6, సెప్టెంబర్ 2009, ఆదివారం

నేనూ నా భాషా పాండిత్యమూ

మా ఇంట్లో అందరూ స్వచ్చమైన తెలుగు మాట్లాడతారు. మా తాతగారు గొప్ప పండితుడు. సహజంగానే అమ్మమ్మా, అమ్మా, మావయ్యలూ అందరూ తెలుగు భాషా కోవిదులే. మా పెద్దత్తయ్య అయితే ఉభయ భాషా ప్రవీణ. ఇటు సంస్కృతంలోనూ, అటు తెలుగులోనూ దిట్ట. రామాయణ, భారత, భాగవతాలన్నీ ఔపోసన పట్టేసిందనే చెప్పుకోవాలి. అందరూ ఒక చోట చేరితే ఏదో ఒక విషయం మీద చర్చ జరుపుతూ వుంటారు. భాగవత పద్యాలతో అంత్యాక్షరీ ఆడుకుంటారు. అంత ఎందుకండీ (మా తరంలో) మా అన్నయ్య చక్కటి కవితలు రాస్తూంటాడు. అలాంటి ఇంట్లో మా వాళ్ళ కర్మ కాలి నేను పుట్టానండి (ముసలంలాగా).  

ఈ పోటీ ప్రపంచం లో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీషు బాగా వచ్చి వుండాలి అనే ధోరణి ప్రాణం పోసుకుంటున్న రోజుల్లో పుట్టి పెరిగాం కదండీ..ఇక మాతృభాషేం వంటపడుతుందీ..? అలాగని ఇంగ్లీషు ఏమైనా అదరగొట్టేస్తాననుకుంటే చాలా పొరపాటు. మన ఇంగ్లీషు దెబ్బకి ఎదుటి వారు బెదిరి పారిపోవాల్సిందే. నేను ఐదవ తరగతి చదువుతూ వుండగా అనుకుంటా.. ఒకరోజు క్లాసులో మా ఇంగ్లీష్ టీచర్ "హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ" అని అడిగింది. "మై సెల్ఫ్, మై బ్రదర్, మదర్, గ్రాండ్ మదర్, అండ్ మై స్టెప్ మదర్ (పిన్నిని ఇంగ్లీషులో ఆంటీ అంటారని అప్పుడు నాకు తెలిదు)" అని ఎంతో వినయంగా చేతులు కట్టుకుని మరీ చెప్పాను నేను. మా ఇంగ్లీష్ టీచర్ తన పక్కనేదో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడింది. మీ నాన్నగారికి ఇద్దరు భార్యలా అని అడిగింది. నేను కాదన్నా. ఆవిడకి అప్పటికి విషయం అర్ధమై ఒకటే నవ్వు. నా ఇంగ్లీషు భాషా పరిజ్ఞానానికి ఇది ఒక చిన్న మచ్చు తునక.

ఇంగ్లీషు భాష ధ్వంసం అయిపోయింది.. ఇక తెలుగు భాష హింస..!! సాధారణంగా క్లాసులో అందరినీ ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ వుంటుంది మా తెలుగు టీచర్. కాని నాకు అత్యుత్సాహం పొంగి పోరలిపోతూ వుంటుంది ఎప్పుడూ.. అందుకని ఆవిడ ఎవరిని అడిగినా ముందు నేను స్ప్రింగు లాగా లేచి నా వాక్చాతుర్యమంతా ప్రదర్శించి ఆవిడని భయపెడుతూ వుంటానన్నమాట . అలాగే ఒకసారి "సాలగ్రామాలు(చిన్నగా గుండ్రంగా వుండే రాళ్ళు..విగ్రహాలకంటే పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు)" అంటే ఏంటో చెప్పమని అందరినీ అడిగింది. ఆవిడా ప్రశ్న అడగడమే ఆలస్యం..వెంటనే లేచి అదేదో నేనే కనిపెట్టిన విషయం లాగా అత్యంత ఉత్సాహంగా "ఉల్లిపాయలు" అని చెప్పా. యధావిధిగా మా టీచర్ అదిరిపడింది. పాపం ఆవిడ నోట మాట రాలేదు కాసేపు. ఇంతకీ అసలు విషయమేంటంటే మా అమ్మమ్మ సరదాగా ఉల్లిపాయల్ని సాలగ్రామాలు అని పిలిచేది. మరి ఆ విషయం నాకేం తెలుసు? మా టీచర్ అడగ్గానే నాకు తెలిసింది చెప్పాను.


