19, ఆగస్టు 2009, బుధవారం

కుక్క పాట్లు..



తెల్లవారు ఝామున 8.30..అయింది!! సూర్యా రావు గారి తో ఛాలెంజ్ చేసి ముసుగు బిగించి నిద్ర పోతున్నాన్నేను ఇంతలో ట్రింగ్..ట్రింగ్.. మంటూ చెవి పక్కనే మొబైల్ మోత. నిద్రలోనే విసుగ్గా ఫోనెత్తి హలో అన్నా.. అవతలి వైపు నించి వినిపించిన మాటలకి నిద్ర మత్తు వదిలిపోయింది.

వెంటనే లేచి ఒక్క పరుగున అమ్మ దగ్గరికి వెళ్లి అడిగా, అలిగా, జాలిగా చూశా, కాళ్ళా వేళ్ళా పడ్డా..నిరాహార దీక్ష సైతం చేశా..కానీ అమ్మ ఏమాత్రం కరుణించలేదు. తప్పదంది..తప్పించుకునే వీలే లేదంది, తన బట్టలతో బాటుగా నావీ సర్దేసింది.."గోదావరీ పుష్కర" స్నాన సంరంభానికి "రాజమండ్రి" కి.

ఓ శుభ ముహూర్తాన బయలుదేరాం అమ్మ, నేను, మావయ్య , అత్తయ్య ..  చెల్లి (అత్తయ్య కి), చెల్లి మొగుడు (ఈయనకి ఇంత కంటే పరిచయం లేదు) , పిల్లా పీచు, తట్టా, బుట్టా..అంతా కలిసి చిన్న సైజు మంద..!!

రాజమండ్రి లో రైలు దిగగానే ఒకాయన "గునగునా" నడుచుకొచ్చాడు మా దగ్గరికి..(చెల్లి మొగుడికి తమ్ముడు, ఆయన ఇంట్లోనే మా బస). అంతా కలిసి బయలు దేరి వాళ్ళింటికి వెళ్ళాం. అదో చిన్న సైజు అడవి. కాఫీ కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేసుకుని అందరం బయలు దేరాం గంగలో(సారి గోదావరిలో) మునగడానికి.

అప్పటిదాకా గోదారి లో అంతా మట్టి నీళ్ళు, అందులో నేను స్నానం చెయ్యనని అమ్మ చెవి కింద జోరీగ లాగా సొద పెట్టిన నేను గోదావరి ని చూడగానే తన్మయమైపోయాను. నీళ్ళలోకి దిగనే దిగనన్నదాన్ని, అసలు నీళ్ళలోంచి బైటికే రాలేదు చాలా సేపు. స్నాన ఘట్టం ముగిసింది.

ఇక్కడితో కధ సుఖాంతం అయిందని ఎంతో సంతోషించాను. ప్చ్..!! అంతా నా భ్రమ. అయినా నా పిచ్చి గాని మన చేతుల్లో ఏముంది? ఇక ఇక్కడి నించి మొదలైంది మా సాహసయాత్ర లో రెండో ఘట్టం.

మా అత్తయ్య మహా భక్తురాలు అలాగే చాలా నిదానస్తురాలు. ఎంత నిదానమంటే నత్త, తాబేలు తో పోటి పడితే అవే గెలుస్తాయి . ఇక చూడండి మా పాట్లు.

వదిన గారూ(మా అమ్మ)..ఎలాగూ ఇక్కడి దాక వచ్చాం కదా పిఠాపురం లో "శక్తి పీఠం(పురుహూతికా దేవి)" వుంది వెళ్దాం ఇక్కడికి చాలా దగ్గర అంది. ప్రైవేటు బండి కోసం ప్రయత్నిస్తే దొరకలేదు అందుకని బస్సెక్కాం. ఆ బస్సు డ్రైవర్ కూడా మా అత్తయ్య లాగా బాగా నిదానస్తుడు. రాత్రి 10 గంటలకి మమ్మల్ని పిఠాపురం లో దింపాడు.

అక్కడినించి వాళ్ళనీ వీళ్ళనీ "అడుక్కుంటూ" వెళ్ళే సరికి గుడి కాస్తా మూసేశారు. సరే ఛలో వెనక్కి మళ్లీ రాజమండ్రి అనుకుని బస్సు స్టాప్ కి వస్తే ఆ రాత్రికి ఇక బస్సులు లేవన్నారు . ఒక్కసారిగా అందరికి మా అత్తయ్యని కరిచెయ్యాలన్నంత కోపమొచ్చింది. కానీ ఛ..మనం "కుక్కలం" కాదుకదా అని సర్దిచేప్పుకున్నాం. కానీ మాకేం తెలుసు కాసేపట్లో అదే పోర్ట్ ఫోలియో అందరం పోషించబోతున్నామని..!

