9, మే 2010, ఆదివారం
అమ్మ
వెంకట రత్నమ్మ...రిటైర్డ్ హెడ్ మాస్టర్..
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎన్ని ఆగడాలు చేసినా, తన మీద ఎంత దౌర్జన్యం చేసినా, ఆస్తంతా తగలేసినా, సంపాదనలో ఒక్క రూపాయ ఇవ్వకపోయినా.. తనను భార్యగా గౌరవించడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడకపోయినా కేవలం తన ముగ్గురాడపిల్లల కోసం భరించింది. కానీ ఆ పిల్లలు పెద్ద వారై పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలతో సహా వచ్చి ఆమె మీద ఆధారపడితే..అల్లుళ్ళని ఏమైనా అంటే కూతుళ్ళు అన్యాయమైపోతారనే భయంతో..పిల్లల మీద మమకారం చంపుకోలేక..డెబ్భై ఐదేళ్ళ ఈ వయసులో కూడా తన సంపాదనతో వారందరినీ పోషిస్తోంది. తను కన్నకూతుళ్ళు, వాళ్ళు కన్న పిల్లలు..తననెంత ఈసడించుకున్నా..ఆమెకి వాళ్ళపై ప్రేమే కాని కోపం ఎన్నడూ రాలేదు. ఆ అమ్మకి విశ్రాంతి ఎన్నడో..?
అన్నపూర్ణ..రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్..
తన తరవాత ఐదుగురు తమ్ముళ్ళున్నారు కాబట్టి పై చదువులు చదివించలేనని తండ్రి చెప్తే ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి పదహారేళ్ళ వయసులోనే ఉద్యోగంలో చేరి తండ్రి కి ఆసరాగా నిలబడింది. తల్లిలా తమ్ముళ్ళని పెంచింది, చదివించింది. కుటుంబాన్ని నడపడానికి తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చింది..పెళ్ళైన రెండున్నరేళ్ళకే భర్త చనిపోతే..ఇద్దరు పసికందులతో ఒంటరిగా బ్రతుకు ప్రయాణం సాగించింది..ఊళ్లు తిరిగే ఉద్యోగంతో (ఎగ్జిక్యు టివ్ జాబ్) పిల్లల చదువులు సరిగ్గా సాగవని..వాళ్ళని హైదరాబాద్ లో నే వుంచి తను వారానికి పదిహేను రోజులకి వచ్చి వెళ్తూ..వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చింది..తండ్రి లేని పిల్లలని పల్లెత్తు మాట అనకుండా పువ్వుల్లో పెట్టి పెంచుకుంది..చక్కటి విద్య బుద్దులు చెప్పించింది..వాళ్ళ తో బాటూ తనూ చదువుకుని డిగ్రీ తెచ్చుకుంది. డిపార్ట్ మెంట్ లో సిన్సియర్, అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రిటైర్ అయ్యి...ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకి దూరంగా ఉంటూ పంచడానికి అవకాశం లేకపోయిన మమకారాన్ని ఇప్పుడు పంచుతూ అమ్మ...ప్రేమకి మారు పేరని చెప్పకనే చెప్తోంది.
అనసూయ(లేట్).. యు.డీ.సి. ఏ.పీ. స్టేట్ టెక్నికల్ బోర్డ్..
