26, జనవరి 2010, మంగళవారం

నెమలి కన్ను- అము



బ్లాగ్ మిత్రులందరికీ హలో, హాయ్, నమస్తే!


దాదాపు ఐదు నెలల విరామం తరవాత మళ్ళీ మీ ముందు కొస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ముందుగా మిత్రులందరికీ క్షమార్పణలు...అలాగే ధన్యవాదాలు.


ఎందుకనంటే..


మీరందరూ ఎన్నిసార్లు అడిగినా ఇదిగో వచ్చేస్తున్నా... అదిగో వచ్చేస్తున్నా... అంటూ ఐదు నెలలు కాలం గడిపినందుకు క్షమార్పణలు. నా మీద అభిమానంతో నా ఈ ఆలస్యాన్ని ఎంతో ఓర్పుగా భరించినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఈ ఆలస్యం ఎందుకు జరిగినట్టు? అని అనిపించింది కదండీ.. మరేం లేదండీ ..చిన్న ఆక్సిడెంటూ..ఒక ఐదు నెలలు కంప్లీట్ బెడ్ రెస్టూ...అదన్నమాటండీ విషయం.


టైటిల్ ఏదో పెట్టి ఏదో రాస్తోందేంటి అనుకుంటున్నారా..? వస్తున్నానండీ అక్కడికే వస్తున్నా..!


రెస్ట్ లో వున్నా..అప్పుడప్పుడు బ్లాగులు చదువుతూ వుండేదాన్ని. సుమారుగా రెండు నెలల క్రితం నవంబర్ లో అనుకుంటాను..ఒకరోజు "నెమలి కన్ను" లో "అము"(నాయికలు-కజు) చదివానండి. ఎప్పటి లాగానే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది.


అసలే తిరుమల లో "దర్శనం క్యూ" అంత పెద్దగా వున్న నా పుస్తకాల లిస్టు కి ఈ పుస్తకం కూడా చేరి ఇంకాస్త పెద్దదైంది లిస్టు. ఏం చెయ్యాలీ..మనం కదల్లేం, మరొకర్ని అడగలేం..కిం కర్తవ్యమ్..? అని ఆలోచించగా..చించగా...చించగా... అదేదో అడ్వర్టైజ్మెంట్ లో లాగా చటుక్కున నా బుర్రలో లైట్ వెలిగింది. వెంటనే నేను మా ప్రీతీ (మా అన్నయ్య భార్య) కలిసి ఛలో "రెడిఫ్ షాపింగ్" అంటూ ఆన్ లైన్ షాపింగ్ చేసేసి ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేశాం.


ఎదురు చూడగా చూడగా నా సహనానికి పరీక్ష పెట్టి (మనకది చాలా తక్కువ లేండి) కరెక్ట్ గా నెల రోజులకి వచ్చింది కోరియర్ లో పుస్తకం . ఏదో ఒక నిధి దొరికినంత సంబరపడిపోయి..నేను అప్పటికే చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి "అము" చదవడం మొదలెట్టేద్దాం అనుకుంటూండగా...మీరాల్రేడీ ఒక పుస్తకం చదువుతున్నారు కదా..ఇది నేను చదివి మీకిస్తానంటూ పట్టుకెళ్ళిపోయింది మా ప్రీతీ. మళ్ళీ సస్పెన్సే. సరే ఏం చేస్తాంలెమ్మని నాకు నేనే సర్ది చెప్పుకున్నా.


ఓ వారం పోయాక ఒక రోజు రాత్రి ఎప్పటిలాగా నేను మంచానికి అతుక్కుపోయి ఏదో పుస్తకం చదువుకుంటున్నా..హఠాత్తుగా ముక్కెగపీలుస్తూ మా ప్రీతీ నా గదిలోకి వచ్చింది. కళ్ళు ఎర్రగా వాచిపోయి మనిషి బాగా ఎడ్చినట్టుగా వుంది. ఏమైందా..ఎవరైనా ఏమైనా అన్నారా? లేక మా అన్నయ్య కేమైనా ఇబ్బంది అయిందా(తను ఆర్మీ లో మేజర్, ఇప్పుడు వైష్ణో దేవి నించి 8 కిమీ రియాసి లో పని చేస్తున్నాడు), అనుకుని కంగారు పడ్డాను.


ఏమైందని నేను ప్రశ్నించే లోపే తనే...ముక్కెగపీలుస్తూ ఈ బుక్ చాలా బాగుంది..చాలా టచ్చీగా వుంది..నేను బాగా ఎమోషనల్ ఐపోయాను, బాగా ఏడ్చాను అని చెప్పింది. మీరూ తప్పకుండా చదవండీ అని చెప్పి పుస్తకం నా చేతికిచ్చి వెళ్ళిపోయింది. నాకు నవ్వొచ్చింది. అంత కష్టపడి కొనుక్కున్నది చదవడానికేగా..కానీ అందుక్కాదు నాకు నవ్వొచ్చింది.. ఒక పుస్తకం చదివి అంతలా ఏడవాలా సిల్లీ కాకపొతే అని.