ఇలా మేం కిం కర్తవ్యమ్..? అని ఆలోచిస్తూ వుండగా.. సామర్లకోట..సామర్లకోట అని అరుస్తూ ఒక బస్సు (లాంటిది) వచ్చింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ బండి ని మాకోసం పంపినట్టుగా సంబరపడిపోయి చాటంత మొహాలు చేసుకుని ఆ బండి లో కూర్చున్నాం. క్లీనర్ వచ్చి బైటినించి తలుపులు గొళ్ళెం పెడితే ఏమోలే అనుకున్నాం..

బండి బయలుదేరింది. కాస్త కుదుటపడ్డాక చుట్టూ తేరిపార చూశాం..అది ఒక "కుక్కల" బండి. చుట్టూతా బోను..అందులో మేము..!! పడిపోకుండా పట్టుకోడానికి కనీసం ఆధారం కూడా లేని బండి. అలాంటి బండి లో మమ్మల్ని కుక్కల్లా పడేసుకుని ఆ డ్రైవర్ మిట్టా,పల్లం అనే భేదం చూపకుండా ఆ గతుకుల రోడ్డు మీద 120 కిమీ వేగంతో తోలుకెళ్ళి సామర్లకోట కుక్కల స్టాండ్ లో (ఛ..బస్టాండ్ లో) పడేశాడు. ఆ తరవాత తెల్లారే వరకు అక్కడే పడిగాపులు కాసి తెల్లారి మొదటి బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగాం.

ఆ రోజు రాత్రికే మా తిరుగు ప్రయాణం. "గునగున తమ్ముడు" తన కారు లో రైల్వే స్టేషన్ దగ్గర దింపుతాను రమ్మంటే కొంత మందిమి ఆ కారు లో కూర్చున్నాం. సరిగ్గా ఒక నాలుగు రోడ్ల కూడలి దగ్గర మన "గునగున తమ్ముడు" కారు ఎదురుగా సిగ్నల్ కోసం ఆగి వున్న స్కూటరాయన పైకి ఎక్కించాడు (బహుశా ఆయనకి ఫుట్ పాత్ ల మీద, మనుషుల మీద తప్ప రోడ్డు మీద కారు నడపడం రాదేమో)..

అది చూసిన ట్రాఫిక్ పోలిసు వెంట పడ్డాడు.. మన "గునగున తమ్ముడు" చాకచక్యంగా (ఈసారి ఎవరి పైకి ఎక్కించకుండా) ట్రాఫిక్ పోలిసు ని తప్పించి మమ్మల్ని రైల్వే స్టేషన్ చేర్చాడు. బ్రతుకు జీవుడా అనుకుని ..రైలెక్కి మా వూరోచ్చేశాం.


9 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

ఆతిధ్యం ఇవ్వడంతో పాటు, తన కార్లో తిప్పిన పెద్దమనిషిని 'గునగునా..' అంటారా? హన్నా..తప్పు కదూ?!! బాగుందండీ పుష్కర స్నానం కథ.. పాత్రల పరిచయం మాత్రం జంధ్యాల సినిమాని తలపించింది.. అన్నట్టు కొత్త టెంప్లేట్ బాగుంది..

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి: ఎంత వద్దనుకున్నా ఆయన్ని చూడగానే అలా అనిపించేదండి.."గున గునా".
జంధ్యాల గారితో పోల్చిచాలా పెద్ద కితాబు ఇచ్చారండి..ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్యో పాపం..కుక్కల బండిలో వెళ్ళాల్సివచ్చిందా?? మీరు మరోలా అనుకోనంటే ఓ విషయం చెబుతాను. ఆ పేరా చదివిన వెంటనే భలే నవ్వొచ్చిందండి. బాగా రాసారు. కొత్త టెంప్లేట్ బాగుందండీ...

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ పెద్దగోపు : ఇప్పుడు తలచుకుంటే మాకూ నవ్వొస్తుందండి..అప్పుడప్పుడు తలచుకుని నవ్వుకుంటూ వుంటాం. ధన్యవాదాలు.

Sravya V చెప్పారు...

ప్రణీత మీ పాట్లు భలే ఉన్నయ్ ! మాతో పంచుకోవాటానికి మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కవాలని కోరుకుంటున్నా (Just kidding)

ప్రణీత స్వాతి చెప్పారు...

Sravya Vattikuti : ధన్యవాదాలు.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఇంతకీ 'గునగునా' అంటే?

చందు చెప్పారు...

ha ha ha ha ...pukaranii pukarm sepu chesaranna maata>

ప్రణీత స్వాతి చెప్పారు...

@ సావిరహే: ఏంటో మీ వ్యాఖ్య అర్ధం కాలేదండీ..