కోటి ఆశలతో పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన అమ్మాయి..భర్త మానసిక రోగి అని ఆ ఉద్రేకాన్ని తగ్గించడానికి సెడెటివ్స్ వాడుతున్నారని తెలిసి షాక్ అయింది. తప్పని సరై పరిస్థితులతో రాజీ పడింది. పిల్లలు పెద్దవాళ్ళు ఐతే తన కష్టాలన్నీ తీరిపోతాయనుకుంది. వాళ్ళకే కష్టమూ తెలీకుండా పెంచింది. కోరిన చదువు చెప్పించింది. ఉద్యోగ రీత్యా కొడుకు అమెరికా వెళ్తే..కూతురు చదువుని అటకెక్కించి ప్రేమ ప్రేమ అంటూ తనకు రెట్టింపు వయసు, పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి వ్యామోహంలో పడితే..అతి కష్టం మీద ఆ వ్యామోహం నించి బైటికి లాగి మళ్ళీ కాలేజి లో చేర్చింది. హమ్మయ్య కూతురింక మారిపోయింది.. చక్కగా చదువుకుంటోంది..అనుకుంటూ వుండగా ఆ అమ్మాయి మళ్ళీ ప్రేమలో పడింది. ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఈ క్రమం లో మానసిక వొత్తిడి లో తన అనారోగ్యం సంగతే గుర్తించలేకపోయింది. హఠాత్తుగా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే "బ్రెయిన్ ట్యూమర్..అడ్వాన్స్డ్ స్టేజి..ఆపరేషన్ చేసినా మూడేళ్ళ కంటే బ్రతకడం కష్టం" అని చెప్పారు ఎమర్జెన్సి ఆపరేషన్ చేసిన డాక్టర్స్. కూతురికి ఇవేమీ పట్టలేదు..తను ప్రేమించిన వ్యక్తితో(సకల అవలక్షణాభిరాముడు) తను కోరుకున్న జీవితం వైపు సాగిపోయింది. పిల్లలే తన జీవితం అనుకుని బ్రతికిన ఆమె కూతురు చేసిన పనికి తట్టుకోలేకపోయింది. కూతురి భవిష్యత్తు మీద బెంగతో జీవితం నించి సెలవు తీసుకుంది. తిరిగి రాలేని లోకాలకి వెళ్ళిపోయింది.
****
భగవంతుడు తను ప్రతీ చోట ఉండలేక అమ్మని సృష్టించాడట. అమ్మ ప్రేమకి ప్రతి రూపం ..అమ్మ మనసు నవనీతం..మాతృ ప్రేమకి వర్ణ వర్గ భేదాలు, ప్రాంతీయ, దేశ, విదేశ భేదాలు లేవు. అమ్మా...మమ్మీ...అమ్మీ...మామ్...పదమేదైనా... కటిక పేదవాడికైనా, కోట్లకి పడగలేత్తినా అమ్మ ప్రేమ సమానమే. మన సంతోషమే అమ్మ సంతోషం, మన దుఖమే అమ్మ దుఖం. పసితనాన తప్పటడుగు వేసే క్షణం నించి మన ప్రతి అడుగు వెనక అమ్మ..తప్పటడుగు తప్పుటడుగు కాకుండా నిరంతరం వెన్నంటి దారి చూపే అమ్మ.
"వాస్తవం" లో చెప్పిన ముగ్గురమ్మలూ...ఎందరో(కాదు కాదు అందరు) అమ్మలకి, వారి ప్రేమలకి, త్యాగాలకి ప్రతి రూపాలు. అందుకే మాతృమూర్తులందరికీ పాదాభివందనం. మీ ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష.
బ్లాగ్ మిత్రులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
శీర్షిక :
వాస్తవం
23, మార్చి 2010, మంగళవారం
విమానాల్రావు అంకుల్
నా చిన్నప్పుడు అంటే నాకో పదీ-పదకొండేళ్ళప్పుడు...మా ఎదురింట్లో ఆంజనేయ స్వామి అని ఒక యాభై-యాభై ఐదేళ్ళ ఆయన వుండే వారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పని చేసేవారు. డైవోర్సీ. ఆయనకి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి అప్పటికే దూరదర్శన్ లో వీణ గ్రేడ్ 1 ఆర్టిస్ట్, పెళ్లి కూడా ఐపోయింది. అబ్బాయేమో ఇంటర్ చదువుతున్నాడు.
