28, ఆగస్టు 2009, శుక్రవారం

మా ఉజ్జయినీ యాత్ర



అన్నయ్య కలకత్తాకి బదిలీ అయిన వెంటనే ఏదో ట్రైనింగ్ కోసం రెండు నెలలు మహూ("మిలటరీ హెడ్ క్వాటర్స్ అఫ్ వార్", మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఇండోర్ జిల్లాలోని ఒక అందమైన ఊరు ) వెళ్ళాల్సి వచ్చింది. ఉజ్జయిని మాకు చాలా దగ్గర, ఇక్కడికి వస్తే చూడవచ్చు రమ్మన్నాడు. సరే రిజర్వేషన్లవీ(హైదరాబాద్ నించి భోపాల్, భోపాల్ నించి ఇండోర్, ఇండోర్ నించి మహూ) చేయించుకుని తయారయ్యాం ఉజ్జయినీ యాత్రకి.

ఎప్పటిలాగానే మా టీం లో అమ్మ, నేను, మా నిదానం అత్తయ్య , కంగారు మావయ్య(మూడో మావయ్య, అత్తయ్య. ఆవిడెంత నిదానమో, ఈయనకంత కంగారు, టెన్షను) , వీళ్ళతో బాటు నాలుగో అత్తయ్య కూడా వుంది. అందరం ఏదో దండయాత్ర కి బయలుదేరినట్టుగా అట్టహాసంగా బయలుదేరాం. అందరి మొహాల్లో గొప్ప సంతోషం. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం వున్న ఉజ్జయినీ నగరాన్ని చూడడానికి వెళ్తున్నామనే ఆనందం.

4.30 కే రైల్వే స్టేషన్ కి వచ్చేశాం(5.30 కి డిపార్చర్). తీరా వచ్చాక రైలు రెండున్నర గంటలు లేటు అని తెలిసింది. ఆదిలోనే హంస పాదం. ఎదురు చూడడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదుగా. అదే పని మొదలెట్టేశాం. అది డిసెంబర్ మొదటి వారమేమో సాయంత్రం ఐదింటికే చలి మొదలైంది (ఓపెన్ ఎయిర్ కదా). అందరం ముసుగులవీ వేసుకుని కన్నం వెయ్యడానికి వెళ్ళే దొంగల్లా తయారయ్యి ఎదురు చూస్తున్నాం(కన్నం వెయ్యడానికి కాదు సుమా) రైలు కోసం.

కొత్త పెళ్ళికూతురిలా నిదానంగా ఎనిమిదింటికి వచ్చింది రైలు. ఈ రైలు లేటవ్వడంతో పక్కరోజు మేము భోపాల్ చేరేసరికి మధ్యాహ్నం రెండైంది. భోపాల్ నించి ఇండోర్ కనెక్టింగ్ ట్రైన్ వెళ్ళిపోయింది. గంట తరవాత ఇంకో ట్రైన్ వుందన్నారు..మళ్లీ నిరీక్షణ. మా నిరీక్షణ ఫలించి, ఆ రైలోచ్చి మేము ఇండోర్ చేరేసరికి సాయంత్రమైపోయింది.

అక్కడ మా అన్నయ్య మాకోసం ఒక పెద్ద ఇడ్లీల బాగు తో (పొద్దున్నించి తిండి లేదు మాకు) ఎదురుచూస్తున్నాడు. రైలు రావడానికింకా టైం వుంది తినమంటే తినడానికి ప్రయత్నించి (ఆ ఇడ్లీలు గోడకి మేకులు కొట్టుకునేందుకు తప్ప, తినడానికి పనికి రావని తెలిసి) విఫలమై, నిరాహారంగా, నీరసంగా, నిరీక్షించీ నిరీక్షించీ శుష్కించే వేళకి రైలుగారు మమ్మల్ని కనికరించి విచ్చేసింది. ఆ మీటర్ గేజ్ బండి లో వూగి వూగి మహూ చేరే సరికి రాత్రి తొమ్మిది..అక్కడినించి ఇల్లు (క్వాటర్) చేరేసరికి పది గంటలైంది.

