1, ఫిబ్రవరి 2010, సోమవారం

ఎవ్వరో పాడారు భూపాల రాగం



"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై...." ప్రభాతవేళ...పక్షుల కిలకిల రావాలతో ప్రకృతికి మేలుకొలుపు పాడుతున్న వేళ... ఈ భూపాల రాగం వింటూంటే అమృత ధారలలో  తడుస్తున్న అనుభూతి.  సాయం సంధ్య వేళ పశుపక్షాదులు తమ తమ నెలవులు చేరే వేళ విన్నా అదే అనుభూతి..అమృత ధారల్లో తడుస్తున్నట్టు. ఆ  గొప్పదనం పాటలోని మాటలదా..? రాగానిదా..? పాడిన గాత్రానిదా..? అని అనుకుంటే, ఆ  అతిరధులు ముగ్గురూ కలిసి సంగీత సాగరాన్ని మధించి వెలికి తీసిన ఆణిముత్యానిది. 


కోకిలమ్మ వినికిడి శక్తి లేని అమ్మాయి, ఒక అనాధ. ఐదారు వాటాలు(కాపురాలు) వున్న ఒక ఇంట్లో ఒక మూల చిన్న గది (వసారా) లో ఆమె నివాసం. ఆ  ఇంట్లో ఉంటున్న వారు చెప్పిన పని చేసి వారిచ్చిన డబ్బుతో జీవిత సాగిస్తూ వుంటుంది.  రాజు ఒక డిగ్రీ చదువుకున్న నిరుద్యోగి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్క ఒక బండి మీద సంచార లాండ్రీ దుకాణం నడుపుతూంటాడు. కోకిలమ్మ ఉంటున్న ఇంటి పరిసరాల్లోనే అతని దుకాణం వుండడం చేత ఇద్దరికీ పరిచయం జరగడం, అది ప్రేమగా మొగ్గ తొడగడం  తొందరగానే జరిగిపోతుంది. 


అప్పుడప్పుడు కూనిరాగాలు తీసే రాజుకి సంగీతం పట్ల ఆసక్తిని గమనించి, తను ఉంటున్న ఇంట్లోనే పైన పోర్షన్ లో ఉంటున్న రేడియో స్టేషన్ లో పనిచేసే అయన (పేరు గుర్తులేదు) దగ్గర సంగీతం నేర్చుకునే ఏర్పాటు చేస్తుంది. అతని చేత లాండ్రీ పని మాన్పించి, అతని పోషణ భారం తాను  చూస్తుంది.  అతని శ్రద్ధ, సాధన, ఆమె శ్రమ ఫలించి అతను సంగీతంలో నిష్ణాతుడవుతాడు.      


ప్రతీ రోజూ గుడిలో పాడే అతని గాత్రానికి ముగ్దురాలైన స్వప్న అనే అమ్మాయి తన అన్నగారితో చెప్పి అతనికి వేదిక మీద పాడే అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశం ఒక గాయకుడిగా అతనికి మంచి పేరు తెస్తుంది, .అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఆ  తరువాత  సంగీత సాగరంలో అతని ప్రయాణం ఎలా సాగింది? మనసిచ్చి, అతని జీవితాన్ని తీర్చి దిద్దిన కోకిలమ్మ ఏమైంది? అనేది ఈ కోకిలమ్మ సినిమా లో కధాంశం. రాజు గాయకుడిగా మొదటి సారి వేదిక మీద పాడిన పాటే ఈ "ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై.."


బాల చందర్ గారు తీసిన ఈ సినిమాకి...ఆచార్య ఆత్రేయ గారు పాటలు రాయగా, ఏం.ఎస్.విశ్వనాథన్ గారు స్వరపరచి, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారూ, పీ. సుశీల గారూ పాడిన ఈ సినిమాలోని నాలుగు పాటలూ ఆణిముత్యాలే. అందులో నాకు నచ్చిన ఈ పాటలో రెండు చరణాల్లోనూ... మొదటి వాక్యం మినహాయించి మిగతా చరణమంతా పాటలా కాక మాటల్లో చెప్పడం ఈ పాట ప్రత్యేకత. 


నాకెంతో నచ్చిన ఈ పాట మీ అందరితో పంచుకోవాలనిపించి నే చేసిన చిన్ని ప్రయత్నమిది. నా ఈ ప్రయత్నం లో పొరపాట్లు, తప్పులు ఏవైనా దొర్లితే మన్నించమని ప్రార్ధన. కింద ఇచ్చిన లింకు లో ఈ పాట వినవచ్చు. 


"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..
కనుగొంటినీ ఆ దేవినీ...అబినందనం..అబినందనం..అభినందనం.
వాణియై నాకు బాణీయై ఏ దయ నా హృది మీటెనో..
ఆ మూర్తికీ  స్త్రీ మూర్తికీ  అభినందనం..అభినందనం..అభినందనం.

ఉషోదయాన  కాంతి తానై తుషార బిందువు నేనై..సప్త స్వరాల హరివిల్లునైతీ...
"ఆ కాంతికి నా రాగమాలిక నర్పిస్తున్నా...మీ అందరి కరతాళ హారతులర్దిస్తున్నా..
నేడే అర్చన సమయం...నా నవ జీవన ఉదయం...
యెదలో మమతా గీతం...గుడిలో ఘంటానాదం...
ఇది నా తోలి నై..వేద్యం..." !!ఎవ్వరో!!