ఆయన్ని నేను విమానాల్రావు అంకుల్ అనీ, ఆయనేమో నన్ను "డార్లింగ్" అని "స్వీటీ" అని "అమ్మడూ" అని పిలిచేవారు. నేనంటే బాగా ఇష్టపడే వారు. అయన పిల్లల కంటే ఎక్కువ పెత్తనం చేసేదాన్ని ఆయన మీద నేను. ఎప్పుడు యే వూరికి టూర్ వెళ్ళినా సరే..నా కోసం ఏదో ఒక బహుమతి తెచ్చేవారు. ఇంటి దగ్గరే వుంటే... అమ్మడూ కాస్త ఈ ముసలాడికి కూడా కబుర్లు చెప్పమ్మా అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని తనే చెప్పేవారెన్నో కబుర్లు. వాళ్ళ అమ్మాయి నైనా అంత ప్రేమ గా చూసుకున్నారో లేదో అనుకునే వాళ్ళు అమ్మా, బామ్మా ఎప్పుడూ.
భార్య లేకపోవడంతో ఇంటిపని, వంట పనీ అంతా అంకులే చేసేవారు. సరిగ్గా ఆయన వంటంతా పూర్తి చేసే సమయానికి నేను తయారయ్యేదాన్ని. అన్నీ పదార్ధాలు నేను ముందు రుచి చూశాకే వాళ్ళు తినేవాళ్ళు. అంత డిమాండ్ వుండేదన్నమాట నాకు వాళ్ళింట్లో. ఎంతగా వూళ్ళన్నీ తిరిగినా, ఎన్ని పెత్తనాలు చేసినా నిద్రకి మాత్రం బామ్మ కావాల్సిందే నాకు.
ఇలా మనం యువరాణీ వారిలాగా ఒక వెలుగు వెలిగి పోతూ వుండగా..ఒకసారి విమానాల్రావు అంకుల్ ఏదో వూరెళ్ళినప్పుడు ఒక పేద కుటుంబం లో వితంతువుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు. నా చేతే వాళ్ళిద్దరికీ హారితి ఇప్పించి ఇంట్లోకి తీసుకెళ్ళారు అమ్మా వాళ్ళు. అంకుల్ ఆవిడని ఎందుకు తీసుకొచ్చారు..? అని నాకు సందేహం. పైగా నన్ను తీసుకెళ్ళకుండా పెళ్లి చేసుకొచ్చారని కోపం కూడా వచ్చింది. అందుకని రెండు రోజులు వాళ్ళింటికి వెళ్ళలేదు.
రెండు రోజులు బిగదీసుకుని కూర్చున్నా, కానీ ఆవిడ అదే "అంకుల్ పెళ్ళాం ఆంటీ" ని సరిగ్గా చూడలేదుగా.. అందుకని మూడో రోజు పరిగెత్తుకెళ్ళా వాళ్ళింటికి ఆంటీ ని చూడడానికి. ఆవిడ పాపం బాగానే మాట్లాడింది. కానీ నాకే ఆవిడ నచ్చలేదు. ఆవిడ మా అమ్మ లాగా చీర కట్టుకోలేదనీ, సాఫ్ట్ గా మాట్లాడలేదనీ, ఓల్డ్ ఫాషన్ గా ఉందనీ, ఆంటీ నాకు నచ్చలేదనీ ఆమెని వాళ్ళమ్మా నాన్నల దగ్గరికి పంపెయ్యమనీ అంకుల్ తో చెప్పాను. అప్పుడు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని, ఆవిడ ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎందుకు వెనక్కి పంపకూడదో అంతా వివరంగా నాకర్ధమయ్యే విధంగా చెప్పి నన్ను కన్విన్స్ చేశారు(నిజానికి నన్ను కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేకపోయినా). నా ప్రవర్తన వల్ల ఆంటీ కి కూడా నేనంటే అంతగా పడేది కాదు. కానీ పాపం ఏనాడూ బయట పడేది కాదు.