ఇంకోసారీ..వామనావతార విశేషం చెప్పమంది. యధావిధిగా మళ్ళీ నేను నా అత్యుత్సాహాన్ని తెచ్చుకుని "వామనుడు విష్ణుమూర్తి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని దానమడగ్గానే..బలి చక్రవర్తి తన కాలి తొడలోంచి ఫ్లెష్ కట్ చేసి వామనుడికి దానం ఇచ్చాడు. ఆ తరవాత వామనుడు విష్ణుమూర్తి అవతారంలో శిబి చక్రవర్తిని మూడడుగుల నేల దానమివ్వమని అడిగి.. మొదటి అడుగు నేల మీద, రెండో అడుగు ఆకాశంలో పెట్టి మూడో అడుగు శిబి చక్రవర్తి తల మీద పెట్టి ఆయన్ని అండర్ గ్రౌండ్ లోకి తొక్కేశాడు" అని తెలుగు, ఇంగ్లీషు కలిపి..కధంతా సంకరం చేసి చెప్పాను. పాపం మా తెలుగు టీచర్ బిక్కచచ్చిపోయి నిలువు గుడ్లేసుకుని, నోట మాట రాక (అచ్చం సినిమాల్లో బ్రహ్మానందం లాగా) పాపం చాలా అవస్త పడింది. ఆ తరవాత నన్ను పక్కకి పిలిచి చేతిలో చెయ్యి వేయించుకుని మాట తీసుకుంది ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆవిడ ప్రాణాల మీదికి తీసుకురావద్దనీ , ఇక మీదట తన ప్రశ్నలకి జవాబు చెప్పే అవకాశం మిగతా పిల్లలకి వదిలేయ్యమనీ..!! ఇలా స్కూల్లో మన ప్రతాపానికి జడిసి టీచర్లు మిగతా పిల్లల్ని కూడా ప్రశ్నలు అడగడం మానేశారు (ఎందుకంటే ప్రశ్న ఎవరికి వేసినా జవాబు మాత్రం ముందు నా దగ్గర్నించే వచ్చేది).


స్కూల్లో భాగోతం చూశారు కదండీ ఇక ఇంటికి వెళ్దాం. అమ్మ నల్గొండ జిల్లాలో పని చేస్తున్నప్పుడు ఒకసారి ఏదో మీటింగ్ వుందని తన స్టాఫ్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది. డిన్నర్ మా ఇంట్లోనే చేసి మళ్లీ ఆ రాత్రికే వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన. స్టాఫ్ అందరితో కలిసి ఇంటికొచ్చింది. తనే స్వయంగా అందరికి విస్తళ్ళు వేసి వడ్డించి ఇంకా ఏదో కావాల్సి వచ్చి వంటగదిలోకి వెళ్తూ "వాళ్ళని మొహమాట పడద్దని చెప్పు" అని నాకు చెప్పింది. నేను నా సహజ రీతిలో పాండిత్యాన్నంతా ఒలకబోస్తూ "అస్సలు మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా భోంచేయ్యండి" అని చెప్పాను. అంతే..!!పాపం కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా నల్లగా మాడిపోయాయి వాళ్ళ మొహాలు. పాపం విస్తళ్ళ ముందు కూర్చున్న వాళ్లకి ముద్ద నోట్లోకి వెళ్తే ఒట్టు. మింగలేరూ, కక్కలేరూ. లేద్దామంటే అమ్మోఆఫీసర్ గారు ఏమనుకుంటారోనని ..పోనీ తిందామా అంటే పాపం అంతలేసి మాటలనిపించుకున్నాక ఎలా తినగలరు..? ఇంతలో అమ్మ నా మాటలు విని లోపల్నించి బైటికి వచ్చి వాళ్ళందరికీ సారీ చెప్పి శాంతపరిచింది. ఇంతకీ ఇంత చేసిన నేను మాత్రం బైట నా ఫ్రెండ్స్ తో హాయిగా ఆడుకుంటున్నా(అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు). 


