10, సెప్టెంబర్ 2009, గురువారం

కూనలమ్మ పదాలు



కూనలమ్మ పదాలు..అలతి అలతి పదాలు..అద్భుతమైన అర్ధాలు..ఎన్నో జీవిత సత్యాలు..!!

ఆరుద్ర గారు రాసిన ఈ పుస్తకం నాకెంతో ఇష్టం. ఎప్పటిలాగానే అబిడ్స్ వెళ్ళినప్పుడు విశాలాంధ్రకి వెళ్లానొకరోజు. ఎదురుగా వున్న డిస్ ప్లే స్టాండు లో "కూనలమ్మ పదాలు" పుస్తకం కనిపించింది. నాకున్న అలవాటేంటంటే పుస్తకాలు కొనుక్కుని ఇంటికి వచ్చాక వాటన్నిటి మీదా నా సంతకం పెట్టి, పుస్తకం కొన్న తేదీ వేసిన తరవాతే పుస్తకం చదువుతాను (రెండు మూడు రోజులు ఆలస్యమైనా సరే సంతకం చెయ్యనిదే పుస్తకం చదవను).

అలాంటిది... అసలు "కూనలమ్మ పదాలు" లోపల కంటెంట్ ఏంటో చూద్దామని స్టాండు లోంచి తీసి పుస్తకం తెరిచిన దాన్ని అక్కడే, అలాగే నిలబడి మొత్తం పుస్తకం చదివేశాను. ఆ తరవాత ఇంకే పుస్తకం జోలికీ వెళ్ళలేదు. కూనలమ్మ పదాలు ఒక పాతిక కాపీలు కొనుక్కున్నాను(నాకు నచ్చిన పుస్తకం, నాకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వటం నాకో అలవాటు). ఎంతో ఇష్టంగా కూనలమ్మ పదాల్ని అందరికీ పంచిన నేను నా పుస్తకాన్ని ఉజ్జయినీ వెళ్ళినప్పుడు రైల్లో పోగొట్టుకున్నానండి.. ఆ తరవాత చాలా ప్రయత్నించాను, దొరకలేదు. మళ్ళీ మొన్న విశాలాంధ్ర కి వెళ్ళినప్పుడు అడిగితే మొదట లేవన్నాడు..అంతలోనే వెతికి మరీ తెచ్చిచ్చాడు "ఆఖరి కాపీ". నాకెంతో నచ్చిన ఆ పుస్తకం మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది. అందుకే నా ఈ చిన్ని ప్రయత్నం.

ముమ్మాటికీ...

"కూనలమ్మ పదాలు...వేనవేలు రకాలు...ఆరుద్రదే వ్రాలు...అంటారు శ్రీ శ్రీ..!!
కూనలమ్మ పదాలు...లోకానికి సవాలు...ఆరుద్ర చేవ్రాలు...అంటారు శ్రీ శ్రీ..!!
కూనలమ్మ పదాలు...కోరుకున్న వరాలు...ఆరుద్ర సరదాలు...అంటారు శ్రీ శ్రీ..!!"

ఇంత అందంగా శ్రీ శ్రీ గారితో ముందు మాట చెప్పించుకున్న ఈ కూనలమ్మ పదాలు...తన మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణకు పెళ్లి కానుకగా ఆరుద్ర రాసి ఇచ్చిన ఈ కూనలమ్మ పదాలు...అలతి అలతి పదాలు..అద్భుతమైన అర్ధాలు..ఎన్నో జీవిత సత్యాలు..!!

కూనలమ్మ పదాలు సుమారుగా నూటయాభై వరకు వున్నాయి. నాకెంతో నచ్చిన ఈ కూనలమ్మ పదాల్లోంచి కొన్ని మెచ్చు తునకలు..

"చిన్ని పాదములందు...చివరి ప్రాసల చిందు...చేయు వీనుల విందు...ఓ కూనలమ్మ..!!
కొంత మందిది నవత...కొంత మందిది యువత...కృష్ణ శాస్త్రిది కవిత...ఓ కూనలమ్మ..!!

కొంటె బొమ్మల బాపు...కొన్ని తరముల సేపు...గుండె వూయల నూపు...ఓ కూనలమ్మ..!!
హాస్యమందున అఋణ...అందె వేసిన కరుణ...బుడుగు వెంకటరమణ...ఓ కూనలమ్మ..!!

ఎంకి పాటల దారి...ఎడద గుర్రపు స్వారి...చేయులే నండూరి...ఓ కూనలమ్మ..!!
చివరి ప్రాసల నాభి...చిత్రమైన పఠాభి...కావ్య సుధల షరాభి...ఓ కూనలమ్మ..!! "

నండూరి వారి ఎంకి నిజంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించిందేమో అనిపించిందీ పద్యంలో. ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ బాపూగారి బొమ్మలు. ప్రతీ పద్యానికీ తగినట్టుగా అందంగా, కొంటెగా వేశారు బొమ్మలు.

"భాగవతమున భక్తీ...భారతములో యుక్తి...రామ కధయే రక్తి...ఓ కూనలమ్మ..!!
బహుదినమ్ములు వేచి...మంచి శకునము చూచి...బయళుదేరఘ హా--చ్చి... ఓ కూనలమ్మ..!!

గుండెలో శూలమ్ము...గొంతులో శల్యమ్ము...కూళతో స్నేహమ్ము...ఓ కూనలమ్మ..!!

నరుడు మదిలో దొంగ...నాల్క బూతుల బుంగ...కడుగ జాలదు గంగ...ఓ కూనలమ్మ..!!

ఆత్మవంచన వల్ల...ఆడు కల్లల వల్ల...అగును హృదయము డొల్ల...ఓ కూనలమ్మ..!!
మనసు తెలుపని భాష...మంచి పెంచని భాష...ఉత్త సంద్రపు ఘోష...ఓ కూనలమ్మ..!! "

ఆరుద్ర గారు సిని కవిగానే తెలుసు నాకు ఈ కూనలమ్మ పదాలు చదివే వరకూ ..కానీ ఆయన కవిత్వమే కాక కధలూ..నవలలూ..నాటకాలూ..పత్రికా వ్యాసాలూ..ఇలా ఎన్నెన్నో రచనలు చేశారట. అది తెలిశాక చాలా ప్రయత్నం చేశా..ఇంకేమైనా వారి రచనలు దొరుకుతాయేమోనని..కానీ దొరకలేదు.

"మరియొకరి చెడు తేది...మనకు నేడు ఉగాది...పంచాంగ మొక సోది...ఓ కూనలమ్మ..!!

గుడి గోడ నలరారు...పడతి దుస్తుల తీరు...ఫిల్ములో సెన్సారు...ఓ కూనలమ్మ..!!

ఆశ తీరని తృష్ణ...అఘము తేలని ప్రశ్న...ప్రతిభ అడవుల జ్యోత్స్న...ఓ కూనలమ్మ..!!
తమలపాకు నములు... దవడతో మాట్లాళు...తానె వచ్చును తమిళు...ఓ కూనలమ్మ..!!

అడ్డు తగిలిన కొలది...అమిత శక్తులు గలది...అబల అగునా వెలది...? ఓ కూనలమ్మ..!!
అతివ పురుషుని దీటు...అనుచు నభమున చాటు...ఆడ కాస్మోనాటు...ఓ కూనలమ్మ..!!

నరము లందున కొలిమి...నాగుపాముల చెలిమి...అల్పబుద్ధుల కలిమి...ఓ కూనలమ్మ..!!
పరుల ఇంటను పెరిగే...పరుల పడతుల మరిగే...పరతత్త్వమై సురిగే...ఓ కూనలమ్మ..!! "

నిజ జీవితంలో మనకి ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులూ, ఆనందాలు..వెరసి ఆరుద్రగారు రాసిన ఈ కూనలమ్మ పదాలు. మనందరం తప్పనిసరిగా చదివి ఆకళింపు చేసుకుని ఆచరించాల్సిన జీవిత సత్యాలు.