ఒకసారి ఆవిడ వింటూ వుండగా అంకుల్ నన్ను "డార్లింగ్" అని పిలిచారు. ఆవిడ నేరుగా నా దగ్గరికి వచ్చి ఏమే "డార్లింగ్" అంటే ఏవిటి అనడిగింది(ఆవిడకి పాపం చదువు రాదు). నేను పెద్ద ఆరిందాలాగా "డార్లింగ్ అంటే ప్రియురాలు" ఆంటీ అన్నా. నాకేం తెలుసు అలా అనకూడదనీ.. పాపం ఆవిడ బాగా ఏడ్చింది. వెంటనే వెళ్లి అంకుల్ తో చెప్పా..ఆయన నా ఎదురుగానే ఆవిడ ని చడా మడా తిట్టారు. పసిపిల్ల దాని మీద నీకు అనుమానమా? అంటూ ఇంట్లోంచి ఆవిడని గెంటినంత పని చేశారు. నా వల్ల వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు అని అర్ధమై ఇంటికొచ్చి బామ్మకి చెప్పా. బామ్మ వెళ్లి సర్దుబాటు చేసింది.
చిత్రంగా ఆ తరువాత ఆంటీ కూడా నాకు బాగా దగ్గరైంది. అలా ఆ కధ సుఖాంతం అయిన తరువాత చాలా రోజులకి మల్లీశ్వరి సినిమా టీవీ లో వచ్చింది. అప్పట్లో మాకు టీవీ లేదు. అందుకని సినిమా చూడాలంటే అంకుల్ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. అందరూ కింద కూర్చుని చూస్తే నేను మాత్రం దర్జాగా అంకుల్ పక్కనే రాణీ లాగా కూర్చుని చూశాను సినిమా. దాంతో ఆంటీకి బాగా కోపం వచ్చింది. కట్టుకున్న పెళ్ళాన్ని కింద కూర్చోపెట్టి ప్రియురాలిని పక్కన కూర్చోపెట్టుకుంటారా అంటూ బాగా గొడవ చేసింది. ఆవిడ బాధల్లా అంకుల్ నన్ను "డార్లింగ్" అని పిలవకూడదని. ఆవిడ ఎంత రెచ్చిపోతోందో ఆయన అంత తాపీగా "నువ్వేం చేసినా నేను దాన్ని డార్లింగ్ అనే పిలుస్తానని" ఖచ్చితంగా చెప్పెసరికీ..పాపం ఆంటీ..మౌనంగా ఉండిపోయింది.
ఆ తరువాత అంకుల్ ఎప్పుడూ నన్ను అలాగే పిలిచేవారూ.. ఆవిడ కూడా నెమ్మదిగా అలవాటు పడిపోయింది, నాతో ఇంటిమసి పెంచుకుంది. నేను వాళ్ళింటికి వస్తూండగా చూస్తే "ఏవండీ మీ ప్రియురాలోస్తోంది" అంటూ కేకేసేది అంకుల్ ని. ఆంటీ నాకు రకరకాల పిండి వంటలు చేసిపెడితే, నేను ఆంటీ కి చదవడం, రాయడం, అమ్మలాగా చీర కట్టుకోవడం (నిజంగానే నేర్పానండోయ్ అమ్మ దగ్గర నేర్చుకుని), చక్కగా జడ వేసుకోవడం, లాంటివన్నీ నేర్పానన్నమాట.
ఇలా వుండగా..హఠాత్తుగా ఒక రోజు అంకుల్ కి "సెరిబ్రల్ హేమోరేజ్" వచ్చింది. ఒక నెల రోజులు హాస్పిటల్ లో వున్నారు. తరవాత ఇంటికి వచ్చాక చాలా నెలలు పట్టింది కోలుకోడానికి. ఈ మధ్యలో అంకుల్ పిల్లలు ఆయన రెండో పెళ్లి చేసుకున్నందుకు పెద్ద రాద్ధాంతం చేసి ఆయన్నినానా మాటలన్నారు. మళ్ళీ రెండో సారి "సెరిబ్రల్ హేమోరేజ్" వచ్చింది. ఈ సారి కంప్లీట్ గా పారలైజ్ అయిపోయారు "నా ప్రియ నేస్తం".