తరవాత చాలా రోజులు నాకు ఆ పుస్తకం చదవడానికి వీలవ్వలేదు. కదలలేని స్థితిలో ఏవిటంత రాచకార్యాలూ..? అనుకుంటున్నారా..అబ్బే రాచకార్యాలేమి లేవండీ..కాకపోతే ఇంకేవో పుస్తకాలు చదువుతూండడం మూలాన ఇది చదవడం కుదరలేదంతే. మొన్న వారం క్రితం పుస్తకాల దొంతర తిరగేస్తోంటే ఇది కనిపించింది. చాలా మామూలుగా మొదలు పెట్టి పుస్తకం పూర్తీ అయ్యేదాకా మరి లేవకుండా, వదలకుండా  చదివాను. మా ప్రీతిలాగా ఏడవలేదు, కానీ బాగా నచ్చింది పుస్తకం.


అంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసి వెంటనే కొనిపించి, చదివించిన (కొద్దిగా ఆలస్యంగానైనా సరే) నెమలి కన్ను మురళీ గారికి ఇలా నా టపా ముఖంగా ధన్యవాదాలు చెప్పాలనిపించి ఈ టపా రాశానండీ. ఇంతకీ ధన్యవాదాలు చెప్పలేదు కదా అంటారా..ఇదిగో ఇప్పుడే చెప్తానండీ..


మురళీ గారూ...మీకు చాలా చాలా చాలా చాలా చాలా థాంక్సండీ..ఇంత మంచి పుస్తకం కొనిపించి, చదివించినందుకు.

11 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

ఐదు నెలలు బెడ్ రెస్ట్ అని ఎంత జోక్ గా చెప్పారండి . ఇప్పుడు కులాసానేనా ?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మురళి గారు ఎంతో అభిమానంతో సజస్ట్ చేసిన కధలు, పుస్తకాలు నేను మాత్రమే చా....లా లేటుగా చదువుతాను అని అనుకుంటుంటాను...హమ్మయ్య...మీరు ఈ విషయంలో నాకు తోడున్నారన్నమాట :-)...అన్నట్టు ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం?

sunita చెప్పారు...

ఇప్పుడెలా ఉన్నారు? కుశలమేనా?

జయ చెప్పారు...

మీ దగ్గిరనుంచి ఎటువంటి పోస్టులు లేకపోతే, చాలా బిజీ ఏమో అనుకున్నాను. కానీ ఇదీ సంగతి అని తెలియదు. ఎంత కూల్ గా చెప్తున్నారండీ, చిన్న ఆక్సిడెంట్ అని. అయిదునెలలు కదలలేని పరిస్థితిని చిన్న ఆక్సిడెంట్ గా ఎలా అనుకోవాలి. తొందరగా కొలుకొని వొచ్చేయండి. మురళిగారు ఇంకా చాలా బుక్స్ చెప్తారు. అవన్నీ, మీరే పోయి కొనుక్కొని చదివేద్దురుగాని. God bless you. Recover soon. All the best.

మురళి చెప్పారు...

ఐదు నెలల బెడ్ రెస్ట్ ని యెంత సింపుల్ గా చెప్పేశారండి? ఇంతకీ ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం? పూర్తిగా కోలుకున్నట్టేనా?
..ఐతే 'అము' మీకు నచ్చిందన్న మాట.. ఇద్దరు ముగ్గురు మిత్రుల చేత కూడా చదివించా.. వాళ్ళదీ ఇదే మాట, విడవకుండా చదివాం అని..

పరిమళం చెప్పారు...

పుస్తకం కాదుకాని సినిమా (కొంకణా సేన్ శర్మ )కోసం ట్రై చేశా ప్చ్ ....దొరకలేదండీ ....ఇక పుస్తకమే చదవాలి .

ప్రణీత స్వాతి చెప్పారు...

@ మాలా కుమార్ : పర్లేదండి కులాసాగానే వున్నాను. ధన్య వాదాలు.

@ శేఖర్ పెద్ద గోపు : ఆలస్యంగానైనా శ్రద్ధగా చదువుతాం కదండీ కాబట్టి మరేం పర్లేదు.

@ సునీత : కుశలమేనండీ. ధన్యవాదాలు.

@ జయ : ఇప్పుడు ఓ మోస్తరుగా కోలుకున్నట్టేనండీ..అందుకేగా వచ్చేశాను.

@ మురళీ : పూర్తిగా కాదు కాని కోలుకున్నట్టేనండీ. ఒక్క "అము" యే కాదండీ..నెమలి కన్ను గ్రంధాలయంలో అన్నీపుస్తకాలూ చాలా బాగుంటాయి.

@ పరిమళం : సినిమా కోసం నేను ప్రయత్నించలేదండీ..ఇకమీదట ప్రయత్నించాలి. పుస్తకం తప్పక చదవండి. మంచి పుస్తకం.

సిరిసిరిమువ్వ చెప్పారు...

చాలా పెద్ద ఆక్సిడెంటు నుండి బయటపడ్డారన్నమాట. మీరు త్వరలో పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అయ్ బాబోయ్ ఐదునెల్ల బెడ్ రెస్ట్ అని ఎంత అవలీలగా చెప్పేశారండీ. త్వరలో మీరు నూరు శాతం ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నాను.

swamy చెప్పారు...

swathi gaaru ippudu elaa vunnaaru?

రాధిక చెప్పారు...

ప్రణీత గారు,
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది..పూర్తీగా కోలుకున్నార??http://i.123g.us/c/gen_getwell/card/101594.gif