కూడా ఎప్పుడూ వినడమే కానీ.. ఈ పాటని ఎప్పుడూ చూడలేదు. అసలిది ఏ సినిమా లో పాటో కూడా తెలిదు వారం క్రితం వరకు. అసలు తెలుసుకోవాలనిపించలేదు. తెలుసుకుంటే..చూడాలనిపిస్తుంది. అది నాకు ఇష్టం లేదు.  "నెమలికన్ను మురళీ గారన్నట్టు... ఒక కధని అక్షరాల్లో చదివినప్పుడు, లేదా ఏదైనా చక్కటి పాటని విన్నప్పుడు కలిగే అనుభూతిని దృశ్యం ద్వారా కలిగించడం దుస్సాధ్యం".

కానీ..అనుకోకుండా వారం రోజుల క్రితం..నా ఫ్రెండ్ వాళ్ళింట్లో యు ట్యూబ్ లో ఈ పాట చూశాను. మెస్మరైజ్ అయిపోయాను. వేటూరి గారి మాటలెంత సున్నితంగా అందంగా వున్నాయో.. పాట చిత్రీకరణ కూడా హీరో రంగనాథ్, హీరొయిన్ లక్ష్మిల పైన అంతే అందంగా..కాదు కాదు అద్భుతంగా చిత్రీకరించారు (ఇక్కడో చిన్న మాట చెప్పాలి. రంగనాథ్ ని చూడగానే యద్దనపూడి నవలల్లో కధానాయకుడు గుర్తుకొస్తాడు నాకు).

నీలాకాశం..దాన్నిండా పరచుకున్న వెండి మబ్బు.. కొండలూ..లోయలూ..విశాలమైన మైదానాలు..అందమైన జలపాతాలు..ఓహ్! బాలూ గారు తన గాత్రంతో , రాజన్ నాగేంద్ర గార్లు తమ సంగీత దర్శకత్వ ప్రతిభ తో  ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. .ఇక చెప్పలేను మహాప్రభో..చూసేయండి.






 సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
 వరదల్లె రావే..వలపంటి నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!

ఎలదేటి పాట..చెలరేగే నాలో..
చెలరేగి పోవే..మధుమాసమల్లే..
ఎల మావి తోట..పలికింది నాలో..
పలికించుకోవే..మది కోయిలల్లే..

నీ పలుకు నాదే..నా బ్రతుకు నీదే..

తొలి పూత నవ్వే..వన దేవతల్లే..
పున్నాగ పూలే..సన్నాయి పాడే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!

మరుమల్లె తోట..మారాకు వేసే..
మారాకు వేసే..నీ రాక తోనే..
నీ పలుకు పాటై..బ్రతుకైన వేళ..
బ్రతికించుకోవే..నీ పదము గానే..

నా పదము నీవే..నా బ్రతుకు నీదే..

అనురాగమల్లే..సుమగీతమల్లె..
నన్నల్లుకోవే..నా ఇల్లు నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!



13, జనవరి 2011, గురువారం

గాయతి వనమాలీ



బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...


నేనండీ ప్రణీత స్వాతిని. గుర్తున్నాను కదూ(అమ్మయ్య థాంక్ యు)..చాలా కాలం తరవాత మళ్ళీ బ్లాగ్ లోకం లో అడుగుపెట్టే అవకాశం దొరికింది. సంక్రాంతి పండగ కదా అందరినీ విష్ చేసినట్టుంటుందని వచ్చాను. 


గత కొద్ది నెలలుగా విపరీతమైన ఒత్తిడిలో వున్న నన్ను సేదతీర్చినవి పాటలే.  అందులో "గాయతి వనమాలీ" అనే ఈ సదాశివ బ్రహ్మేంద్ర కృతి ఎంతమంది గాయకులో పాడారు.  కానీ...నాకెంతో ఇష్టమైన గాయకుడు డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన ఈ శైలి నాకు చాలా ఇష్టం.  నాకిష్టమైన ఈ పాట మీరూ వినాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సంస్కృతం లో వున్న ఈ పాటకి ఎవరైనా అర్ధం చెప్పగలిగితే ధన్యురాలిని.  ఏవైనా అచ్చు తప్పులుంటే మన్నించమని ప్రార్ధన. 