తరవాత కొన్నాళ్ళకి ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు. అంకుల్ వాళ్ళు అలా వెళ్ళిపోవడం నాకు చాలా పెద్ద షాక్. నేను తేరుకోడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు బహుశా ఆయన జీవించి ఉంటారని అనుకోను. కానీ..ఇప్పటికీ విమానం శబ్దం విన్నా, రసగుల్లా తిన్నా(కోల్ కతా వెళ్ళిన ప్రతీ సారి రసగుల్లా నాకోసం తెచ్చేవారు), మల్లేశ్వరి సినిమా చూసినా, పాటలూ విన్నా, ఎవరు నన్ను అమ్మడు అని పిలిచినా "నా ప్రియ నేస్తం". విమానాల్రావు అంకులే మనసులో మెదులుతారు.
మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.
శీర్షిక :
వాస్తవం
21, మార్చి 2010, ఆదివారం
కలల అలలపై...
పాటలీ పుత్రాన్ని పాలించే చంద్రసేన మహారాజుకి ఇద్దరు భార్యలు. చిన్న రాణి రూపవతికి ముగ్గురు సంతానం. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన మహారాజుని పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో చిన్నరాణి తమ్ముడు వక్రకేతు ఉచ్చులు పన్నుతూ మేనల్లుళ్ళని చవటలుగా తయారు చేశాడు. పట్టపురాణి గుణవతి సంతానం కోసం తపిస్తూ ఆ జగదంబని ప్రార్ధిస్తూ వుండేది. ఆమె పూజలకి సంతసించిన పార్వతి గుణవతిని కరుణించమని పరమేశ్వరునికి విన్నవించగా ఆ భక్తవ శంకరుడు భిక్షుక వేషంలో గుణవతి ఎదుట సాక్షాత్కరించి ఒక దివ్య ఫలం ప్రసాదించి అంతర్దానమవుతాడు. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదిస్తుంది. ఇది విన్న చంద్రసేన మహారాజు చాల సంతోషించి పట్టపురాణిని అభినందించాడు. కానీ ఈ వార్త విన్న చిన్న రాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంత దాకా వస్తే నేనున్నానుగా అక్క...అంటూ రూపవతిని సమాధాన పరిచాడు వక్రకేతు.
పైన టైటిల్ ఏంటీ...ఈ కధేంటి...బొత్తిగా పొంతన లేని ఈ రాతలేంటీ..అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నానండీ..
"కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...
జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు
తడిసి తడియని కొంగున...ఒడలు దాచుకున్నందుకు..
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము...మరులు గొలుపు తున్నందుకు..
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికానిని... జంట గూడి రమ్మన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము...బిగి కౌగిట కలదన్నది..
కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...కలల అలల పై..".
శీర్షిక :
మధుర గీతం
15, మార్చి 2010, సోమవారం
1, ఫిబ్రవరి 2010, సోమవారం
ఎవ్వరో పాడారు భూపాల రాగం
"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై...." ప్రభాతవేళ...పక్షుల కిలకిల రావాలతో ప్రకృతికి మేలుకొలుపు పాడుతున్న వేళ... ఈ భూపాల రాగం వింటూంటే అమృత ధారలలో తడుస్తున్న అనుభూతి. సాయం సంధ్య వేళ పశుపక్షాదులు తమ తమ నెలవులు చేరే వేళ విన్నా అదే అనుభూతి..అమృత ధారల్లో తడుస్తున్నట్టు. ఆ గొప్పదనం పాటలోని మాటలదా..? రాగానిదా..? పాడిన గాత్రానిదా..? అని అనుకుంటే, ఆ అతిరధులు ముగ్గురూ కలిసి సంగీత సాగరాన్ని మధించి వెలికి తీసిన ఆణిముత్యానిది.
