27, జనవరి 2011, గురువారం

సిరిమల్లె నీవే..



వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాను..ఈ పాట నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పాలని..కానీ ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పదమూ నాకు సహకరించక మూగనైపోయాను. అదేపనిగా పదే పదే ప్రయత్నించగా.. ఓ నాలుగక్షరాలు నన్ను కనికరించాయి.. అవి మీతో పంచుకుందామని..ఇలా వచ్చాను.

ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాలూ గారి గళం ఇంకా చాలా ఇష్టం. రేడియో లోను, టేప్ రికార్డర్ లోను, ఇంటర్నెట్ లో కూడా ఎప్పుడూ వినడమే కానీ.. ఈ పాటని ఎప్పుడూ చూడలేదు. అసలిది ఏ సినిమా లో పాటో కూడా తెలిదు వారం క్రితం వరకు. అసలు తెలుసుకోవాలనిపించలేదు. తెలుసుకుంటే..చూడాలనిపిస్తుంది. అది నాకు ఇష్టం లేదు.  "నెమలికన్ను మురళీ గారన్నట్టు... ఒక కధని అక్షరాల్లో చదివినప్పుడు, లేదా ఏదైనా చక్కటి పాటని విన్నప్పుడు కలిగే అనుభూతిని దృశ్యం ద్వారా కలిగించడం దుస్సాధ్యం".

కానీ..అనుకోకుండా వారం రోజుల క్రితం..నా ఫ్రెండ్ వాళ్ళింట్లో యు ట్యూబ్ లో ఈ పాట చూశాను. మెస్మరైజ్ అయిపోయాను. వేటూరి గారి మాటలెంత సున్నితంగా అందంగా వున్నాయో.. పాట చిత్రీకరణ కూడా హీరో రంగనాథ్, హీరొయిన్ లక్ష్మిల పైన అంతే అందంగా..కాదు కాదు అద్భుతంగా చిత్రీకరించారు (ఇక్కడో చిన్న మాట చెప్పాలి. రంగనాథ్ ని చూడగానే యద్దనపూడి నవలల్లో కధానాయకుడు గుర్తుకొస్తాడు నాకు).

నీలాకాశం..దాన్నిండా పరచుకున్న వెండి మబ్బు.. కొండలూ..లోయలూ..విశాలమైన మైదానాలు..అందమైన జలపాతాలు..ఓహ్! బాలూ గారు తన గాత్రంతో , రాజన్ నాగేంద్ర గార్లు తమ సంగీత దర్శకత్వ ప్రతిభ తో  ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. .ఇక చెప్పలేను మహాప్రభో..చూసేయండి.






 సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
 వరదల్లె రావే..వలపంటి నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!

ఎలదేటి పాట..చెలరేగే నాలో..
చెలరేగి పోవే..మధుమాసమల్లే..
ఎల మావి తోట..పలికింది నాలో..
పలికించుకోవే..మది కోయిలల్లే..

నీ పలుకు నాదే..నా బ్రతుకు నీదే..

తొలి పూత నవ్వే..వన దేవతల్లే..
పున్నాగ పూలే..సన్నాయి పాడే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!

మరుమల్లె తోట..మారాకు వేసే..
మారాకు వేసే..నీ రాక తోనే..
నీ పలుకు పాటై..బ్రతుకైన వేళ..
బ్రతికించుకోవే..నీ పదము గానే..

నా పదము నీవే..నా బ్రతుకు నీదే..

అనురాగమల్లే..సుమగీతమల్లె..
నన్నల్లుకోవే..నా ఇల్లు నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..!!సి!!



8 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నిజమేనండి. వెండి మబ్బుల్ని ఎక్కడా వదిలేయకుండా పట్టుకున్నారు. బాగుంది. నాకూ చాలా ఇష్టమైన పాట ఇది.
కొన్ని మంచి పాటల చిత్రీకరణ చూస్తే నీరసమొస్తుంది. అందుకే నేనెప్పుడూ ప్రయత్నించలేదు. థాంక్స్ ఫర్ వీడియో.

Unknown చెప్పారు...

ఈ పాటంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఈ పాటికి ఈ పాట వివరాలు మీకు తెలిసే ఉండవచ్చు. అయినా నా తృప్తికోసం రాస్తున్నాను. రాజన్ నాగేంద్ర స్వరపరచిన ఈ పాటను వేటూరి రాసారు, చిత్రం పేరు పంతులమ్మ.

చెప్పాలంటే...... చెప్పారు...

naku estam. manchi paata chaalaa baavuntundi

శిశిర చెప్పారు...

బాలూగారు పాడుతుంటే ఈ పాటని ఆస్వాదించాలే గాని మీరన్నట్టు మాటల్లో చెప్పాలని ప్రయత్నిస్తే కష్టమేమరి. :) తొలి చరణం పాడుతున్నపుడు బాలూగారు పలికించిన భావాలు, "తొలి పూత నవ్వే" అంటున్నపుడు ఆ మాటతో పాటు నవ్వే చిన్న నవ్వు, ఆయన గొంతులోని లేతదనం ఎంతబాగుంటుందో ఈ పాట వింటుంటే. చక్కని పాటని పరిచయం చేశారు.

అరుణాంక్ చెప్పారు...

ఈ పాటంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం.

♥♥♥$υяєรн мσнคи♥♥♥ చెప్పారు...

మిమిక్రీ వాసనలు లేని బాలుగారి తొలినాటి పాటలు అన్నీ కూడా అద్బుతమే ... లేలేత ప్రాయంలో పాడిన తొలిపాటలు, తొలివలపంత తియ్య తియ్యగా ...లేత చిగురంత కమ్మ కమ్మగా ఉంటాయి! ... ఈ పాటను ఎప్పుడు వినడమే కాని ... చూడలేదు .. నెమలికన్ను చదువుతూ మీ బ్లాగ్ కి వచ్చా .. చాలా ధన్యవాదాలు ...

ప్రణీత స్వాతి చెప్పారు...

@ మందాకినీ : ధన్యావాదాలండీ.

@ ప్రసీద : టపాలో పెట్టడం కోసం తెలుసుకున్నానండీ. మళ్ళీ రిఫ్రెష్ చేసినందుకు ధన్యవాదాలండీ.

@ చెప్పాలంటే : అవును చాలా అద్భుతమైన పాట. నా బ్లాగ్ కి వచ్చి వీక్షించినందుకు ధన్యవాదాలు.

@ శిశిర : అవునండీ. రెండు చరణాలకి మధ్య ఆలాపన ఇంకా చాలా బాగుంటుంది.

@ అరుణాంక్ : స్నిగ్ధకౌముదికి స్వాగతమండీ..

@ సురేష్ మోహన్ : స్నిగ్ధకౌముదికి స్వాగతమండీ..నిజమే. బాలూ గారి చిన్నప్పటి పాటలన్నీ చాలా బాగుంటాయి.

మురళి చెప్పారు...

ఈ పాటతో పాటు ఇదే సినిమాలోని 'మానసవీణ మధుగీతం..' పాట కూడా నాకు చాలా ఇష్టమండీ.. వీడియో బాగుంది..