సాహిత్యం ఆర్ణవమైతే....ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే....ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖ లేదు...ఆ శాఖ పై అతడు పూయించని పువ్వుల్లేవు. అతని "కూనలమ్మ పదాలు" ప్రతిపద రమణీయం....పదపద చమత్కారం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు.



6, సెప్టెంబర్ 2009, ఆదివారం

నేనూ నా భాషా పాండిత్యమూ

మా ఇంట్లో అందరూ స్వచ్చమైన తెలుగు మాట్లాడతారు. మా తాతగారు గొప్ప పండితుడు. సహజంగానే అమ్మమ్మా, అమ్మా, మావయ్యలూ అందరూ తెలుగు భాషా కోవిదులే. మా పెద్దత్తయ్య అయితే ఉభయ భాషా ప్రవీణ. ఇటు సంస్కృతంలోనూ, అటు తెలుగులోనూ దిట్ట. రామాయణ, భారత, భాగవతాలన్నీ ఔపోసన పట్టేసిందనే చెప్పుకోవాలి. అందరూ ఒక చోట చేరితే ఏదో ఒక విషయం మీద చర్చ జరుపుతూ వుంటారు. భాగవత పద్యాలతో అంత్యాక్షరీ ఆడుకుంటారు. అంత ఎందుకండీ (మా తరంలో) మా అన్నయ్య చక్కటి కవితలు రాస్తూంటాడు. అలాంటి ఇంట్లో మా వాళ్ళ కర్మ కాలి నేను పుట్టానండి (ముసలంలాగా).  

ఈ పోటీ ప్రపంచం లో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీషు బాగా వచ్చి వుండాలి అనే ధోరణి ప్రాణం పోసుకుంటున్న రోజుల్లో పుట్టి పెరిగాం కదండీ..ఇక మాతృభాషేం వంటపడుతుందీ..? అలాగని ఇంగ్లీషు ఏమైనా అదరగొట్టేస్తాననుకుంటే చాలా పొరపాటు. మన ఇంగ్లీషు దెబ్బకి ఎదుటి వారు బెదిరి పారిపోవాల్సిందే. నేను ఐదవ తరగతి చదువుతూ వుండగా అనుకుంటా.. ఒకరోజు క్లాసులో మా ఇంగ్లీష్ టీచర్ "హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ" అని అడిగింది. "మై సెల్ఫ్, మై బ్రదర్, మదర్, గ్రాండ్ మదర్, అండ్ మై స్టెప్ మదర్ (పిన్నిని ఇంగ్లీషులో ఆంటీ అంటారని అప్పుడు నాకు తెలిదు)" అని ఎంతో వినయంగా చేతులు కట్టుకుని మరీ చెప్పాను నేను. మా ఇంగ్లీష్ టీచర్ తన పక్కనేదో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడింది. మీ నాన్నగారికి ఇద్దరు భార్యలా అని అడిగింది. నేను కాదన్నా. ఆవిడకి అప్పటికి విషయం అర్ధమై ఒకటే నవ్వు. నా ఇంగ్లీషు భాషా పరిజ్ఞానానికి ఇది ఒక చిన్న మచ్చు తునక.

ఇంగ్లీషు భాష ధ్వంసం అయిపోయింది.. ఇక తెలుగు భాష హింస..!! సాధారణంగా క్లాసులో అందరినీ ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ వుంటుంది మా తెలుగు టీచర్. కాని నాకు అత్యుత్సాహం పొంగి పోరలిపోతూ వుంటుంది ఎప్పుడూ.. అందుకని ఆవిడ ఎవరిని అడిగినా ముందు నేను స్ప్రింగు లాగా లేచి నా వాక్చాతుర్యమంతా ప్రదర్శించి ఆవిడని భయపెడుతూ వుంటానన్నమాట . అలాగే ఒకసారి "సాలగ్రామాలు(చిన్నగా గుండ్రంగా వుండే రాళ్ళు..విగ్రహాలకంటే పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు)" అంటే ఏంటో చెప్పమని అందరినీ అడిగింది. ఆవిడా ప్రశ్న అడగడమే ఆలస్యం..వెంటనే లేచి అదేదో నేనే కనిపెట్టిన విషయం లాగా అత్యంత ఉత్సాహంగా "ఉల్లిపాయలు" అని చెప్పా. యధావిధిగా మా టీచర్ అదిరిపడింది. పాపం ఆవిడ నోట మాట రాలేదు కాసేపు. ఇంతకీ అసలు విషయమేంటంటే మా అమ్మమ్మ సరదాగా ఉల్లిపాయల్ని సాలగ్రామాలు అని పిలిచేది. మరి ఆ విషయం నాకేం తెలుసు? మా టీచర్ అడగ్గానే నాకు తెలిసింది చెప్పాను.


ఇంకోసారీ..వామనావతార విశేషం చెప్పమంది. యధావిధిగా మళ్ళీ నేను నా అత్యుత్సాహాన్ని తెచ్చుకుని "వామనుడు విష్ణుమూర్తి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని దానమడగ్గానే..బలి చక్రవర్తి తన కాలి తొడలోంచి ఫ్లెష్ కట్ చేసి వామనుడికి దానం ఇచ్చాడు. ఆ తరవాత వామనుడు విష్ణుమూర్తి అవతారంలో శిబి చక్రవర్తిని మూడడుగుల నేల దానమివ్వమని అడిగి.. మొదటి అడుగు నేల మీద, రెండో అడుగు ఆకాశంలో పెట్టి మూడో అడుగు శిబి చక్రవర్తి తల మీద పెట్టి ఆయన్ని అండర్ గ్రౌండ్ లోకి తొక్కేశాడు" అని తెలుగు, ఇంగ్లీషు కలిపి..కధంతా సంకరం చేసి చెప్పాను. పాపం మా తెలుగు టీచర్ బిక్కచచ్చిపోయి నిలువు గుడ్లేసుకుని, నోట మాట రాక (అచ్చం సినిమాల్లో బ్రహ్మానందం లాగా) పాపం చాలా అవస్త పడింది. ఆ తరవాత నన్ను పక్కకి పిలిచి చేతిలో చెయ్యి వేయించుకుని మాట తీసుకుంది ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆవిడ ప్రాణాల మీదికి తీసుకురావద్దనీ , ఇక మీదట తన ప్రశ్నలకి జవాబు చెప్పే అవకాశం మిగతా పిల్లలకి వదిలేయ్యమనీ..!! ఇలా స్కూల్లో మన ప్రతాపానికి జడిసి టీచర్లు మిగతా పిల్లల్ని కూడా ప్రశ్నలు అడగడం మానేశారు (ఎందుకంటే ప్రశ్న ఎవరికి వేసినా జవాబు మాత్రం ముందు నా దగ్గర్నించే వచ్చేది).


స్కూల్లో భాగోతం చూశారు కదండీ ఇక ఇంటికి వెళ్దాం. అమ్మ నల్గొండ జిల్లాలో పని చేస్తున్నప్పుడు ఒకసారి ఏదో మీటింగ్ వుందని తన స్టాఫ్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది. డిన్నర్ మా ఇంట్లోనే చేసి మళ్లీ ఆ రాత్రికే వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన. స్టాఫ్ అందరితో కలిసి ఇంటికొచ్చింది. తనే స్వయంగా అందరికి విస్తళ్ళు వేసి వడ్డించి ఇంకా ఏదో కావాల్సి వచ్చి వంటగదిలోకి వెళ్తూ "వాళ్ళని మొహమాట పడద్దని చెప్పు" అని నాకు చెప్పింది. నేను నా సహజ రీతిలో పాండిత్యాన్నంతా ఒలకబోస్తూ "అస్సలు మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా భోంచేయ్యండి" అని చెప్పాను. అంతే..!!పాపం కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా నల్లగా మాడిపోయాయి వాళ్ళ మొహాలు. పాపం విస్తళ్ళ ముందు కూర్చున్న వాళ్లకి ముద్ద నోట్లోకి వెళ్తే ఒట్టు. మింగలేరూ, కక్కలేరూ. లేద్దామంటే అమ్మోఆఫీసర్ గారు ఏమనుకుంటారోనని ..పోనీ తిందామా అంటే పాపం అంతలేసి మాటలనిపించుకున్నాక ఎలా తినగలరు..? ఇంతలో అమ్మ నా మాటలు విని లోపల్నించి బైటికి వచ్చి వాళ్ళందరికీ సారీ చెప్పి శాంతపరిచింది. ఇంతకీ ఇంత చేసిన నేను మాత్రం బైట నా ఫ్రెండ్స్ తో హాయిగా ఆడుకుంటున్నా(అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు). 


ఇలా భయంకర భాషా పాండిత్యమే కాదండి..చిన్నప్పుడు నాకు విపరీతమైన అనుమానాలు వస్తూ వుండేవి(నాకు doubting thomas అని పేరుండేది ) . ప్రతీదీ చదవడం లేక వినడం..జనాల ప్రాణాలు తినడం. ఒకసారి మా అమ్మమ్మ మమ్మలనందరినీ కూర్చోపెట్టుకుని రామాయణం చెప్తోంది. అందులో వానర సేన గురించిన ప్రస్తావన వచ్చింది. వెంటనే నాకో అనుమానమూ వచ్చింది. "వానరులంటే తోకలుంటాయి కదా..వాలికీ, సుగ్రీవుడికీ అందరికీ తోకలుంటాయి కదా.. మరి వాళ్ళ భార్యలకీ తోకలు వుంటాయా..వుంటే వాళ్ళు చీరలు ఎలా కట్టుకుంటారు.." అని. ఆ దెబ్బకి మా అమ్మమ్మ భయపడిపోయి నేనుండగా ఏవీ చెప్పడం మానేసింది. 


ఇలా నా ఈ పాండిత్య ప్రదర్శనతో జనాల్ని బాదడం నేను ఇంటర్ చదివే రోజుల్లో కూడా సాగింది. ఒకసారి మా ఫ్రెండ్ ఏదో ఇంటర్వ్యూకని నన్ను తోడు తీసుకుని వెళ్ళింది. ఇంటర్వ్యూ అయిపోయాక బైటికొచ్చి వాన పడుతోంటే ఒక షెల్టర్ కింద నిలబడ్డాం. మాతో బాటు చాలా మంది అక్కడ వున్నారు. ఇంతలో ఒక గేదె అటుగా వెళ్తూ నా కంట పడింది. వెంటనే నాలోని doubting thomas మేల్కొన్నాడు. ఆ వెంటనే మా ఫ్రెండ్ ని పిలిచి ఆ గేదెని చూపించి "అది ఆంటీ నా అంకులా" అని అడిగా. ఒక్కసారిగా అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు. మా ఫ్రెండ్ పాపం.. ఏం చెప్పాలో తోచక నన్ను అక్కడినించి లాక్కెళ్ళిపోయింది. ఇలా ఒక్క మా స్కూల్ లోనే కాదు..ఇంట్లో అమ్మావాళ్ళు, అమ్మమ్మా వాళ్ళు, నా ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్, ఇరుగూ, పొరుగూ... అందరూ నా పాండిత్యానికి బలైపోయినవాళ్ళే...పాపం!!




29, ఆగస్టు 2009, శనివారం

అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?



"అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?
అని అడిగాడు నాలుగేళ్ల పిల్లవాడు మరోసారి..
అలవోకగా వాడి తల నిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు..
ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మరఫిరంగులు పేలిన జాడలు
కాశ్మీరు సరిహద్దుల్లో కమ్ముకొన్న నల్లని పొగల మధ్య
కాలూని నిల్చున్న సైనికుడు చటుక్కున
ఆమె కళ్ల ముందు నిలిచాడు.

ఆమె కళవళ పడింది...నిట్టూర్చింది...పైట సరిచేసుకుంది
అంతలో మృదుగర్వరేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలిసిపోయింది
పార్కు బెంచీమీద నుండి లేచి పిల్లవాడికి చేయూతనిచ్చి
మెల్లగా నడుస్తూ మునిమాపు చీకట్లలో కలిసిపోయింది.

ఆమె రోజూ వస్తుంది పార్కులోకి వార్తలకోసం
అలాగే తెల్లని చీర కట్టుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు తురుముకుని
అదే పార్కు అదే రోడ్డు అదే బజారు అదే ఇల్లు
అయినా ఆమె ఏదో మార్పుని పసికట్టింది
అందరూ తింటున్నారు తిరుగుతున్నారు
అయినా ఎక్కడో డెక్కు పట్టింది.

బిగవట్టిన నగరాల నరాల మీద ఏవో వార్తల గుసగుసలు
బిగించిన పిడికిళ్ళ సందులనుండి జారిన నెత్తుటి ప్రతిజ్ఞలు
ఒకే వూరు ఒకే తూగు ఒకే దీక్ష...జాలి మేల్కొన్న గుర్తులు,
ఒక దేశం తన దారిన తాను పోతూవుంటే
ఊరుకోదు ఇరవయ్యో శతాబ్దపు నాగరికత
పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది
పక్కవాడి సౌభాగ్యం బాలీశుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది
ఆసియారంగం మీద నియంతలవతరించిన దుర్ముహూర్తాలివి ...చరిత్రకు సిగ్గుచేటు.

ప్రజల నోళ్లుకొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి
గజదొంగ లీనాడు రాజులై రారాజులై ఏలుతున్నారు
అందుకే భారతం పొడ వారికి కిట్టదు, రాజకీయ ద్యూతంలో...లాభం ముట్టదు.

మెత్తగా వుంటే పిల్లి అన్నారు
తిరగబడి మొత్తితే బెబ్బులి అన్నారు
అవకాశవాదులు నోరు తెరిస్తే దుర్వాసన
నీతిని విడిచిపెడితే రాజనీతి అవుతుంది
జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది
పాకిస్తాన్ చైనాల పరస్పర మైత్రి
పాము తోడేలూ కలిసినట్టు
ఇది రెండు దేశాల మధ్య యుధమే కాదు
ఇది కాస్త భూమికై కయ్యమే కాదు
ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది
భావనా స్వాతంత్ర్యం వ్యక్తీ గౌరవం వర్ణ వర్గ మతభేద రాహిత్యం దీనికి పునాది
ప్రతి భారతీయుడు ఒక సోల్జర్ ప్రతి హృదయం ఒక శతఘ్ని
రేడియోలో వార్తలు రోజూ వస్తున్నాయి
విజయ పరంపరను అందిస్తున్నాయి.

శత్రువుల టాంకులు విమానాలు ఎన్నో ఎన్నో కూలిపోయాయి
సాహసోపేతమైన భారతీయ సైన్యతరంగం
లాహొర్ సరిహద్దుల మీద విరుచుకుపడింది.
నిర్నిద్రహర్యక్షమై జాతి నిలబడి గర్జించింది
కీలర్, అబ్దుల్ హమీద్, హవల్దార్ పోతరాజు
ఇంకా లక్షలాది అజ్ఞాత సైనికుల కాబాలగోపాలం కృతజ్ఞాతాంజలి సమర్పించింది.

ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది
అలాగే తెల్లచీర కట్టుకుందిగాని ఎర్రని బొట్టులేదు
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు , చేతులకు గాజులు లేవు
ఆమె సోగకన్నులలో వానకురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది
ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంటితో నొక్కుతోంది
అక్కడ చేరిన గుంపులు "జైహింద్" అన్న నినాదం చేశారు
"అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు... ఇంకా రాడేం?"
అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని
ఆమె కూడా రుద్ద కంఠంతో "జైహింద్" అని మెల్లగా పలికింది
ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినపడింది"...

జూలై 26th, 2000..!! కార్గిల్ యుధం అయిపోయి యేడాది..రాజ్ భవన్ లో కార్గిల్ వీరుల సంస్మరణ సభ. మమ్మల్నీ ఆహ్వానించారు. కార్గిల్ యుద్ధ వీరుల (జీవించి వున్నవారు, అమరులైనవారు) తల్లులని, భార్యలని సత్కరించి గౌరవించారు మన రాష్ట్ర గవర్నర్ గారు . అలాంటి ఎందరో స్త్రీ మూర్తుల మనసు యొక్క దర్పణం...బాల గంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి లోని ఈ "అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?" కవిత. నాకెంతో నచ్చిన ఈ కవిత, నా జీవితానికి యెంతో దగ్గరగా వుండే ఈ కవిత మీ అందరితో పంచుకోవాలనిపించింది.

