మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్..
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు..
పార్వతీ తనయా ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్"
నా చిన్ననాటి ప్రియ నేస్తం "బొజ్జ గణపతి". అప్పుడు నాకు సరిగ్గా నాలుగేళ్ళు. మా వీధి చివర "బొజ్జ గణపతి" గుజ్జు రూపం చెక్కిన ఒక పెద్ద రాయి వుండేది, పక్కనే చిన్న కొలను లాంటిది వుండేది.
ప్రతీరోజూ పొద్దున్నే మా తాతగారు అన్నయ్యనీ, నన్నూ స్కూల్ కి తీసుకు వెళ్ళేటప్పుడు "బొజ్జ గణపతి" దగ్గరికి తీసుకెళ్ళేవారు. అలా మా ఇద్దరికీ దోస్తీ కుదిరింది. అయన దండం పెట్టుకుని ప్రదక్షణలు చేసుకుని వచ్చేలోపు కొన్ని కబుర్లూ.. మళ్లీ సాయంత్రం స్కూల్ నించి వచ్చాక మరిన్ని కబుర్లూ చెప్పేదాన్ని "బొజ్జ గణపతి" కి . అలా ఎన్నెన్నో కబుర్లూ, ఆటలు, పాటలు. అసలు క్షణం తీరేది కాదు మా ఇద్దరికీ.
బామ్మ పెట్టే తాయిలం మా ఇద్దరికీ చెరిసగం. నా వంతు తినేసి తన వంతు ఆకులో పెట్టి అక్కడే పక్కన పెట్టి వచ్చేదాన్ని(బామ్మ చెప్పేది అలా చేస్తేనే "బొజ్జ గణపతి" తాయిలం తింటాడని). తెల్లారి వెళ్లి చూస్తే ఆకు ఖాళీగా వుండేది. పరుగున ఇంటికొచ్చి బామ్మ తో చెప్పేదాన్ని "బొజ్జ గణపతి" తాయిలం తినేశాడని.
స్కూల్ లో టీచర్ మార్కులు తక్కువేసినా, అల్లరి చేస్తున్నావని తిట్టినా..వెంటనే మా "బొజ్జ గణపతి"కి చెప్పేదాన్ని. అమ్మా , అన్నయ్యా , బామ్మా , తాతగారూ, స్కూల్లో టీచర్లూ, ఫ్రెండ్స్... ఎవరేమన్నా వెళ్లిపోయి మా "బొజ్జ గణపతి" కి ఫిర్యాదు చేసేదాన్ని.
ఒకసారి బాగా వర్షం పడింది. మా "బొజ్జ గణపతి" పాపం వర్షం లో తడిసిపోయాడు. పాపం తనకి ఇల్లు లేదుగా..!! అందుకని, పాపం "బొజ్జ గణపతి" వానలో తడిసిపోతున్నాడు ఇంటికి తెచ్చేసుకుందాం అని మా తాతగారిని అడిగాను. ఆయన నవ్వేసి..మర్నాడు ఒక దేవ గన్నేరు కొమ్మ తెచ్చి బొజ్జ గణపతి విగ్రహం (చాల పెద్ద రాయి ) వెనకాల నాటారు. తరవాతి కాలం లో అది పెద్ద మానై మా "బొజ్జ గణపతి" కి చల్లని నీడనిచ్చేది, బోలెడన్ని పూలిచ్చేది. అందుకే ఆ చెట్టు నాకు కూడా నేస్తమైపోయింది.
ప్రతీ యేడాది మా "బొజ్జ గణపతి" పుట్టిన రోజు నాడు తనకి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర, అన్నీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం తాతగారూ, అన్నయ్యా, నేను.
కాలక్రమేణా మా వీధి లో జనాభా పెరిగి, ఇళ్ళూ పెరిగి, కాలనీ అసోసియేషన్ వారు మా "బొజ్జ గణపతి" ని నాలుగు గోడల మధ్యన బంధించేశారు. ఎప్పుడంటే అప్పుడు వెళ్లేందుకు లేకుండా తాళం వేసేశారు. నేనంటే నేనంటూ ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుంటూ "బొజ్జ గణపతి" ఉనికినే మరచిపోయారు.
బ్లాగ్మిత్రులందరికీ "వినాయక చతుర్ధి" శుభాకాంక్షలు.
9 కామెంట్లు:
చిన్నప్పుడే 'పెద్ద' స్నేహితుడిని సంపాదించేసుకున్నారన్న మాట.. బాగున్నాయి మీ జ్ఞాపకాలూ.. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
అమ్మో!..బొజ్జగణపతితోనే దోస్తీ చేసేసారు. బావున్నాయి మీ దోస్తీ కబుర్లు.
మీ టపాలు నిన్ననే చదివాను.
మీకు నిన్ననే కామెంట్ పెడదామని ప్రయత్నించాను. కానీ మీ కామెంట్ బాక్స్ ఇబ్బంది పెట్టింది. మీరు మీ కామెంట్ బాక్స్ వేరే పేజీలో ఓపెన్ అయ్యే విధంగా సెట్టింగ్స్ మార్చుకోండి. ప్రస్తుతం ఉన్న కామెంట్ బాక్స్ కొన్నిసార్లు సరిగ్గ పనిచేయదు.
మురళి : ధన్యవాదాలు. అన్నట్టు మా గణపతి కి బొజ్జ తప్ప మిగతా అంత వెండి తొడుగు చేయించారటండి. ఇప్పుడు బొజ్జకి చేయించడానికి అందరూ తమ వంతుగా కొంత డబ్బు ఇస్తున్నారట. ఇన్నాళ్ళకి మా బొజ్జ గణపతిని అందరూ పట్టించుకుంటున్నారు.
శేఖర్ పెద్దగోపు : ధన్యవాదాలండి. మీరు చెప్పినట్టు కామెంట్ బాక్స్ మార్చేశాను. ఇక ముందు ఇబ్బంది కాదు.
దేవుడూ పెద్దలకన్నా పిల్లలకే బాగాదగ్గరవుతాడు. నాకంటూ స్థిరంగా ఉన్న కొన్ని అభిప్రాయాల్లో ఇదొకటి. అహంలేకపోవడం, గొంతెమ్మకోర్కెలేవీ అడగకపోవడం ఇలాంటివే కారణలనుకుంటా. మహా అయితే నూటికి తొంభై మార్కులు అంతకుమించి అడిగేవేవీ ఉండవుగా. ముత్యాలముగ్గులో బాపుకూడా హనుమంతుడూ పిల్లలకే స్నేహితుడైనట్టు చూపిస్తాడుకూడా.
ఇక దేవుడికోసం తగాదాలంటారా కలిప్రభావం అనుకోవాలి. అయినా అవన్నీ తాత్కాలికం.
@సుబ్రమణ్య చైతన్య: నిజం..అందుకే కదండీ పిల్లలు భగవంతుడి స్వరూపాలంటారు.
that is so sweet.
@ కొత్త పాళీ: ధన్యవాదాలండీ.
navavidha bhaktimargalalo medi snehabhakti ani anukuntunnna idi dento motham dasavidha bhakti anali
కామెంట్‌ను పోస్ట్ చేయండి