కోకిలమ్మ వినికిడి శక్తి లేని అమ్మాయి, ఒక అనాధ. ఐదారు వాటాలు(కాపురాలు) వున్న ఒక ఇంట్లో ఒక మూల చిన్న గది (వసారా) లో ఆమె నివాసం. ఆ ఇంట్లో ఉంటున్న వారు చెప్పిన పని చేసి వారిచ్చిన డబ్బుతో జీవిత సాగిస్తూ వుంటుంది. రాజు ఒక డిగ్రీ చదువుకున్న నిరుద్యోగి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్క ఒక బండి మీద సంచార లాండ్రీ దుకాణం నడుపుతూంటాడు. కోకిలమ్మ ఉంటున్న ఇంటి పరిసరాల్లోనే అతని దుకాణం వుండడం చేత ఇద్దరికీ పరిచయం జరగడం, అది ప్రేమగా మొగ్గ తొడగడం తొందరగానే జరిగిపోతుంది.
అప్పుడప్పుడు కూనిరాగాలు తీసే రాజుకి సంగీతం పట్ల ఆసక్తిని గమనించి, తను ఉంటున్న ఇంట్లోనే పైన పోర్షన్ లో ఉంటున్న రేడియో స్టేషన్ లో పనిచేసే అయన (పేరు గుర్తులేదు) దగ్గర సంగీతం నేర్చుకునే ఏర్పాటు చేస్తుంది. అతని చేత లాండ్రీ పని మాన్పించి, అతని పోషణ భారం తాను చూస్తుంది. అతని శ్రద్ధ, సాధన, ఆమె శ్రమ ఫలించి అతను సంగీతంలో నిష్ణాతుడవుతాడు.
ప్రతీ రోజూ గుడిలో పాడే అతని గాత్రానికి ముగ్దురాలైన స్వప్న అనే అమ్మాయి తన అన్నగారితో చెప్పి అతనికి వేదిక మీద పాడే అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశం ఒక గాయకుడిగా అతనికి మంచి పేరు తెస్తుంది, .అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఆ తరువాత సంగీత సాగరంలో అతని ప్రయాణం ఎలా సాగింది? మనసిచ్చి, అతని జీవితాన్ని తీర్చి దిద్దిన కోకిలమ్మ ఏమైంది? అనేది ఈ కోకిలమ్మ సినిమా లో కధాంశం. రాజు గాయకుడిగా మొదటి సారి వేదిక మీద పాడిన పాటే ఈ "ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై.."
బాల చందర్ గారు తీసిన ఈ సినిమాకి...ఆచార్య ఆత్రేయ గారు పాటలు రాయగా, ఏం.ఎస్.విశ్వనాథన్ గారు స్వరపరచి, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారూ, పీ. సుశీల గారూ పాడిన ఈ సినిమాలోని నాలుగు పాటలూ ఆణిముత్యాలే. అందులో నాకు నచ్చిన ఈ పాటలో రెండు చరణాల్లోనూ... మొదటి వాక్యం మినహాయించి మిగతా చరణమంతా పాటలా కాక మాటల్లో చెప్పడం ఈ పాట ప్రత్యేకత.
నాకెంతో నచ్చిన ఈ పాట మీ అందరితో పంచుకోవాలనిపించి నే చేసిన చిన్ని ప్రయత్నమిది. నా ఈ ప్రయత్నం లో పొరపాట్లు, తప్పులు ఏవైనా దొర్లితే మన్నించమని ప్రార్ధన. కింద ఇచ్చిన లింకు లో ఈ పాట వినవచ్చు.
"ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..
కనుగొంటినీ ఆ దేవినీ...అబినందనం..అబినందనం..అభినందనం.
వాణియై నాకు బాణీయై ఏ దయ నా హృది మీటెనో..
ఆ మూర్తికీ స్త్రీ మూర్తికీ అభినందనం..అభినందనం..అభినందనం.
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై..సప్త స్వరాల హరివిల్లునైతీ...
"ఆ కాంతికి నా రాగమాలిక నర్పిస్తున్నా...మీ అందరి కరతాళ హారతులర్దిస్తున్నా..
నేడే అర్చన సమయం...నా నవ జీవన ఉదయం...
యెదలో మమతా గీతం...గుడిలో ఘంటానాదం...
ఇది నా తోలి నై..వేద్యం..." !!ఎవ్వరో!!