28, ఆగస్టు 2009, శుక్రవారం

మా ఉజ్జయినీ యాత్ర



అన్నయ్య కలకత్తాకి బదిలీ అయిన వెంటనే ఏదో ట్రైనింగ్ కోసం రెండు నెలలు మహూ("మిలటరీ హెడ్ క్వాటర్స్ అఫ్ వార్", మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఇండోర్ జిల్లాలోని ఒక అందమైన ఊరు ) వెళ్ళాల్సి వచ్చింది. ఉజ్జయిని మాకు చాలా దగ్గర, ఇక్కడికి వస్తే చూడవచ్చు రమ్మన్నాడు. సరే రిజర్వేషన్లవీ(హైదరాబాద్ నించి భోపాల్, భోపాల్ నించి ఇండోర్, ఇండోర్ నించి మహూ) చేయించుకుని తయారయ్యాం ఉజ్జయినీ యాత్రకి.

ఎప్పటిలాగానే మా టీం లో అమ్మ, నేను, మా నిదానం అత్తయ్య , కంగారు మావయ్య(మూడో మావయ్య, అత్తయ్య. ఆవిడెంత నిదానమో, ఈయనకంత కంగారు, టెన్షను) , వీళ్ళతో బాటు నాలుగో అత్తయ్య కూడా వుంది. అందరం ఏదో దండయాత్ర కి బయలుదేరినట్టుగా అట్టహాసంగా బయలుదేరాం. అందరి మొహాల్లో గొప్ప సంతోషం. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం వున్న ఉజ్జయినీ నగరాన్ని చూడడానికి వెళ్తున్నామనే ఆనందం.

4.30 కే రైల్వే స్టేషన్ కి వచ్చేశాం(5.30 కి డిపార్చర్). తీరా వచ్చాక రైలు రెండున్నర గంటలు లేటు అని తెలిసింది. ఆదిలోనే హంస పాదం. ఎదురు చూడడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదుగా. అదే పని మొదలెట్టేశాం. అది డిసెంబర్ మొదటి వారమేమో సాయంత్రం ఐదింటికే చలి మొదలైంది (ఓపెన్ ఎయిర్ కదా). అందరం ముసుగులవీ వేసుకుని కన్నం వెయ్యడానికి వెళ్ళే దొంగల్లా తయారయ్యి ఎదురు చూస్తున్నాం(కన్నం వెయ్యడానికి కాదు సుమా) రైలు కోసం.

కొత్త పెళ్ళికూతురిలా నిదానంగా ఎనిమిదింటికి వచ్చింది రైలు. ఈ రైలు లేటవ్వడంతో పక్కరోజు మేము భోపాల్ చేరేసరికి మధ్యాహ్నం రెండైంది. భోపాల్ నించి ఇండోర్ కనెక్టింగ్ ట్రైన్ వెళ్ళిపోయింది. గంట తరవాత ఇంకో ట్రైన్ వుందన్నారు..మళ్లీ నిరీక్షణ. మా నిరీక్షణ ఫలించి, ఆ రైలోచ్చి మేము ఇండోర్ చేరేసరికి సాయంత్రమైపోయింది.

అక్కడ మా అన్నయ్య మాకోసం ఒక పెద్ద ఇడ్లీల బాగు తో (పొద్దున్నించి తిండి లేదు మాకు) ఎదురుచూస్తున్నాడు. రైలు రావడానికింకా టైం వుంది తినమంటే తినడానికి ప్రయత్నించి (ఆ ఇడ్లీలు గోడకి మేకులు కొట్టుకునేందుకు తప్ప, తినడానికి పనికి రావని తెలిసి) విఫలమై, నిరాహారంగా, నీరసంగా, నిరీక్షించీ నిరీక్షించీ శుష్కించే వేళకి రైలుగారు మమ్మల్ని కనికరించి విచ్చేసింది. ఆ మీటర్ గేజ్ బండి లో వూగి వూగి మహూ చేరే సరికి రాత్రి తొమ్మిది..అక్కడినించి ఇల్లు (క్వాటర్) చేరేసరికి పది గంటలైంది.

పక్కరోజు ఉదయం బయలుదేరి ఉజ్జయినీ వెళ్ళాము. ఇండోర్ నించి 55 కిమీ దూరం లో వుంది ఉజ్జయినీ నగరం. అక్కడ మొదట చూసింది మహాకాలేశ్వర్ గుడి. మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయాలలో ఒకటి మహాకాలేశ్వర స్వామి ఆలయం. ఐదు అంతస్తులుగా వున్నఈ ఆలయం గ్రౌండ్ లెవెల్ నించి చాలా కిందికి వుంటుంది. సుమారుగా మూడు అంతస్తుల వరకూ దిగి గర్భగుడిలోకి వెళ్ళాలి. అత్యంత తేజోవంతంగా వెలిగిపోతూ దర్శనమిచ్చే మహాకాలేశ్వర స్వామి (లింగాకారం) నించి దృష్టి మరలించుకోవడం చాలా కష్టం. ఈ గుడిలో ఇంకో విశేషమేంటంటే ఒకసారి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్నే మళ్లీ మళ్లీ నైవేద్యం పెట్టవచ్చునట.(ప్రసాదం చాలా బాగుంది మన మినపసున్ని లాగా).

అక్కడినించి క్షిప్రా నది ఒడ్డున వున్న "మహాకాళి"(అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ) ఆలయానికి వెళ్ళాం. అక్కడ అమ్మవారు సరస్వతి, లక్ష్మి, పార్వతి మూడు రూపాలతో దర్శనమిస్తుంది. కానీ నాకెందుకో మరి.. అంత స్పష్టంగా కనిపించలేదనిపించింది. తీర్ధ ప్రసాదాలు తీసుకుని బైటికొచ్చాం. ఈ గుడిలో భట్టి విక్రమార్కుల తైలవర్ణ చిత్రాలు, వారు వాడినవిగా చెప్పబడే కత్తులు, ఇంకా కొన్ని వస్తువులు ప్రదర్శనశాల లో వుంచారు.

అక్కడినించి బయలుదేరి ఊరి బైట వున్న "గడ్ కాళీ" ఆలయానికి వెళ్ళాం. ఉజ్జయినీ కోటని సదా రక్షించే శక్తి, భట్టి విక్రమార్కులకు ప్రత్యక్షమై వరాలిచ్చిన తల్లి ఈ "గడ్ కాళీ". నిలువెత్తు రూపమని అంటారు (ఇప్పుడు కేవలం తల మాత్రమే కనిపిస్తూంది). నాలుక బైటికి వుండి చూడడానికి చాలా భయమేస్తుందని ఏదేదో చెప్పారందరూ..కాని నాకు మాత్రం బాసరలో సరస్వతిలా.. ఐదారేళ్ళ చిన్న పిల్లకి చక్కని అలంకారం చేసి అక్కడ నిలబెట్టినట్టుగా అనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాను. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఆమె వాహనమైన పులి. ఈ గుడిలో విశేషమేంటంటే అమ్మవారికి "సారాయి" నైవేద్యం పెడతారు. ఇంకో విశేషం ఏంటంటే తెచ్చిన సారాయి అమ్మవారి నోట్లో పోస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి(నోటి నించి కంఠం లోకి చిన్న దారి లాగా వుంది). ఈ గుడి కూడా గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి వుంటుంది. ఈ అమ్మవారి గురించిన ప్రస్తావనలో మా అన్నయ్య "భట్టి విక్రమార్కులు, తెనాలి రామలింగడు, కాళిదాసు" ఈ ముగ్గురి కధని రంగరించి ఒక కొత్త కధని మా అత్తలకి వినిపించడం, వారెంతో భక్తీ శ్రద్దలతో వినడం ఒక చిన్న కొసమెరుపు.

ఇక్కడినించి బయలుదేరి కాలభైరవుడి గుడికి వెళ్ళాం. కాలభైరవుడి చాలా వింతగా వుంటుంది. విగ్రహం కళ్ళ స్థానంలో రెండు గుంతల్లాగా, నోరు స్థానంలో ఒక కన్నం వుండి చూడడానికి కాస్త భయంకరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి ఎదురుగా కుక్క విగ్రహం ప్రతిష్టించబడి వుంది. కాలభైరవుడికి కూడా నైవేద్యం సారాయే. ఒక చిత్రమేమిటంటే ఈ గుడి పరిసరాలలో కనిపించే వారంతా ఏదో మంత్ర విద్యలు వచ్చినవారిలా, రవ్వంత అనుమానాస్పదంగా కనిపిస్తారు.

చివరిగా రాధమాధవుడి గుడికి వెళ్ళాం. గుడి గోడలు, పై కప్పు అంతా తైలవర్ణ చిత్రాలు. శ్రీకృష్ణ లీలామృతం తో నిండిన చిత్రాలు. ఆ గుడి సింధియా రాజ వంశీయులు కట్టించారట. సుల్తానులు దాడి చేసి సుమారుగా 15 అడుగుల ఎత్తున్న వెండి సింహద్వారాల్ని కొల్లగొట్టి తీసుకెళ్ళిపోతూ వుంటే ప్రాణాలొడ్డి వెనక్కి తెచుకున్నారట సింధియా రాజ వంశీయులు. అద్భుతమైన కట్టడం..అందులో అత్యంత సమ్మోహన మూర్తి ఆ రాధామనోహరుడు. ఇక చెప్పడానికి మాటలే లేవు, అనుభూతించడం తప్ప.

ఇంతసేపు ఎంతో భక్తిగా అన్ని గుడుల గురించి చెప్పుకున్నాం కదా..ఇప్పుడో చిన్నసరదా అయిన రెండో కొసమెరుపు కధ చెప్పుకుందాం.

ముఖ్యమైన అన్ని గుడులు చూసినా ఇంకా చాలానే వున్నాయి చూడవలసిన ప్రదేశాలు. కాని అప్పటికే బాగా అలసిపోయి, ఆకలి వేస్తూండడం వల్ల హోటల్ కి వెళ్ళాం. మా మూడో మావయ్య "విపరీతమైన శాఖాహారి" (మేమంతా కూడా శాఖాహారులమే, కాకపోతే మా మావయ్య కాస్త భయంకరమైన శాఖాహారి. మసాలాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, ఆఖరికి కూరల్లో వేసే కరేపాకు కుడా తినడు ). అందుకని ఆయన కోసం ప్రత్యేకంగా అన్నం, మజ్జిగ పులుసు, పెరుగు మాత్రం చెప్పాం. అందులోంచి కూడా పోపులో వేసిన ఆవాలు, జీలకర్ర ఏరేసి ఆ తరవాత తిన్నాడు.

ఇక మా అమ్మకీ, అత్తలకీ , హిందీ రాదు. అందుకని అన్నయ్య చెప్పిన "తీకా...తీకా ఖానా(బాగా కారంగా) " ఓకే...ఓకే అంటూ ఒప్పేసుకున్నారు. తీరా తినడానికి వచ్చేసరికి అందరికి చెవుల్లోంచీ, ముక్కుల్లోంచీ నీళ్ళు. ఎద్దు బుస లాగ ముక్కుల్లోంచి వేడి గాలి. ఎలాగోలా కష్టపడి తిన్నారు. ఎన్ని మంచినీళ్ళు తాగినా, మగ్గులతో మజ్జిగ తాగినా, గుప్పిళ్ళతో పంచదార నోట్లో పోసుకున్నా కాని ఆ కారం తగ్గలేదు వాళ్లకి . ఆ తరవాత మేము బయలుదేరి మళ్లీ మహూ వచ్చేవరకూ ఎద్దుల్లా బుస కొడుతూనే వున్నారు పాపం . వాళ్ళని అంతలా ఆటపట్టించిన అన్నయ్య మాత్రం అచలపతిలా(అచలపతి కధల్లో హీరో) చిద్విలాసంగా వున్నాడు.

సరిగమల సునామీ


ఈ మధ్య ఏ టీవీ ఛానెల్ పెట్టినా రియాలిటీ షోలంటూ ప్రేక్షకులని తెగ ఆకర్షించేస్తున్నారు. ముఖ్యంగా సంగీతానికి , డాన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు బాగా ఎక్కువైపోయాయి. ఒక ఛానెల్ వాళ్ళు "పాడుతా తీయగా" అంటే, ఇంకో ఛానల్ వాళ్ళు "పాడాలని వుంది" అంటారు...ఒకరు "ఝుమ్మంది నాదం'' అంటే, ఇంకొకరు ''గాన గాంధర్వం" అంటారు...ఒకరు ''సరిగామపా'' అంటే, ఇంకొకరు ''సూపర్ సింగర్'' అంటారు... ఒకరు ''ఢీ'' అంటే ఇంకొకరు "ఠా" అంటున్నారు...ఒకరు ''జల్సా'' అంటే ఇంకొకరు ''సల్సా'' అంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చూసే ప్రేక్షకులు (జనాలు) తమ పిల్లల్ని, బంధువుల్ని, పక్కింటి వారిని, ఎదురింటి వారిని, అందరిని పోటీల్లో పాల్గొనడానికి ప్రేరేపించి పంపుతున్నారు. అదీ చాలక ఎవరో ఎందుకని ఆవేశపడి తామే ఆ పోటీల్లో పాల్గొని వాళ్ళిచ్చే కప్పులో, చిప్పలో, క్యాషో, కారో , తెచ్చేసుకోవాలనీ , టీవీ లో కనిపించాలనీ , నలుగురి లో గొప్ప పేరు సంపాదించేసుకోవాలనీ మహా ఉబలాటపడిపోతున్నారు. దేశమంతా ఇదే తంతు ఇక మా వాళ్ళనగానేంత..?

నాకు ఐదుగురు మేనమామలు. వారిలో నాలుగో మావయ్య పిల్లలు తప్పించి, మిగతా అందరి పిల్లలూ సంగీత విద్వాంసులే (విధ్వంసులు). సంగీతాన్నీ కాచి వడబోసిన (టీ కాచినట్టు) మేధావులు. ఒకరిద్దరు గాత్ర సంగీతం లో డిప్లొమా చేస్తే, మరొకరు ఏకంగా మ్యూజిక్ లో ఏం.ఏ చేసిన ఘనులు. ఒకరు వీణ మీటితే, మరొకరు వేణువూదితే, మరొకరు ఫిడేలు వాయిస్తే, ఇలాగ అందరూ తలో రంగంలో నిష్ణాతులు(అని వారనుకుంటూ వుంటారు).

మరి..ఇంత మంది పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు వుంటే ఆ వాయింపుకి శ్రోతలు కావాలి కదండీ..అదిగో ఆ కొద్దిమంది శ్రోతల్లో మొట్టమొదటి (బలి) శ్రోత నేను. ఇంకా మా అన్నయ్య, మా 4వ మావయ్య, అత్తయ్య, వాళ్ళ పిల్లలిద్దరూ. మిగతా అందరూ అమ్మ తో సహా (అమ్మ చాలా బాగా పాడుతుంది) ఆ అద్భతమైన(విచిత్రమైన) సంగీతాన్నీ యెంతో ఆనందంగా, తన్మయత్వంతో ఆస్వాదిస్తారు.

ఒకసారీ ...మా రెండో మావయ్య కూతురి పెళ్లి చూపులు జరిగాయి. వచ్చిన పెళ్ళివారు అమ్మాయి ఒకపాట పాడితే వినాలని వుందంటేనూ ''హిమగిరి తనయే హేమలతే..ఏ ఏ ఏ ఏ ఏ" అంటూ పాడింది. పాపం పెళ్ళివారు బిక్కచచ్చిపోయి, ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు పారిపోదామా అన్నట్టు కూర్చుని, పాట అయిన ఐదు నిమిషాల్లో సినిమాల్లోలా మాయమైపోయారు.

