డా!! భానుమతి..బహుముఖ ప్రజ్ఞాశాలి. రచన, నటన, గానం అన్నింటిలో ఆవిడది ఒక ప్రత్యేక శైలి. సినిమాల్లో ఆవిడని చూస్తే గర్విష్టి అని , డామినేట్ చేసేస్తుందని అనిపించడం కద్దు. కానీ భానుమతి గారి ఆత్మ కధ "నాలోనేను " ఆవిడ అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించేస్తుంది.
నాకు భానుమతిగారి అన్ని పార్శ్వాలు నచ్చినా..ఆవిడ రచనలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. విశిష్టమైన కంఠస్వరం..అందులో పలికే అద్భుతమైన గమకం..గొప్ప స్వరజ్ఞానం.. ఆవిడకే ప్రత్యేకం. అంతా మనమంచికే అన్న సినిమాలోని ఈ పాట చాలా అద్భుతంగా పాడారావిడ.
ఈ పాట కి సంగీతం భానుమతి, సత్యం గారు సమకూర్చారట. పాట చివర్లో ఆలాపన హిందుస్తానీ ఆలాపనని గుర్తు చేస్తుంది. పండిట్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి తో ఇన్స్ పైర్ అయ్యి చేసిన పాట అని శైలజ గారు జీ తెలుగు లో చెప్పగా విన్నాను. నాకెంతో ఇష్టమైన ఈ పాట మీరందరూ కూడా విని ఆనందించాలని నా కోరిక.
ఇంకో విశేషమేంటంటే..జీ తెలుగు స రి గ మ నువ్వా నేనా..లో సాహితి అనే అమ్మాయి (10 ఏళ్ళు ఉంటాయేమో) అద్భుతంగా పాడింది. అంత చిన్న వయసు లో ఆ పాట సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటే..అద్భుతంగా పాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో కూడా అటాచ్ చేశాను. చూస్తారుగా..
నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..!!నేనే!!
విరిసిన పున్నమి వెన్నెలలో...
చల్లని యమునా తీరములో...
నీ పెదవులపై వేణు గానమై...
పొంగి పోదురా... నేనే వేళా...!!నేనే!!
ఆడే పొన్నల నీడలలో...
నీ మృదు పదముల జాడలలో...
నేనే నీవై...నీవే నేనై...కృష్ణా...ఆ...ఆ...ఆ...
అనుసరింతురా నేనే వేళా..!!నేనే!!
4 కామెంట్లు:
మంచి పాటని గుర్తు చేసారు!
పున్నమి వెన్నెల లాంటి పాట.. చాలా రోజులు అయ్యింది విని .. మీ post చూసి చేస్తున్న work పక్కన పెట్టేసి మరీ విన్నా .. మంచి పాట గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.. ఈ పాటకి సాహిత్యం దాశరధి గారు...ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా చాలా బాగుంటాయి... మాట చాలదా మనసు చాలదా, నవ్వవే నా చెలి, పాటలు చాలా బాగుంటాయి
ఈ పాట తమిళ్ లో కూడా విన్నట్టు గుర్తండీ.. దూరదర్శన్ చిత్రలహరి లో తరచూ వచ్చేది..
ఒక అద్భుతమైన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు.ఈ పాట మొదటిసారివిన్నప్పుడు భానుమతి గొంతేదో, షెహనాయి ఏదో తెలియక కన్ ఫ్యూస్ అయ్యాను. ఇటువంటి పాటలు విన్నప్పుడు భానుమతి తనకున్న ప్రతిభాపాటవాల్ని చాలవరకు వృధా చేసింది అనిపిస్తుంది నాకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి