28, ఆగస్టు 2009, శుక్రవారం

సరిగమల సునామీ


ఈ మధ్య ఏ టీవీ ఛానెల్ పెట్టినా రియాలిటీ షోలంటూ ప్రేక్షకులని తెగ ఆకర్షించేస్తున్నారు. ముఖ్యంగా సంగీతానికి , డాన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు బాగా ఎక్కువైపోయాయి. ఒక ఛానెల్ వాళ్ళు "పాడుతా తీయగా" అంటే, ఇంకో ఛానల్ వాళ్ళు "పాడాలని వుంది" అంటారు...ఒకరు "ఝుమ్మంది నాదం'' అంటే, ఇంకొకరు ''గాన గాంధర్వం" అంటారు...ఒకరు ''సరిగామపా'' అంటే, ఇంకొకరు ''సూపర్ సింగర్'' అంటారు... ఒకరు ''ఢీ'' అంటే ఇంకొకరు "ఠా" అంటున్నారు...ఒకరు ''జల్సా'' అంటే ఇంకొకరు ''సల్సా'' అంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చూసే ప్రేక్షకులు (జనాలు) తమ పిల్లల్ని, బంధువుల్ని, పక్కింటి వారిని, ఎదురింటి వారిని, అందరిని పోటీల్లో పాల్గొనడానికి ప్రేరేపించి పంపుతున్నారు. అదీ చాలక ఎవరో ఎందుకని ఆవేశపడి తామే ఆ పోటీల్లో పాల్గొని వాళ్ళిచ్చే కప్పులో, చిప్పలో, క్యాషో, కారో , తెచ్చేసుకోవాలనీ , టీవీ లో కనిపించాలనీ , నలుగురి లో గొప్ప పేరు సంపాదించేసుకోవాలనీ మహా ఉబలాటపడిపోతున్నారు. దేశమంతా ఇదే తంతు ఇక మా వాళ్ళనగానేంత..?

నాకు ఐదుగురు మేనమామలు. వారిలో నాలుగో మావయ్య పిల్లలు తప్పించి, మిగతా అందరి పిల్లలూ సంగీత విద్వాంసులే (విధ్వంసులు). సంగీతాన్నీ కాచి వడబోసిన (టీ కాచినట్టు) మేధావులు. ఒకరిద్దరు గాత్ర సంగీతం లో డిప్లొమా చేస్తే, మరొకరు ఏకంగా మ్యూజిక్ లో ఏం.ఏ చేసిన ఘనులు. ఒకరు వీణ మీటితే, మరొకరు వేణువూదితే, మరొకరు ఫిడేలు వాయిస్తే, ఇలాగ అందరూ తలో రంగంలో నిష్ణాతులు(అని వారనుకుంటూ వుంటారు).

మరి..ఇంత మంది పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు వుంటే ఆ వాయింపుకి శ్రోతలు కావాలి కదండీ..అదిగో ఆ కొద్దిమంది శ్రోతల్లో మొట్టమొదటి (బలి) శ్రోత నేను. ఇంకా మా అన్నయ్య, మా 4వ మావయ్య, అత్తయ్య, వాళ్ళ పిల్లలిద్దరూ. మిగతా అందరూ అమ్మ తో సహా (అమ్మ చాలా బాగా పాడుతుంది) ఆ అద్భతమైన(విచిత్రమైన) సంగీతాన్నీ యెంతో ఆనందంగా, తన్మయత్వంతో ఆస్వాదిస్తారు.

ఒకసారీ ...మా రెండో మావయ్య కూతురి పెళ్లి చూపులు జరిగాయి. వచ్చిన పెళ్ళివారు అమ్మాయి ఒకపాట పాడితే వినాలని వుందంటేనూ ''హిమగిరి తనయే హేమలతే..ఏ ఏ ఏ ఏ ఏ" అంటూ పాడింది. పాపం పెళ్ళివారు బిక్కచచ్చిపోయి, ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు పారిపోదామా అన్నట్టు కూర్చుని, పాట అయిన ఐదు నిమిషాల్లో సినిమాల్లోలా మాయమైపోయారు.

మా పెద్ద మావయ్య కొడుకు వేణువు వాయిస్తోంటే.."వాయిస్తున్నడురా..ఫ్లూటు వాయిస్తున్నాడురా..కళ్ళకి రెప్పలున్నట్టు చెవులకి మూతలు వుండి వుంటే యెంత బాగుండేదో "అంటూ జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో బ్రహ్మానందం ఫ్లూట్ వాయించే సన్నివేశంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ భయపడే సన్నివేశం గుర్తుకువస్తుంది.