వసంత కాల కోకిలమ్మా..జన్మాంతరాల ఋణమా..నీ ఋణమేరీతి చెల్లింతునమ్మా..
"నా జీవితమే ఇక నీకు పదపీఠం...నీ దీవెనలే నాకు మహా ప్రసాదం..
నేడే నా స్వర యజ్ఞం...నేడే ఆ శుభ లగ్నం...
తోలి నే చేసిన భాగ్యం...మదిలో మెదిలే రాగం...
ఇక నా బ్రతుకే...ధన్యం...!!ఎవ్వరో!! "
http://www.youtube.com/user/chanaktheright
శీర్షిక :
మధుర గీతం
26, జనవరి 2010, మంగళవారం
నెమలి కన్ను- అము
బ్లాగ్ మిత్రులందరికీ హలో, హాయ్, నమస్తే!
దాదాపు ఐదు నెలల విరామం తరవాత మళ్ళీ మీ ముందు కొస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ముందుగా మిత్రులందరికీ క్షమార్పణలు...అలాగే ధన్యవాదాలు.
ఎందుకనంటే..
మీరందరూ ఎన్నిసార్లు అడిగినా ఇదిగో వచ్చేస్తున్నా... అదిగో వచ్చేస్తున్నా... అంటూ ఐదు నెలలు కాలం గడిపినందుకు క్షమార్పణలు. నా మీద అభిమానంతో నా ఈ ఆలస్యాన్ని ఎంతో ఓర్పుగా భరించినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఈ ఆలస్యం ఎందుకు జరిగినట్టు? అని అనిపించింది కదండీ.. మరేం లేదండీ ..చిన్న ఆక్సిడెంటూ..ఒక ఐదు నెలలు కంప్లీట్ బెడ్ రెస్టూ...అదన్నమాటండీ విషయం.
టైటిల్ ఏదో పెట్టి ఏదో రాస్తోందేంటి అనుకుంటున్నారా..? వస్తున్నానండీ అక్కడికే వస్తున్నా..!
రెస్ట్ లో వున్నా..అప్పుడప్పుడు బ్లాగులు చదువుతూ వుండేదాన్ని. సుమారుగా రెండు నెలల క్రితం నవంబర్ లో అనుకుంటాను..ఒకరోజు "నెమలి కన్ను" లో "అము"(నాయికలు-కజు) చదివానండి. ఎప్పటి లాగానే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది.
అసలే తిరుమల లో "దర్శనం క్యూ" అంత పెద్దగా వున్న నా పుస్తకాల లిస్టు కి ఈ పుస్తకం కూడా చేరి ఇంకాస్త పెద్దదైంది లిస్టు. ఏం చెయ్యాలీ..మనం కదల్లేం, మరొకర్ని అడగలేం..కిం కర్తవ్యమ్..? అని ఆలోచించగా..చించగా...చించగా... అదేదో అడ్వర్టైజ్మెంట్ లో లాగా చటుక్కున నా బుర్రలో లైట్ వెలిగింది. వెంటనే నేను మా ప్రీతీ (మా అన్నయ్య భార్య) కలిసి ఛలో "రెడిఫ్ షాపింగ్" అంటూ ఆన్ లైన్ షాపింగ్ చేసేసి ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేశాం.
ఎదురు చూడగా చూడగా నా సహనానికి పరీక్ష పెట్టి (మనకది చాలా తక్కువ లేండి) కరెక్ట్ గా నెల రోజులకి వచ్చింది కోరియర్ లో పుస్తకం . ఏదో ఒక నిధి దొరికినంత సంబరపడిపోయి..నేను అప్పటికే చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి "అము" చదవడం మొదలెట్టేద్దాం అనుకుంటూండగా...మీరాల్రేడీ ఒక పుస్తకం చదువుతున్నారు కదా..ఇది నేను చదివి మీకిస్తానంటూ పట్టుకెళ్ళిపోయింది మా ప్రీతీ. మళ్ళీ సస్పెన్సే. సరే ఏం చేస్తాంలెమ్మని నాకు నేనే సర్ది చెప్పుకున్నా.