మా పెద్ద మావయ్య కొడుకు వేణువు వాయిస్తోంటే.."వాయిస్తున్నడురా..ఫ్లూటు వాయిస్తున్నాడురా..కళ్ళకి రెప్పలున్నట్టు చెవులకి మూతలు వుండి వుంటే యెంత బాగుండేదో "అంటూ జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో బ్రహ్మానందం ఫ్లూట్ వాయించే సన్నివేశంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ భయపడే సన్నివేశం గుర్తుకువస్తుంది.

ఆ మధ్యన ఒకసారి (sept 11th) ఐదో మావయ్య పుట్టినరోజు పార్టీ చేస్తున్నాం రండి అంటే వెళ్ళా(అమ్మా వాళ్ళూ లేరు నేనొక్కదాన్నే వెళ్ళా). వాళ్ళబ్బాయి అద్భుతంగా పాడతాడు వినమని మా మావయ్య అందరికి చెప్పాడు. సరేనని కూర్చున్నామందరం. ఎంతో చక్కని యుగళగీతం...శుభాకాంక్షలు సినిమాలో ఏ.వి.ఎస్(నాదబ్రహ్మ) లాగా, అది ఏ రాగమో తెలియనివ్వకుండా..ఆ పాటని చీల్చి చండాడి.. అంత్యంత విషాదంగా పాడి మా అందరి కన్నీళ్ళకు కారణమయ్యాడు. చాలా సేపు ఏదో సంతాప సభకి వచ్చినట్టు అందరం మౌనంగా వుండిపోయాం. ఆ తరువాత జారిపోయిన జవసత్వాలను కూడదీసుకుని, ఆ విషాదాన్ని మోసుకుంటూ అందరం భారంగా బైటికి వచ్చాం. ఇంటికి రాగానే టీవీలో అమెరికాలో జంట టవర్లు కూలిన వార్త చూపిస్తున్నాడు. (వాడి పాట దెబ్బకి అమెరికాలో టవర్లు కూలిపోయాయని ఇప్పటికీ సరదాగా అనుకుంటూ వుంటాం).

చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. పెద్ద కుటుంబం అవ్వడంతో చిన్నది పెద్దది ఏదో ఒక సందర్భం వస్తుంది..అందరం కలవాల్సివస్తుంది. ఇంకేముంది..? ఏ కాస్త సంగీత ప్రేమికుడైన ఏ పెద్దమనిషో వీళ్ళ ప్రతిభాపాటవాలు తెలియక ఒక్క పాట పాడమని అడగుతాడు. ఫలితం...ఈ "సరిగమల సునామీ"...ఎక్కడ బైటికి వెళ్లిపోతామోనని(పారిపోతామని ) తలుపులు వేసి మరీ వారి కళలు ప్రదర్శించి మా ముఖకవళికలు మార్చేస్తున్నారు.

అదండీ సంగతి. ఇదిగో ఇప్పుడు కూడా చిన్న కిట్టి పార్టీ వుంది మా పెద్దమావయ్య వాళ్ళ ఇంట్లో. కాసేపట్లో వెళ్ళాలి. "సరిగమల సునామి" నించి తప్పించుకుని సురక్షితంగా ఇల్లు చేరాలని ఆశీర్వదిద్దురూ !!


23, ఆగస్టు 2009, ఆదివారం

బొజ్జ గణపతి



"తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్..
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్..
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు..
పార్వతీ తనయా ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్"

నా చిన్ననాటి ప్రియ నేస్తం "బొజ్జ గణపతి". అప్పుడు నాకు సరిగ్గా నాలుగేళ్ళు. మా వీధి చివర "బొజ్జ గణపతి" గుజ్జు రూపం చెక్కిన ఒక పెద్ద రాయి వుండేది, పక్కనే చిన్న కొలను లాంటిది వుండేది.

ప్రతీరోజూ పొద్దున్నే మా తాతగారు అన్నయ్యనీ, నన్నూ స్కూల్ కి తీసుకు వెళ్ళేటప్పుడు "బొజ్జ గణపతి" దగ్గరికి తీసుకెళ్ళేవారు. అలా మా ఇద్దరికీ దోస్తీ కుదిరింది. అయన దండం పెట్టుకుని ప్రదక్షణలు చేసుకుని వచ్చేలోపు కొన్ని కబుర్లూ.. మళ్లీ సాయంత్రం స్కూల్ నించి వచ్చాక మరిన్ని కబుర్లూ చెప్పేదాన్ని "బొజ్జ గణపతి" కి . అలా ఎన్నెన్నో కబుర్లూ, ఆటలు, పాటలు. అసలు క్షణం తీరేది కాదు మా ఇద్దరికీ.
బామ్మ పెట్టే తాయిలం మా ఇద్దరికీ చెరిసగం. నా వంతు తినేసి తన వంతు ఆకులో పెట్టి అక్కడే పక్కన పెట్టి వచ్చేదాన్ని(బామ్మ చెప్పేది అలా చేస్తేనే "బొజ్జ గణపతి" తాయిలం తింటాడని). తెల్లారి వెళ్లి చూస్తే ఆకు ఖాళీగా వుండేది. పరుగున ఇంటికొచ్చి బామ్మ తో చెప్పేదాన్ని "బొజ్జ గణపతి" తాయిలం తినేశాడని.

స్కూల్ లో టీచర్ మార్కులు తక్కువేసినా, అల్లరి చేస్తున్నావని తిట్టినా..వెంటనే మా "బొజ్జ గణపతి"కి చెప్పేదాన్ని. అమ్మా , అన్నయ్యా , బామ్మా , తాతగారూ, స్కూల్లో టీచర్లూ, ఫ్రెండ్స్... ఎవరేమన్నా వెళ్లిపోయి మా "బొజ్జ గణపతి" కి ఫిర్యాదు చేసేదాన్ని.

ఒకసారి బాగా వర్షం పడింది. మా "బొజ్జ గణపతి" పాపం వర్షం లో తడిసిపోయాడు. పాపం తనకి ఇల్లు లేదుగా..!! అందుకని, పాపం "బొజ్జ గణపతి" వానలో తడిసిపోతున్నాడు ఇంటికి తెచ్చేసుకుందాం అని మా తాతగారిని అడిగాను. ఆయన నవ్వేసి..మర్నాడు ఒక దేవ గన్నేరు కొమ్మ తెచ్చి బొజ్జ గణపతి విగ్రహం (చాల పెద్ద రాయి ) వెనకాల నాటారు. తరవాతి కాలం లో అది పెద్ద మానై మా "బొజ్జ గణపతి" కి చల్లని నీడనిచ్చేది, బోలెడన్ని పూలిచ్చేది. అందుకే ఆ చెట్టు నాకు కూడా నేస్తమైపోయింది.

ప్రతీ యేడాది మా "బొజ్జ గణపతి" పుట్టిన రోజు నాడు తనకి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర, అన్నీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం తాతగారూ, అన్నయ్యా, నేను.

కాలక్రమేణా మా వీధి లో జనాభా పెరిగి, ఇళ్ళూ పెరిగి, కాలనీ అసోసియేషన్ వారు మా "బొజ్జ గణపతి" ని నాలుగు గోడల మధ్యన బంధించేశారు. ఎప్పుడంటే అప్పుడు వెళ్లేందుకు లేకుండా తాళం వేసేశారు. నేనంటే నేనంటూ ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుంటూ "బొజ్జ గణపతి" ఉనికినే మరచిపోయారు.
బ్లాగ్మిత్రులందరికీ "వినాయక చతుర్ధి" శుభాకాంక్షలు.


21, ఆగస్టు 2009, శుక్రవారం

పుష్పవిలాపం




"నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను..ప్రభూ !! ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళ లాడుతూంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి ...అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి..చివాలున కొమ్మవంచి..గోరానెడునంతలోన..విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి..మా ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి కృంగిపోతూ ..నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై..."