పల్లవి!!  గాయతి వనమాలి - మధురం - గాయతి వనమాలి!! 
చరణం!! పుష్ప సుగంధ సుమలయ సమీరే
             
పావన ముని జన యమునా తీరే  !! గాయతి !!  

చరణం!! కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే
             
కుటిలాలక బహు నీరద పుంజే || గాయతి ||  

చరణం!! తులసి ధామ విభూషణ హారీ
              
జలజ భవ స్తుత సద్గుణ శౌరీ  !! గాయతి !!

చరణం!! పరమ హంస హృదయోత్సవ కారీ…      హరీ హరీ 
           
పరిపూరిత మురళీ.. రవ ధారి   !! గాయతి!!  






9, మే 2010, ఆదివారం

అమ్మ


వెంకట రత్నమ్మ...రిటైర్డ్ హెడ్ మాస్టర్..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎన్ని ఆగడాలు చేసినా, తన మీద ఎంత దౌర్జన్యం చేసినా, ఆస్తంతా తగలేసినా, సంపాదనలో ఒక్క రూపాయ ఇవ్వకపోయినా.. తనను భార్యగా గౌరవించడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడకపోయినా కేవలం తన ముగ్గురాడపిల్లల కోసం భరించింది. కానీ ఆ పిల్లలు పెద్ద వారై పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలతో సహా వచ్చి ఆమె మీద ఆధారపడితే..అల్లుళ్ళని ఏమైనా అంటే కూతుళ్ళు అన్యాయమైపోతారనే భయంతో..పిల్లల మీద మమకారం చంపుకోలేక..డెబ్భై ఐదేళ్ళ ఈ వయసులో కూడా తన సంపాదనతో వారందరినీ పోషిస్తోంది. తను కన్నకూతుళ్ళు, వాళ్ళు కన్న పిల్లలు..తననెంత ఈసడించుకున్నా..ఆమెకి వాళ్ళపై ప్రేమే కాని కోపం ఎన్నడూ రాలేదు. ఆ అమ్మకి విశ్రాంతి ఎన్నడో..?

అన్నపూర్ణ..రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్..

తన తరవాత ఐదుగురు తమ్ముళ్ళున్నారు కాబట్టి పై చదువులు చదివించలేనని తండ్రి చెప్తే ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి పదహారేళ్ళ వయసులోనే ఉద్యోగంలో చేరి తండ్రి కి ఆసరాగా నిలబడింది. తల్లిలా తమ్ముళ్ళని పెంచింది, చదివించింది. కుటుంబాన్ని నడపడానికి తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చింది..పెళ్ళైన రెండున్నరేళ్ళకే భర్త చనిపోతే..ఇద్దరు పసికందులతో ఒంటరిగా బ్రతుకు ప్రయాణం సాగించింది..ఊళ్లు తిరిగే ఉద్యోగంతో (ఎగ్జిక్యు టివ్ జాబ్) పిల్లల చదువులు సరిగ్గా సాగవని..వాళ్ళని హైదరాబాద్ లో నే వుంచి తను వారానికి పదిహేను రోజులకి వచ్చి వెళ్తూ..వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చింది..తండ్రి లేని పిల్లలని పల్లెత్తు మాట అనకుండా పువ్వుల్లో పెట్టి పెంచుకుంది..చక్కటి విద్య బుద్దులు చెప్పించింది..వాళ్ళ తో బాటూ తనూ చదువుకుని డిగ్రీ తెచ్చుకుంది. డిపార్ట్ మెంట్ లో సిన్సియర్, అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రిటైర్ అయ్యి...ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకి దూరంగా ఉంటూ పంచడానికి అవకాశం లేకపోయిన మమకారాన్ని ఇప్పుడు పంచుతూ అమ్మ...ప్రేమకి మారు పేరని చెప్పకనే చెప్తోంది.