ఓ వారం పోయాక ఒక రోజు రాత్రి ఎప్పటిలాగా నేను మంచానికి అతుక్కుపోయి ఏదో పుస్తకం చదువుకుంటున్నా..హఠాత్తుగా ముక్కెగపీలుస్తూ మా ప్రీతీ నా గదిలోకి వచ్చింది. కళ్ళు ఎర్రగా వాచిపోయి మనిషి బాగా ఎడ్చినట్టుగా వుంది. ఏమైందా..ఎవరైనా ఏమైనా అన్నారా? లేక మా అన్నయ్య కేమైనా ఇబ్బంది అయిందా(తను ఆర్మీ లో మేజర్, ఇప్పుడు వైష్ణో దేవి నించి 8 కిమీ రియాసి లో పని చేస్తున్నాడు), అనుకుని కంగారు పడ్డాను.
ఏమైందని నేను ప్రశ్నించే లోపే తనే...ముక్కెగపీలుస్తూ ఈ బుక్ చాలా బాగుంది..చాలా టచ్చీగా వుంది..నేను బాగా ఎమోషనల్ ఐపోయాను, బాగా ఏడ్చాను అని చెప్పింది. మీరూ తప్పకుండా చదవండీ అని చెప్పి పుస్తకం నా చేతికిచ్చి వెళ్ళిపోయింది. నాకు నవ్వొచ్చింది. అంత కష్టపడి కొనుక్కున్నది చదవడానికేగా..కానీ అందుక్కాదు నాకు నవ్వొచ్చింది.. ఒక పుస్తకం చదివి అంతలా ఏడవాలా సిల్లీ కాకపొతే అని.
తరవాత చాలా రోజులు నాకు ఆ పుస్తకం చదవడానికి వీలవ్వలేదు. కదలలేని స్థితిలో ఏవిటంత రాచకార్యాలూ..? అనుకుంటున్నారా..అబ్బే రాచకార్యాలేమి లేవండీ..కాకపోతే ఇంకేవో పుస్తకాలు చదువుతూండడం మూలాన ఇది చదవడం కుదరలేదంతే. మొన్న వారం క్రితం పుస్తకాల దొంతర తిరగేస్తోంటే ఇది కనిపించింది. చాలా మామూలుగా మొదలు పెట్టి పుస్తకం పూర్తీ అయ్యేదాకా మరి లేవకుండా, వదలకుండా చదివాను. మా ప్రీతిలాగా ఏడవలేదు, కానీ బాగా నచ్చింది పుస్తకం.
అంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసి వెంటనే కొనిపించి, చదివించిన (కొద్దిగా ఆలస్యంగానైనా సరే) నెమలి కన్ను మురళీ గారికి ఇలా నా టపా ముఖంగా ధన్యవాదాలు చెప్పాలనిపించి ఈ టపా రాశానండీ. ఇంతకీ ధన్యవాదాలు చెప్పలేదు కదా అంటారా..ఇదిగో ఇప్పుడే చెప్తానండీ..
మురళీ గారూ...మీకు చాలా చాలా చాలా చాలా చాలా థాంక్సండీ..ఇంత మంచి పుస్తకం కొనిపించి, చదివించినందుకు.
శీర్షిక :
పుస్తకం
22, జనవరి 2010, శుక్రవారం
రధ సప్తమి
సప్త సప్త మహా సప్త
సప్త ద్వీపా వసుంధర
సప్తార్క పర్ణమాదాయ
సప్తమి రధ సప్తమి !!
బ్లాగ్ మిత్రులందరికీ "రధ సప్తమి" శుభాకాంక్షలు.
శీర్షిక :
శుభాకాంక్షలు
1, జనవరి 2010, శుక్రవారం
గ్రీటింగ్స్
బ్లాగ్ మిత్రులందరికీ...
WISH YOU
ALL
A
HAPPY
PROSPEROUS
AND
PEACE FUL
NEW YEAR
శీర్షిక :
శుభాకాంక్షలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)