మధ్యాహ్నం భోంచేసిన తరువాత విశ్రాంతిగా కూర్చుని ఘంటసాల గారి ప్రైవేటు ఆల్బం వింటున్నా... నా చిన్ననాటి జ్ఞాపకాలు అలలు అలలు గా వచ్చిమనసును తాకుతున్నాయి.

నాకు మొక్కలన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా పక్కింట్లో బామ్మగారు నాకు మొక్కలు ఎలా నాటాలో, వాటి బాగోగులు ఎలా చూసుకోవాలో అన్నీనేర్పింది. నేను ప్రతీరోజూ స్కూలు కి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ ఎవరింట్లో ఏ పూల మొక్కలున్నాయా అని చూసుకుంటూ వెళ్ళేదాన్ని. ఆదివారం నాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్లి కొమ్మలడిగి తెచ్చుకుని వాటిని నాటి నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకునే దాన్ని.

ప్రతీ రోజూ ఉదయం స్కూలు కి వెళ్లేముందు వరకూ , సాయంత్రం రాగానే రెండు గంటలు మా తోట లోని మొక్కలతో నా సహవాసం. మల్లెలు, మందారాలు, సన్నజాజి, విరజాజి, మరువం, గులాబీలు (తెలుపు, ఎరుపు, లైట్ పింక్ అన్నీ దేశవాళి వే) , బంతులు, చేమంతులు, కనకాంబరాలు, అన్నీ..నా నేస్తాలే!!

ఏ కొమ్మకి కొత్త చిగురేసినా నాకు పండగే. ప్రతీ చిగురూ నాకు లెక్కే . శనివారం రాత్రి అమ్మ ఏ సమయానికి ఇంటికి వచ్చినా సరే (అమ్మ ఉద్యోగం వేరే ఊళ్ళో..వారానికి ఒకసారి ఇంటికి వచ్చేది) ఆమె వెంట తిరుగుతూ అన్నీ ఏకరువు పెట్టేదాన్ని. మర్నాడు ఉదయం ముందు తోటలో నా నేస్తాలని చూశాకే అమ్మకి మిగతా పనులకి పర్మిషన్.

ఇలా వుండగా.. ఒకరోజు మా టీచర్ (నేను 8 వ తరగతి లో వున్నప్పుడు ) మాకందరికీ "పుష్పవిలాపం" పాఠం చెప్పారు. నా మనసులో బాగా హత్తుకుపోయిందా పాఠం. ఆ రోజు నించి నా తోటలో పూలు కోయడం నిషేదించేశాను. స్కూలు కి వెళ్ళే వరకూ , వెనక్కి వచ్చాక ఎలాగూ తోటలోనే మకాం.. కానీ మరి స్కూల్లో వున్నప్పుడు ఎవరైనా పూలు కోసేస్తే? అందుకని ప్రతీ రోజూ అన్నీ పూలు లెక్క వేసుకుని వెళ్ళేదాన్ని . మళ్లీ వెనక్కి వచ్చాక లెక్క చూసుకునే దాన్ని. పువ్వు మీద చెయ్యి వేస్తే 5 రూపాయలు ఫైన్. అది ఎవరైనా సరే.


అంత కష్టపడి తోటని కాపాడుకునే నాకు మా అమ్మమ్మ పెద్ద విలన్. ఏదో మాయ చేసి చెట్లు మొత్తం దులిపేసి నా తోటలో పూలన్నీ దోచేసేది. అమ్మమ్మకి అమ్మ సప్పోర్టు.

ఒకసారి గులాబీల సీజన్లో అన్నీ గులాబీలు విరగబూశాయి. కాండం కానీ ఆకులు కానీ కనిపించనంతగా.. మందారాలకి సీజన్ ఏమి వుండదు కాబట్టి అవి ఎప్పటిలాగానే బాగా పూశాయి. నన్ను స్కూలు కి వెళ్ళనిచ్చి , అమ్మమ్మ (మా పక్కింటికి పక్కింట్లో వుంటారు) పెద్ద బుట్ట నిండా అన్నీ పూలు కోసేసుకుని ( ఒక్క పువ్వు కూడా మిగలకుండా) వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చాక చూస్తే తోటంతా ఖాళీ.

చాలా బాధేసింది. బాగా ఏడ్చాను. ఇలా జరిగింది అని అమ్మకి చెప్పాలని...కానీ వారం రోజులు ఆగితే కానీ అమ్మ రాదుగా..ఆ బెంగ తో జ్వరం వచ్చేసింది. సుమారుగా నెల రోజులు పట్టింది కోలుకోవడానికి.

" ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కని పెంచిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్తుము...తదీయ కరమ్ముల లోన స్వేచ్చమై నూయలలూగుచున్ మురియుచుందుము...
ఆయువు తీరినంతనే...హాయిగా కన్నుమూసేదము...ఆయమ చల్లని కాలి వ్రేళ్ళ పై...

గాలిని గౌరవింతుము సుగంధము పూసి..సమాశ్రయించు భ్రున్గాలకు విందు చేసెదము కమ్మని తేనేలూరి...మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి కూర్తుము...స్వతంత్రుల మమ్ముల...స్వార్ధ బుద్దితో తాళుము తుంపబోకుము... తల్లికి బిడ్డకు వేరు సేతువే.."

టేప్ రికార్డర్ లో పాట ఇంకా వినిపిస్తోంది... ఘంటసాలగారి కంఠం లోంచి కురిసిన అమృత ధార .. చిన్ననాటి చేదు జ్ఞాపకాన్ని రూపు మాపే ప్రయత్నం చేస్తోంది.



19, ఆగస్టు 2009, బుధవారం

కుక్క పాట్లు..



తెల్లవారు ఝామున 8.30..అయింది!! సూర్యా రావు గారి తో ఛాలెంజ్ చేసి ముసుగు బిగించి నిద్ర పోతున్నాన్నేను ఇంతలో ట్రింగ్..ట్రింగ్.. మంటూ చెవి పక్కనే మొబైల్ మోత. నిద్రలోనే విసుగ్గా ఫోనెత్తి హలో అన్నా.. అవతలి వైపు నించి వినిపించిన మాటలకి నిద్ర మత్తు వదిలిపోయింది.

వెంటనే లేచి ఒక్క పరుగున అమ్మ దగ్గరికి వెళ్లి అడిగా, అలిగా, జాలిగా చూశా, కాళ్ళా వేళ్ళా పడ్డా..నిరాహార దీక్ష సైతం చేశా..కానీ అమ్మ ఏమాత్రం కరుణించలేదు. తప్పదంది..తప్పించుకునే వీలే లేదంది, తన బట్టలతో బాటుగా నావీ సర్దేసింది.."గోదావరీ పుష్కర" స్నాన సంరంభానికి "రాజమండ్రి" కి.

ఓ శుభ ముహూర్తాన బయలుదేరాం అమ్మ, నేను, మావయ్య , అత్తయ్య ..  చెల్లి (అత్తయ్య కి), చెల్లి మొగుడు (ఈయనకి ఇంత కంటే పరిచయం లేదు) , పిల్లా పీచు, తట్టా, బుట్టా..అంతా కలిసి చిన్న సైజు మంద..!!

రాజమండ్రి లో రైలు దిగగానే ఒకాయన "గునగునా" నడుచుకొచ్చాడు మా దగ్గరికి..(చెల్లి మొగుడికి తమ్ముడు, ఆయన ఇంట్లోనే మా బస). అంతా కలిసి బయలు దేరి వాళ్ళింటికి వెళ్ళాం. అదో చిన్న సైజు అడవి. కాఫీ కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేసుకుని అందరం బయలు దేరాం గంగలో(సారి గోదావరిలో) మునగడానికి.

అప్పటిదాకా గోదారి లో అంతా మట్టి నీళ్ళు, అందులో నేను స్నానం చెయ్యనని అమ్మ చెవి కింద జోరీగ లాగా సొద పెట్టిన నేను గోదావరి ని చూడగానే తన్మయమైపోయాను. నీళ్ళలోకి దిగనే దిగనన్నదాన్ని, అసలు నీళ్ళలోంచి బైటికే రాలేదు చాలా సేపు. స్నాన ఘట్టం ముగిసింది.