అనసూయ(లేట్).. యు.డీ.సి. ఏ.పీ. స్టేట్ టెక్నికల్ బోర్డ్..

కోటి ఆశలతో పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన అమ్మాయి..భర్త మానసిక రోగి అని ఆ ఉద్రేకాన్ని తగ్గించడానికి సెడెటివ్స్ వాడుతున్నారని తెలిసి షాక్ అయింది. తప్పని సరై పరిస్థితులతో రాజీ పడింది. పిల్లలు పెద్దవాళ్ళు ఐతే తన కష్టాలన్నీ తీరిపోతాయనుకుంది. వాళ్ళకే కష్టమూ తెలీకుండా పెంచింది. కోరిన చదువు చెప్పించింది. ఉద్యోగ రీత్యా కొడుకు అమెరికా వెళ్తే..కూతురు చదువుని అటకెక్కించి ప్రేమ ప్రేమ అంటూ తనకు రెట్టింపు వయసు, పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి వ్యామోహంలో పడితే..అతి కష్టం మీద ఆ వ్యామోహం నించి బైటికి లాగి మళ్ళీ కాలేజి లో చేర్చింది. హమ్మయ్య కూతురింక మారిపోయింది.. చక్కగా చదువుకుంటోంది..అనుకుంటూ వుండగా ఆ అమ్మాయి మళ్ళీ ప్రేమలో పడింది. ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఈ క్రమం లో మానసిక వొత్తిడి లో తన అనారోగ్యం సంగతే గుర్తించలేకపోయింది. హఠాత్తుగా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే "బ్రెయిన్ ట్యూమర్..అడ్వాన్స్డ్ స్టేజి..ఆపరేషన్ చేసినా మూడేళ్ళ కంటే బ్రతకడం కష్టం" అని చెప్పారు ఎమర్జెన్సి ఆపరేషన్ చేసిన డాక్టర్స్. కూతురికి ఇవేమీ పట్టలేదు..తను ప్రేమించిన వ్యక్తితో(సకల అవలక్షణాభిరాముడు) తను కోరుకున్న జీవితం వైపు సాగిపోయింది. పిల్లలే తన జీవితం అనుకుని బ్రతికిన ఆమె కూతురు చేసిన పనికి తట్టుకోలేకపోయింది. కూతురి భవిష్యత్తు మీద బెంగతో జీవితం నించి సెలవు తీసుకుంది. తిరిగి రాలేని లోకాలకి వెళ్ళిపోయింది.


                                                                    ****

భగవంతుడు తను ప్రతీ చోట ఉండలేక అమ్మని సృష్టించాడట. అమ్మ ప్రేమకి ప్రతి రూపం ..అమ్మ మనసు నవనీతం..మాతృ ప్రేమకి వర్ణ వర్గ భేదాలు, ప్రాంతీయ, దేశ, విదేశ భేదాలు లేవు. అమ్మా...మమ్మీ...అమ్మీ...మామ్...పదమేదైనా... కటిక పేదవాడికైనా, కోట్లకి పడగలేత్తినా అమ్మ ప్రేమ సమానమే. మన సంతోషమే అమ్మ సంతోషం, మన దుఖమే అమ్మ దుఖం. పసితనాన తప్పటడుగు వేసే క్షణం నించి మన ప్రతి అడుగు వెనక అమ్మ..తప్పటడుగు తప్పుటడుగు కాకుండా నిరంతరం వెన్నంటి దారి చూపే అమ్మ.

"వాస్తవం" లో చెప్పిన ముగ్గురమ్మలూ...ఎందరో(కాదు కాదు అందరు) అమ్మలకి, వారి ప్రేమలకి, త్యాగాలకి ప్రతి రూపాలు. అందుకే మాతృమూర్తులందరికీ పాదాభివందనం. మీ ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష.

బ్లాగ్ మిత్రులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.