ఇలా భయంకర భాషా పాండిత్యమే కాదండి..చిన్నప్పుడు నాకు విపరీతమైన అనుమానాలు వస్తూ వుండేవి(నాకు doubting thomas అని పేరుండేది ) . ప్రతీదీ చదవడం లేక వినడం..జనాల ప్రాణాలు తినడం. ఒకసారి మా అమ్మమ్మ మమ్మలనందరినీ కూర్చోపెట్టుకుని రామాయణం చెప్తోంది. అందులో వానర సేన గురించిన ప్రస్తావన వచ్చింది. వెంటనే నాకో అనుమానమూ వచ్చింది. "వానరులంటే తోకలుంటాయి కదా..వాలికీ, సుగ్రీవుడికీ అందరికీ తోకలుంటాయి కదా.. మరి వాళ్ళ భార్యలకీ తోకలు వుంటాయా..వుంటే వాళ్ళు చీరలు ఎలా కట్టుకుంటారు.." అని. ఆ దెబ్బకి మా అమ్మమ్మ భయపడిపోయి నేనుండగా ఏవీ చెప్పడం మానేసింది. 


ఇలా నా ఈ పాండిత్య ప్రదర్శనతో జనాల్ని బాదడం నేను ఇంటర్ చదివే రోజుల్లో కూడా సాగింది. ఒకసారి మా ఫ్రెండ్ ఏదో ఇంటర్వ్యూకని నన్ను తోడు తీసుకుని వెళ్ళింది. ఇంటర్వ్యూ అయిపోయాక బైటికొచ్చి వాన పడుతోంటే ఒక షెల్టర్ కింద నిలబడ్డాం. మాతో బాటు చాలా మంది అక్కడ వున్నారు. ఇంతలో ఒక గేదె అటుగా వెళ్తూ నా కంట పడింది. వెంటనే నాలోని doubting thomas మేల్కొన్నాడు. ఆ వెంటనే మా ఫ్రెండ్ ని పిలిచి ఆ గేదెని చూపించి "అది ఆంటీ నా అంకులా" అని అడిగా. ఒక్కసారిగా అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు. మా ఫ్రెండ్ పాపం.. ఏం చెప్పాలో తోచక నన్ను అక్కడినించి లాక్కెళ్ళిపోయింది. ఇలా ఒక్క మా స్కూల్ లోనే కాదు..ఇంట్లో అమ్మావాళ్ళు, అమ్మమ్మా వాళ్ళు, నా ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్, ఇరుగూ, పొరుగూ... అందరూ నా పాండిత్యానికి బలైపోయినవాళ్ళే...పాపం!!




18 కామెంట్‌లు:

raviteja చెప్పారు...

ఆద్యంతం భలే funny గా ఉందండీ.. ముఖ్యంగా ఆ ఆడ వానరుల చీరకట్టు doubt... హహ్హహ్హ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హహ్హ..హా...
సూపర్ గా రాసారు Thomas గారు...{ ఊరికే సరదాగా }.

సిగ్గు లేకుండా భోంచెయ్యమనటం, ఆంటీ/అంకుల్ గేదె డవుట్, శిభి చక్రవర్తి, వానరుల పెళ్ళాల చీరతో తోక కష్టాల సందేహం...అన్నీ భలే అదరగొట్టేసారు.

Hima bindu చెప్పారు...

-:):)

మా ఊరు చెప్పారు...

మొహమాటం
లేకుండా
సిగ్గు
లేకుండా
చదివేసాను

మురళి చెప్పారు...

నవ్వి నవ్వి కన్నీళ్ళొచ్చాయండి.. 'స్టెప్ మదర్..' :-) :-) స్కూల్ రోజుల్లో నేను కూడా మీలాగే ఇంగ్లీష్ దంచేసేవాడిని.. 'ఇవాళ మా వర్కింగ్ వుమన్ రాలేదు' అని మా ఫ్రెండ్స్ కి చెబితే వాళ్ళు నోళ్ళు తెరుచుకుని వినేవాళ్ళు.. దుంపల బడి కదా.. నేనే మేధావినన్న మాట :-) :-) చాలా బాగుంది మీ టపా...

