21, ఆగస్టు 2009, శుక్రవారం

పుష్పవిలాపం




"నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను..ప్రభూ !! ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళ లాడుతూంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి ...అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి..చివాలున కొమ్మవంచి..గోరానెడునంతలోన..విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి..మా ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి కృంగిపోతూ ..నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై..."

మధ్యాహ్నం భోంచేసిన తరువాత విశ్రాంతిగా కూర్చుని ఘంటసాల గారి ప్రైవేటు ఆల్బం వింటున్నా... నా చిన్ననాటి జ్ఞాపకాలు అలలు అలలు గా వచ్చిమనసును తాకుతున్నాయి.

నాకు మొక్కలన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా పక్కింట్లో బామ్మగారు నాకు మొక్కలు ఎలా నాటాలో, వాటి బాగోగులు ఎలా చూసుకోవాలో అన్నీనేర్పింది. నేను ప్రతీరోజూ స్కూలు కి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ ఎవరింట్లో ఏ పూల మొక్కలున్నాయా అని చూసుకుంటూ వెళ్ళేదాన్ని. ఆదివారం నాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్లి కొమ్మలడిగి తెచ్చుకుని వాటిని నాటి నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకునే దాన్ని.

ప్రతీ రోజూ ఉదయం స్కూలు కి వెళ్లేముందు వరకూ , సాయంత్రం రాగానే రెండు గంటలు మా తోట లోని మొక్కలతో నా సహవాసం. మల్లెలు, మందారాలు, సన్నజాజి, విరజాజి, మరువం, గులాబీలు (తెలుపు, ఎరుపు, లైట్ పింక్ అన్నీ దేశవాళి వే) , బంతులు, చేమంతులు, కనకాంబరాలు, అన్నీ..నా నేస్తాలే!!

ఏ కొమ్మకి కొత్త చిగురేసినా నాకు పండగే. ప్రతీ చిగురూ నాకు లెక్కే . శనివారం రాత్రి అమ్మ ఏ సమయానికి ఇంటికి వచ్చినా సరే (అమ్మ ఉద్యోగం వేరే ఊళ్ళో..వారానికి ఒకసారి ఇంటికి వచ్చేది) ఆమె వెంట తిరుగుతూ అన్నీ ఏకరువు పెట్టేదాన్ని. మర్నాడు ఉదయం ముందు తోటలో నా నేస్తాలని చూశాకే అమ్మకి మిగతా పనులకి పర్మిషన్.

ఇలా వుండగా.. ఒకరోజు మా టీచర్ (నేను 8 వ తరగతి లో వున్నప్పుడు ) మాకందరికీ "పుష్పవిలాపం" పాఠం చెప్పారు. నా మనసులో బాగా హత్తుకుపోయిందా పాఠం. ఆ రోజు నించి నా తోటలో పూలు కోయడం నిషేదించేశాను. స్కూలు కి వెళ్ళే వరకూ , వెనక్కి వచ్చాక ఎలాగూ తోటలోనే మకాం.. కానీ మరి స్కూల్లో వున్నప్పుడు ఎవరైనా పూలు కోసేస్తే? అందుకని ప్రతీ రోజూ అన్నీ పూలు లెక్క వేసుకుని వెళ్ళేదాన్ని . మళ్లీ వెనక్కి వచ్చాక లెక్క చూసుకునే దాన్ని. పువ్వు మీద చెయ్యి వేస్తే 5 రూపాయలు ఫైన్. అది ఎవరైనా సరే.


అంత కష్టపడి తోటని కాపాడుకునే నాకు మా అమ్మమ్మ పెద్ద విలన్. ఏదో మాయ చేసి చెట్లు మొత్తం దులిపేసి నా తోటలో పూలన్నీ దోచేసేది. అమ్మమ్మకి అమ్మ సప్పోర్టు.

ఒకసారి గులాబీల సీజన్లో అన్నీ గులాబీలు విరగబూశాయి. కాండం కానీ ఆకులు కానీ కనిపించనంతగా.. మందారాలకి సీజన్ ఏమి వుండదు కాబట్టి అవి ఎప్పటిలాగానే బాగా పూశాయి. నన్ను స్కూలు కి వెళ్ళనిచ్చి , అమ్మమ్మ (మా పక్కింటికి పక్కింట్లో వుంటారు) పెద్ద బుట్ట నిండా అన్నీ పూలు కోసేసుకుని ( ఒక్క పువ్వు కూడా మిగలకుండా) వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చాక చూస్తే తోటంతా ఖాళీ.