పక్కరోజు ఉదయం బయలుదేరి ఉజ్జయినీ వెళ్ళాము. ఇండోర్ నించి 55 కిమీ దూరం లో వుంది ఉజ్జయినీ నగరం. అక్కడ మొదట చూసింది మహాకాలేశ్వర్ గుడి. మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయాలలో ఒకటి మహాకాలేశ్వర స్వామి ఆలయం. ఐదు అంతస్తులుగా వున్నఈ ఆలయం గ్రౌండ్ లెవెల్ నించి చాలా కిందికి వుంటుంది. సుమారుగా మూడు అంతస్తుల వరకూ దిగి గర్భగుడిలోకి వెళ్ళాలి. అత్యంత తేజోవంతంగా వెలిగిపోతూ దర్శనమిచ్చే మహాకాలేశ్వర స్వామి (లింగాకారం) నించి దృష్టి మరలించుకోవడం చాలా కష్టం. ఈ గుడిలో ఇంకో విశేషమేంటంటే ఒకసారి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్నే మళ్లీ మళ్లీ నైవేద్యం పెట్టవచ్చునట.(ప్రసాదం చాలా బాగుంది మన మినపసున్ని లాగా).

అక్కడినించి క్షిప్రా నది ఒడ్డున వున్న "మహాకాళి"(అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ) ఆలయానికి వెళ్ళాం. అక్కడ అమ్మవారు సరస్వతి, లక్ష్మి, పార్వతి మూడు రూపాలతో దర్శనమిస్తుంది. కానీ నాకెందుకో మరి.. అంత స్పష్టంగా కనిపించలేదనిపించింది. తీర్ధ ప్రసాదాలు తీసుకుని బైటికొచ్చాం. ఈ గుడిలో భట్టి విక్రమార్కుల తైలవర్ణ చిత్రాలు, వారు వాడినవిగా చెప్పబడే కత్తులు, ఇంకా కొన్ని వస్తువులు ప్రదర్శనశాల లో వుంచారు.

అక్కడినించి బయలుదేరి ఊరి బైట వున్న "గడ్ కాళీ" ఆలయానికి వెళ్ళాం. ఉజ్జయినీ కోటని సదా రక్షించే శక్తి, భట్టి విక్రమార్కులకు ప్రత్యక్షమై వరాలిచ్చిన తల్లి ఈ "గడ్ కాళీ". నిలువెత్తు రూపమని అంటారు (ఇప్పుడు కేవలం తల మాత్రమే కనిపిస్తూంది). నాలుక బైటికి వుండి చూడడానికి చాలా భయమేస్తుందని ఏదేదో చెప్పారందరూ..కాని నాకు మాత్రం బాసరలో సరస్వతిలా.. ఐదారేళ్ళ చిన్న పిల్లకి చక్కని అలంకారం చేసి అక్కడ నిలబెట్టినట్టుగా అనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాను. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఆమె వాహనమైన పులి. ఈ గుడిలో విశేషమేంటంటే అమ్మవారికి "సారాయి" నైవేద్యం పెడతారు. ఇంకో విశేషం ఏంటంటే తెచ్చిన సారాయి అమ్మవారి నోట్లో పోస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి(నోటి నించి కంఠం లోకి చిన్న దారి లాగా వుంది). ఈ గుడి కూడా గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి వుంటుంది. ఈ అమ్మవారి గురించిన ప్రస్తావనలో మా అన్నయ్య "భట్టి విక్రమార్కులు, తెనాలి రామలింగడు, కాళిదాసు" ఈ ముగ్గురి కధని రంగరించి ఒక కొత్త కధని మా అత్తలకి వినిపించడం, వారెంతో భక్తీ శ్రద్దలతో వినడం ఒక చిన్న కొసమెరుపు.

ఇక్కడినించి బయలుదేరి కాలభైరవుడి గుడికి వెళ్ళాం. కాలభైరవుడి చాలా వింతగా వుంటుంది. విగ్రహం కళ్ళ స్థానంలో రెండు గుంతల్లాగా, నోరు స్థానంలో ఒక కన్నం వుండి చూడడానికి కాస్త భయంకరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి ఎదురుగా కుక్క విగ్రహం ప్రతిష్టించబడి వుంది. కాలభైరవుడికి కూడా నైవేద్యం సారాయే. ఒక చిత్రమేమిటంటే ఈ గుడి పరిసరాలలో కనిపించే వారంతా ఏదో మంత్ర విద్యలు వచ్చినవారిలా, రవ్వంత అనుమానాస్పదంగా కనిపిస్తారు.