ఇక్కడితో కధ సుఖాంతం అయిందని ఎంతో సంతోషించాను. ప్చ్..!! అంతా నా భ్రమ. అయినా నా పిచ్చి గాని మన చేతుల్లో ఏముంది? ఇక ఇక్కడి నించి మొదలైంది మా సాహసయాత్ర లో రెండో ఘట్టం.

మా అత్తయ్య మహా భక్తురాలు అలాగే చాలా నిదానస్తురాలు. ఎంత నిదానమంటే నత్త, తాబేలు తో పోటి పడితే అవే గెలుస్తాయి . ఇక చూడండి మా పాట్లు.

వదిన గారూ(మా అమ్మ)..ఎలాగూ ఇక్కడి దాక వచ్చాం కదా పిఠాపురం లో "శక్తి పీఠం(పురుహూతికా దేవి)" వుంది వెళ్దాం ఇక్కడికి చాలా దగ్గర అంది. ప్రైవేటు బండి కోసం ప్రయత్నిస్తే దొరకలేదు అందుకని బస్సెక్కాం. ఆ బస్సు డ్రైవర్ కూడా మా అత్తయ్య లాగా బాగా నిదానస్తుడు. రాత్రి 10 గంటలకి మమ్మల్ని పిఠాపురం లో దింపాడు.

అక్కడినించి వాళ్ళనీ వీళ్ళనీ "అడుక్కుంటూ" వెళ్ళే సరికి గుడి కాస్తా మూసేశారు. సరే ఛలో వెనక్కి మళ్లీ రాజమండ్రి అనుకుని బస్సు స్టాప్ కి వస్తే ఆ రాత్రికి ఇక బస్సులు లేవన్నారు . ఒక్కసారిగా అందరికి మా అత్తయ్యని కరిచెయ్యాలన్నంత కోపమొచ్చింది. కానీ ఛ..మనం "కుక్కలం" కాదుకదా అని సర్దిచేప్పుకున్నాం. కానీ మాకేం తెలుసు కాసేపట్లో అదే పోర్ట్ ఫోలియో అందరం పోషించబోతున్నామని..!

ఇలా మేం కిం కర్తవ్యమ్..? అని ఆలోచిస్తూ వుండగా.. సామర్లకోట..సామర్లకోట అని అరుస్తూ ఒక బస్సు (లాంటిది) వచ్చింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ బండి ని మాకోసం పంపినట్టుగా సంబరపడిపోయి చాటంత మొహాలు చేసుకుని ఆ బండి లో కూర్చున్నాం. క్లీనర్ వచ్చి బైటినించి తలుపులు గొళ్ళెం పెడితే ఏమోలే అనుకున్నాం..

బండి బయలుదేరింది. కాస్త కుదుటపడ్డాక చుట్టూ తేరిపార చూశాం..అది ఒక "కుక్కల" బండి. చుట్టూతా బోను..అందులో మేము..!! పడిపోకుండా పట్టుకోడానికి కనీసం ఆధారం కూడా లేని బండి. అలాంటి బండి లో మమ్మల్ని కుక్కల్లా పడేసుకుని ఆ డ్రైవర్ మిట్టా,పల్లం అనే భేదం చూపకుండా ఆ గతుకుల రోడ్డు మీద 120 కిమీ వేగంతో తోలుకెళ్ళి సామర్లకోట కుక్కల స్టాండ్ లో (ఛ..బస్టాండ్ లో) పడేశాడు. ఆ తరవాత తెల్లారే వరకు అక్కడే పడిగాపులు కాసి తెల్లారి మొదటి బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగాం.

ఆ రోజు రాత్రికే మా తిరుగు ప్రయాణం. "గునగున తమ్ముడు" తన కారు లో రైల్వే స్టేషన్ దగ్గర దింపుతాను రమ్మంటే కొంత మందిమి ఆ కారు లో కూర్చున్నాం. సరిగ్గా ఒక నాలుగు రోడ్ల కూడలి దగ్గర మన "గునగున తమ్ముడు" కారు ఎదురుగా సిగ్నల్ కోసం ఆగి వున్న స్కూటరాయన పైకి ఎక్కించాడు (బహుశా ఆయనకి ఫుట్ పాత్ ల మీద, మనుషుల మీద తప్ప రోడ్డు మీద కారు నడపడం రాదేమో)..

అది చూసిన ట్రాఫిక్ పోలిసు వెంట పడ్డాడు.. మన "గునగున తమ్ముడు" చాకచక్యంగా (ఈసారి ఎవరి పైకి ఎక్కించకుండా) ట్రాఫిక్ పోలిసు ని తప్పించి మమ్మల్ని రైల్వే స్టేషన్ చేర్చాడు. బ్రతుకు జీవుడా అనుకుని ..రైలెక్కి మా వూరోచ్చేశాం.


18, ఆగస్టు 2009, మంగళవారం

స్నిగ్ధ కౌముది



బ్లాగ్మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రణీతస్వాతి. చాన్నాళ్ళుగా ఒక బ్లాగ్ తెరవాలని కోరిక. సరే! కాని..బ్లాగ్ తెరవాలంటే ముందుగా దానికి నామకరణం చెయ్యాలి కదా. మరి నామకరణం చెయ్యాలంటే పేరు కావాలి కదా, అందుకని కొన్నాళ్ళుగా పేరు వెతికే పనిలో పడ్డాను. కూర్చున్నా, నిల్చున్నా, ఏ పనిలో వున్నా అదే ధ్యాస.

బంధువుల్ని, స్నేహితుల్ని, ఆఖరికి కేవలం ముఖపరిచయం ఉన్న వాళ్ళని కూడా మంచి పేరు సూచించమని అడగడం మొదలెట్టా. తరవాత్తరవాత వాళ్ళందరూ నన్ను చూసి హడలిపోయి ముఖం చాటేయడం మొదలెట్టారు. అయినా సరే పట్టు వదలకుండా కనపడ్డవారినల్లా నా బ్లాగ్ పేరు కోసం వేధించా (ఛ..నేను చాలా మంచి దాన్ని).

ఇంత కష్టపడ్డా మంచి పేరు దొరక్కపోయే సరికి బాగా కోపమొచ్చింది అందరి మీదా. నా బ్లాగ్ పేరు నేనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నా. ఆలోచించడం మొదలెట్టా. సినిమాల్లోలా రకరకాల భంగిమల్లో ఆలోచించా.

చాలా రోజుల క్రితం చదివిన ఏదో నవలలో (పేరు గుర్తులేదు) నాయిక పేరు "స్నిగ్ధ" గుర్తొచ్చింది. కానీ ఇంకా ఏదో అసంపూర్తిగా వున్నట్టు భావన. మొన్న పదిహేనురోజులనాడు మా మావయ్య వాళ్ళింట్లో గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడొక అమ్మాయి తన పేరు "కౌముది" అని ఎవరికో చెప్తోంటే విన్నాను. బాగుందనిపించింది.

కానీ నిజం చెప్పద్దూ..కౌముది అంటే అర్ధం ఏంటో తెలీదు నాకు. ఆ మాట బైటికి అంటే అమ్మో ఇంకేమైనా వుందా? అందరూ నవ్వరూ! అందుకే ఇంటికి రాగానే ముందు "శబ్ద రత్నాకరం" తెరిచాను. "స్నిగ్ధ" కి "కౌముది" కి అర్ధాలు వెతుక్కున్నాను. మంచి రోజు చూసుకుని దేముడికి బాగా దండం పెట్టుకుని నా బ్లాగ్ కి "స్నిగ్ధకౌముది (చిక్కని వెన్నెల)" అని నామకరణం చేసేశాను.

ఇవండీ నా బ్లాగ్ నామకరణ మహోత్సవ విశేషాలు. బ్లాగ్ మిత్రులందరూ నా బ్లాగ్ ని ఆశీర్వదించి, నా ఈ స్నిగ్ధకౌముదిని అందరూ ఆస్వాదించాలని నా కోరిక.