వసంత కాల కోకిలమ్మా..జన్మాంతరాల ఋణమా..నీ ఋణమేరీతి చెల్లింతునమ్మా..
"నా జీవితమే ఇక నీకు పదపీఠం...నీ దీవెనలే నాకు మహా ప్రసాదం..
నేడే నా స్వర యజ్ఞం...నేడే ఆ శుభ లగ్నం...
తోలి నే చేసిన భాగ్యం...మదిలో మెదిలే రాగం...
ఇక నా బ్రతుకే...ధన్యం...!!ఎవ్వరో!! "

http://www.youtube.com/user/chanaktheright


14 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మంచి పాటలు, మంచి చిత్రం..చిత్రం సాగిన తీరు అంతా బావుంటుంది.. ముగింపు మాత్రం బాలచందర్ గారి తరహాలోనే ఉంటుంది. 'పల్లవించవా నా 'పాట కూడా చాలా చాలా బావుంటుంది.. నాకు చాలా ఇష్టమైన పాట.

మురళి చెప్పారు...

ఈ సినిమా నాకిష్టం అండీ.. పాటలు ప్రత్యేకమైన ఇష్టం.. చక్కని పరిచయం..

జయ చెప్పారు...

చాలా మంచి పాట. మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నాను. ఎన్నో రోజులకు ఈ పాటను గుర్తు చేసారు. బాగుంటుంది.

మధురవాణి చెప్పారు...

మీ పరిచయం బాగుందండీ..! ఈ సినిమా గురించి నాకు తెలీదు :( కానీ, మీరు చెప్పింది చూసాక ఆసక్తికరంగా అనిపిస్తోంది. తప్పక ప్రయత్నించి చూడాలి అనిపిస్తోంది.

వేణు చెప్పారు...

కోకిలమ్మ సినిమాలో పాటలన్నీ బావుంటాయి. ఈ పాట ప్రత్యేకంగా నాకు ఇష్టం. టపాగా రాసినందుకు అభినందనలు. యూట్యూబ్ లింక్ ఇవ్వటం బావుంది.

లిరిక్ ఇవ్వటం అభినందనీయం. కొన్ని అక్షర దోషాలున్నాయి, సరిచేయండి. ముఖ్యంగా తొలి చరణం మొదట మీరు రాసినట్టు కాకుండా ‘ఉషోదయాన’ అని ఉండాలి.

Unknown చెప్పారు...

కోకిలమ్మ సినిమా బావుంటుంది.. బాలచందర్గారి తరహా ముగింపుతో సహా. పాటలన్నీ మీరు చెప్పినట్టు దేనికదే అన్నట్టు ఉంటాయి. 'పల్లవించవా నా' పాట కూడా నాకు చాలా ఇష్టం.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

mamchi cinimssnu gurtuchEsaaru. dhanyavaadaalu

ప్రణీత స్వాతి చెప్పారు...

@ ప్రసీద : ఈ సినిమాలో చాలా పాజిటివ్ గా వుంటుందండీ ముగింపు. ముఖ్యంగా సరిత నటన చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.

@ మురళీ : నాకూ ఈ సినిమా, పాటలు బాగా ఇష్టమండీ. ముఖ్యంగా సరిత నటన చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.

@ జయ : నేను ఇంచుమించు ప్రతీ రోజూ వింటానండీ ఈ పాట. ధన్యవాదాలు.

@ మధుర వాణీ : తప్పక చూడండి. సినిమా చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.

@ వేణు : అక్షర దోషాన్ని సరిచేశానండీ. ఇక లింక్ అంటారా...మిత్రులందరూ వినడానికి వీలుగా ఉంటుందని ఇచ్చానండీ. ధన్యవాదాలు.

@ కెక్యుబ్ వర్మ : ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

నాకెందుకో సరిత సినిమాలు చాలా ఇష్టం.. చక్కని స్టోరీ ఉంటుంది..పైగా తన నటన కూడా చాలా నచ్చుతుంది.. చక్కని పాట పరిచయం చేసారు :)

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది.
భూపాలం, దానికి దగ్గరి కొన్ని ఇతర రాగాల గురించి నా టపా ఇక్కడ చదవొచ్చు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నాకు మీ టపా చూసేదాకా తెలీదండీ..బాల చందర్ గారి కోకిలమ్మ సినిమా ఉందని..ఎప్పుడూ వినలేదు/చూడలేదు..వీలైతే ఓ సారి చూడాలి ఈ సినిమా...పాటలు కూడా వినాలి..

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

blog look baagundi.

చందు చెప్పారు...

ఎం చెప్పమంటారు స్వాతి గారు ,నాకు అత్యంత ఇష్టమైన ఈ పాటే నా జీవితాన్ని ఒక (చీకటి) మలుపు తిప్పిందనా ? :-) :-((

ప్రణీత స్వాతి చెప్పారు...

అయ్యో..అదేంటండీ..ఏమైంది(ఇలా అడగవచ్చో లేదో తెలిదు)?