చివరిగా రాధమాధవుడి గుడికి వెళ్ళాం. గుడి గోడలు, పై కప్పు అంతా తైలవర్ణ చిత్రాలు. శ్రీకృష్ణ లీలామృతం తో నిండిన చిత్రాలు. ఆ గుడి సింధియా రాజ వంశీయులు కట్టించారట. సుల్తానులు దాడి చేసి సుమారుగా 15 అడుగుల ఎత్తున్న వెండి సింహద్వారాల్ని కొల్లగొట్టి తీసుకెళ్ళిపోతూ వుంటే ప్రాణాలొడ్డి వెనక్కి తెచుకున్నారట సింధియా రాజ వంశీయులు. అద్భుతమైన కట్టడం..అందులో అత్యంత సమ్మోహన మూర్తి ఆ రాధామనోహరుడు. ఇక చెప్పడానికి మాటలే లేవు, అనుభూతించడం తప్ప.

ఇంతసేపు ఎంతో భక్తిగా అన్ని గుడుల గురించి చెప్పుకున్నాం కదా..ఇప్పుడో చిన్నసరదా అయిన రెండో కొసమెరుపు కధ చెప్పుకుందాం.

ముఖ్యమైన అన్ని గుడులు చూసినా ఇంకా చాలానే వున్నాయి చూడవలసిన ప్రదేశాలు. కాని అప్పటికే బాగా అలసిపోయి, ఆకలి వేస్తూండడం వల్ల హోటల్ కి వెళ్ళాం. మా మూడో మావయ్య "విపరీతమైన శాఖాహారి" (మేమంతా కూడా శాఖాహారులమే, కాకపోతే మా మావయ్య కాస్త భయంకరమైన శాఖాహారి. మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, ఆఖరికి కూరల్లో వేసే కరేపాకు కుడా తినడు ). అందుకని ఆయన కోసం ప్రత్యేకంగా అన్నం, మజ్జిగ పులుసు, పెరుగు మాత్రం చెప్పాం. అందులోంచి కూడా పోపులో వేసిన ఆవాలు, జీలకర్ర ఏరేసి ఆ తరవాత తిన్నాడు.

ఇక మా అమ్మకీ, అత్తలకీ , హిందీ రాదు. అందుకని అన్నయ్య చెప్పిన "తీకా...తీకా ఖానా(బాగా కారంగా) " ఓకే...ఓకే అంటూ ఒప్పేసుకున్నారు. తీరా తినడానికి వచ్చేసరికి అందరికి చెవుల్లోంచీ, ముక్కుల్లోంచీ నీళ్ళు. ఎద్దు బుస లాగ ముక్కుల్లోంచి వేడి గాలి. ఎలాగోలా కష్టపడి తిన్నారు. ఎన్ని మంచినీళ్ళు తాగినా, మగ్గులతో మజ్జిగ తాగినా, గుప్పిళ్ళతో పంచదార నోట్లో పోసుకున్నా కాని ఆ కారం తగ్గలేదు వాళ్లకి . ఆ తరవాత మేము బయలుదేరి మళ్లీ మహూ వచ్చేవరకూ ఎద్దుల్లా బుస కొడుతూనే వున్నారు పాపం . వాళ్ళని అంతలా ఆటపట్టించిన అన్నయ్య మాత్రం అచలపతిలా(అచలపతి కధల్లో హీరో) చిద్విలాసంగా వున్నాడు.

7 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

మొన్న పుష్కరాలు, ఇప్పుడు ఉజ్జయిని.. మీరు చిన్నప్పుడే యాత్రలన్నీ చేసేసినట్టున్నారే... బాగుందండీ టపా..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బావున్నాయి యాత్రా విశేషాలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి: పెద్దగా ఏమీ చెయ్యలేదండీ యాత్రలు...చాలా కొద్దిగా చూశాను. అందులో నాకు బాగా నచ్చిన క్షేత్రం ఉజ్జయినీ.
శేఖర్: ప్రతీ మనిషి జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన స్థలమండి ఉజ్జయిని. ఆ వూరి నిండా గుడులే. కుంభ మేళా కి జన్మస్తానమాట. ధన్యవాదాలు.

sunita చెప్పారు...

బాగుంది. నేను వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ఊరు అది. నేను కూడా ఆ దగ్గరలోనే భోపాలుకు దగ్గరగా పీజీ చేసాను. మీ బ్లాగు ఇవ్వాళ్ళే చూసాను. బాగుంది.

ప్రణీత స్వాతి చెప్పారు...

సునీత: ధన్యవాదాలండి.

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

మీరు రాసే విధానం,యాత్రా విశేషాలు రెండూ బాగున్నాయి

చందు చెప్పారు...

entndi meru chinnappudu edanna mingesaara...ade marchi poyi jandyala gari hasyaanni ani!!!