ప్రణీత స్వాతి చెప్పారు...

రవితేజ: అయ్యో ఇంకా చాలా విచిత్రంగా వచ్చేవండి డౌట్లు...ధన్యవాదాలు.
శేఖర్ పెద్దగోపు: పర్లేదండీ..నా ముద్దు పేరదేగా.. ధన్యవాదాలు.
చిన్ని: ధన్యవాదాలు.
మా ఊరు: గుడ్. నా దారిలోకి వచ్చేసారన్నమాట.
మురళి: ఇప్పటికీ ఆ "స్టెప్ మదర్" అనే మాట తలచుకుని తలచుకుని నవ్వుకుంటూ వుంటారండి మా మేధావులు (అదే అమ్మా వాళ్ళూ). ధన్యవాదాలు.

జయ చెప్పారు...

చాలా బాగా ఎంజాయ్ చేసాను. ఎప్పుడూ ఇలాగే నవ్విస్తూ ఉంటారు కదూ!

ప్రణీత స్వాతి చెప్పారు...

తప్పకుండా.. ఎప్పుడూ నా ప్రయత్నమదేనండీ..ధన్యవాదాలు.

తృష్ణ చెప్పారు...

ఇప్పటిదాకా చదివిన టపాలన్నింటిలో పడీ,పడీ నవ్విన ఏకైక పోశ్ట్..ఇది.సూపర్...!

ప్రణీత స్వాతి చెప్పారు...

తృష్ణ: ధన్యవాదాలు

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

ఆద్యంతం నవ్వించారు. ముఖ్యంగా ఉల్లిపాయలు అన్నప్పుడు నవ్వాపుకోలేక పోయాను. ఇంకానయం జలపుష్పాలూ గురించి అడగలేదనుకుంటా మీ మేడం. మీ అనుమానాలూ బగున్నాయి.

" ఇంట్లో అమ్మావాళ్ళు, అమ్మమ్మా వాళ్ళు, నా ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్, ఇరుగూ, పొరుగూ... అందరూ నా పాండిత్యానికి బలైపోయినవాళ్ళే...పాపం!! "


ఇప్పుడు నాకర్థమైంది, మీరు బ్లాగులోకంలోకి ఎందుకు వచ్చారో :) :)

ప్రణీత స్వాతి చెప్పారు...

విశ్వ ప్రేమికుడు : భలే కనిపెట్టేశారండీ...:) :)

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

సేం టు సేం మీకు వచ్చిన తోకడౌటే నాకూవస్తే ఎవ్వరూ తీర్చలేదు. ఇప్పుడు నాకనిపిస్తుంది ఆడవానరులు తోకల్ని నడుముకి వడ్డాణంలానో, బెల్టులానో చుట్టేసుకుని ఆతర్వాత చీరకట్టుకుంటారనుకుంటా.
ఇలాఊరకే అనుమానాలొచ్చే వాళ్లని "వీర‌అనుమాన్" అనొచ్చా?

ప్రణీత స్వాతి చెప్పారు...

@ సుబ్రమణ్య చైతన్య: అలాగంటారా..అలాగే అనేసుకుందాం..ధన్యవాదాలు.

Sai Praveen చెప్పారు...

భలే ఉందండి. చాలా నవ్వుకున్నాను. :)

చందు చెప్పారు...

entandi balakrisna garu thoda gotti,molathadu thoti, chapesinattu mee baasha chaturyam to maa blogers andarini chapesthara enti ? hamma chachanu ippatidaka navvaleka ....marchipoya navveppudu nenu kurchi lonchi jaari paddanandi mee daya valla ........!!! :-(

చందు చెప్పారు...

నా కళ్ళల్లో తడి ...!!! :-(
http://sarasalalonavarasaalu.blogspot.com/2010/07/airforce.html

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

బాబోయ్ మీకింత స్టోరీ ఉందా? చాలా బాగా రాసారు .......చాలా ఫన్నీ గా రాసారు .... బ్లాగ్ కి అంత మంచి పేరు పెట్టుకున్నారు గా అయినా !