ఆ మధ్యన ఒకసారి (sept 11th) ఐదో మావయ్య పుట్టినరోజు పార్టీ చేస్తున్నాం రండి అంటే వెళ్ళా(అమ్మా వాళ్ళూ లేరు నేనొక్కదాన్నే వెళ్ళా). వాళ్ళబ్బాయి అద్భుతంగా పాడతాడు వినమని మా మావయ్య అందరికి చెప్పాడు. సరేనని కూర్చున్నామందరం. ఎంతో చక్కని యుగళగీతం...శుభాకాంక్షలు సినిమాలో ఏ.వి.ఎస్(నాదబ్రహ్మ) లాగా, అది ఏ రాగమో తెలియనివ్వకుండా..ఆ పాటని చీల్చి చండాడి.. అంత్యంత విషాదంగా పాడి మా అందరి కన్నీళ్ళకు కారణమయ్యాడు. చాలా సేపు ఏదో సంతాప సభకి వచ్చినట్టు అందరం మౌనంగా వుండిపోయాం. ఆ తరువాత జారిపోయిన జవసత్వాలను కూడదీసుకుని, ఆ విషాదాన్ని మోసుకుంటూ అందరం భారంగా బైటికి వచ్చాం. ఇంటికి రాగానే టీవీలో అమెరికాలో జంట టవర్లు కూలిన వార్త చూపిస్తున్నాడు. (వాడి పాట దెబ్బకి అమెరికాలో టవర్లు కూలిపోయాయని ఇప్పటికీ సరదాగా అనుకుంటూ వుంటాం).

చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. పెద్ద కుటుంబం అవ్వడంతో చిన్నది పెద్దది ఏదో ఒక సందర్భం వస్తుంది..అందరం కలవాల్సివస్తుంది. ఇంకేముంది..? ఏ కాస్త సంగీత ప్రేమికుడైన ఏ పెద్దమనిషో వీళ్ళ ప్రతిభాపాటవాలు తెలియక ఒక్క పాట పాడమని అడగుతాడు. ఫలితం...ఈ "సరిగమల సునామీ"...ఎక్కడ బైటికి వెళ్లిపోతామోనని(పారిపోతామని ) తలుపులు వేసి మరీ వారి కళలు ప్రదర్శించి మా ముఖకవళికలు మార్చేస్తున్నారు.

అదండీ సంగతి. ఇదిగో ఇప్పుడు కూడా చిన్న కిట్టి పార్టీ వుంది మా పెద్దమావయ్య వాళ్ళ ఇంట్లో. కాసేపట్లో వెళ్ళాలి. "సరిగమల సునామి" నించి తప్పించుకుని సురక్షితంగా ఇల్లు చేరాలని ఆశీర్వదిద్దురూ !!


9 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

ఏమీ పర్లేదండి.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.. పాటని పాటతోనే ఎదుర్కోవాలి.. వాళ్ళు మొదలు పెట్టగానే మీరూ 'పాడమని నన్నడగవలెనా..' అని అందుకోండి.. సరిపోతుంది :-) :-)

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి : వాళ్ళ పాట మొదలవ్వగానే మనం మూర్చరోగుల్లా మారిపోతాం కదండీ ఇక మనం పాడేందుకు కంఠం ఎక్కడ సహకరిస్తుందండి..!!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అదేంటీ..వాళ్ళందరూ సంగీతంలో ఎమ్.ఏ లు, డిప్లొమాలు చేసేరని చెబుతున్నారు..మరి ఈ కంప్లయింట్స్ ఏంటి? ఈ టపా చూసారంటే మిమ్మల్ని ఏ కుర్చీకో కట్టేసి ఒక వైపు నుండి వీణ, ఇంకో వైపు నుండి ఫ్లూటు, పై నుండి గాత్రం వినిపించేయగలరండీ..:))

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ : అందుకే ముందు జాగ్రత్త చర్య గా మా వాళ్ళకెవరికీ నా బ్లాగ్ సంగతి చెప్పలేదండి.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

మీరు వాళ్లకి కౌంటరు వేసేట్టు పాటమొదలవగానే, "ఏమిటిబాబూ ఇప్పుడేమన్నావ్ పాటపాడుతావా?" "బాబూ చిట్టీ" అంటూ మొదలెట్టేయ్యండి. లేదంటే "గప్పుడు మన ఎన్‌టీఓడు వచ్చిండు. ఎన్‌టీఓడంటే ఎవడనుకున్నావ్ భాయ్ దునియాలో గసుమంటి యాక్టరే లేడన్నట్టు.." ఇలా అన్నమాట. అప్పటికీ మాటవినకపోతే "మామేనమామలు ఐదుగురు.." అంటూ ఆటోబయాగ్రఫీ మొదలెట్టొచ్చు.

ప్రణీత స్వాతి చెప్పారు...

@సుబ్రమణ్య చైతన్య: ఆ సమయానికి తోచలేదండి..ఈసారి అలాగే ప్రయోగించేద్దాం.

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

baagundani praneeta garu ...vraasina vidhanam chaala baagundi

చందు చెప్పారు...

chacharraa baboyyyyyyy......nvvaleka pothunna!!!

స్నిగ్ధ చెప్పారు...

ప్రణీత గారు, చాలా బాగుందండీ మీ కబుర్లు...
మీ బ్లాగ్ ని ఇప్పుడే చూడ్డం...
శేఖర్ గారికి వచ్చిన సందేహమే నాదీను..వాళ్ళు మరీ సంగీతంలో అన్ని డిగ్రీలు సంపాదించారు కదా...అంత భయపడతారా వారి కచేరీ వినడానికి???
:)

జాగ్రత్తండీ ఇది తెలిస్తే కచేరీలు ఎక్కువయ్యిపొగలవు....