చాలా బాధేసింది. బాగా ఏడ్చాను. ఇలా జరిగింది అని అమ్మకి చెప్పాలని...కానీ వారం రోజులు ఆగితే కానీ అమ్మ రాదుగా..ఆ బెంగ తో జ్వరం వచ్చేసింది. సుమారుగా నెల రోజులు పట్టింది కోలుకోవడానికి.

" ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కని పెంచిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్తుము...తదీయ కరమ్ముల లోన స్వేచ్చమై నూయలలూగుచున్ మురియుచుందుము...
ఆయువు తీరినంతనే...హాయిగా కన్నుమూసేదము...ఆయమ చల్లని కాలి వ్రేళ్ళ పై...

గాలిని గౌరవింతుము సుగంధము పూసి..సమాశ్రయించు భ్రున్గాలకు విందు చేసెదము కమ్మని తేనేలూరి...మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి కూర్తుము...స్వతంత్రుల మమ్ముల...స్వార్ధ బుద్దితో తాళుము తుంపబోకుము... తల్లికి బిడ్డకు వేరు సేతువే.."

టేప్ రికార్డర్ లో పాట ఇంకా వినిపిస్తోంది... ఘంటసాలగారి కంఠం లోంచి కురిసిన అమృత ధార .. చిన్ననాటి చేదు జ్ఞాపకాన్ని రూపు మాపే ప్రయత్నం చేస్తోంది.



8 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

కరుణశ్రీ గారి 'పుష్పవిలాపం' నాక్కూడా చాలా ఇష్టం అండీ.. పుస్తకం కోసం ప్రయత్నిస్తున్నా.. ఎక్కడా దొరకడం లేదు.. ఘంటసాల గొంతు నుంచి వినడం ఒక అద్భుతమైన అనుభూతి.. బాగున్నాయి మీ పూల కబుర్లు.. నేను కూడా చిన్నప్పుడు మొక్కలు పెంచానండీ.. రాస్తాను, వీలు చూసుకుని...

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

karuna sri gari puspa vilapamu naku na 8th class nunchi istamu andi chaala thanks malla ikkada mee dvara adi chusinaduku
k na peru harish please visit my blog also

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి : పుస్తకం దొరికితే నాకూ చెప్పండి. ధన్యవాదాలు

ప్రణీత స్వాతి చెప్పారు...

మిర్చీ వర్మ ఒక మంచి పిల్లోడు : తప్పకుండా చూస్తానండి..ధన్యవాదాలు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మనసుకు ఆహ్లాదంగా అనిపించిండి మీ పూల కబుర్లు చదవగానే.
నాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టమండి. ఊళ్ళో ఉన్నప్పుడు మా ఇంటిలో నేను కూడా మీలాగే రకరకాల మొక్కలు వేసి, సాయింత్రం వాటిని అపురూపంగా చూసుకొనేవాడిని.
చివరిలో మీరు ప్రస్తావించిన పాట మాకు లింకు ద్వారా అందించుంటే మేం కూడా వినేవాళ్ళంకదండీ..

తృష్ణ చెప్పారు...

మొక్కలు,పువ్వులు గురించి ఎంత చదివినా తనివితీరని పిచ్చి నాకు ఉందండి...నేనూ పెద్ద గార్డెన్ పెంచాను ఒక టైం లో...అవన్నీ గుర్తు చేసారు..వాటి గురించి ఒక టపా రాయాలని చాలా రోజుల నుంచీ...రాసాకా చెప్తాను చూదండేం...!

ప్రణీత స్వాతి చెప్పారు...

తృష్ణ: తప్పకుండా చదువుతానండి, ధన్యవాదాలు.

తూర్పింటి నరేశ్ కుమార్ చెప్పారు...

ప్రణీత .స్వాతి గారు మీ బ్లాగ్ చదివాను చాలా బాగుంది.
మీరు ఆరుద్ర గారి కూనలమ్మ చదివారా ....!!!! బాగుంది ...నేను చదివాను ...వారి సమగ్రాంధ్ర సాహిత్యం వారి కృషి నిజ్జంగా నిలువెత్తు నిదర్శనం....మీకు కోఠి లో పుస్తకాలు కొనే విషయం...మేముకూడా ఓ.యూ నుండి అప్పుడప్పుడు కోఠి కి పుస్తకాలు కొనడానికి వస్తాము....మీ సాహిత్యాభిరుచికి హ్యాట్సాఫ్ .....తూర్పింటి నరేశ్ కుమార్ పరిశోధక విద్యార్థి