కేవలం..బేలా అన్న ఆ ఒక్క మాట కోసం ఈ పాటని కొన్ని వేల సార్లుగా వింటూనే వున్నాను..అంటే నమ్ముతారా..? అతిశయోక్తిలా అనిపిస్తోంది కదూ..కానీ అక్షరాలా నిజం.
చాలా కాలం క్రితం టీవీ లో ఒక లైవ్ షో లో ఈ పాట విన్నాను(చూశాను). ఆ తరువాత కనిపించిన ప్రతీ చిన్న, పెద్ద మ్యూజిక్ స్టోర్ లు వెతికాను పిచ్చిగా...చివరికి సంగీత్ సాగర్ లో "గోల్డెన్ హిట్స్ అఫ్ ఘంటసాల" లో పట్టుకున్నాను. అప్పటినించీ మనసారా..తనివి తీరా విన్నాను..వింటూనే వున్నాను..ఆనందిస్తూనే వున్నాను.
మా ఫ్రెండ్ వాళ్ళ అక్క భర్త సి.హెచ్.సురేష్ అని బ్యాంకు ఉద్యోగి..ఘంటసాల గారి పాటలు, మాధవపెద్దిగారి పాటలు (అందుకే ఈయన మాధవ పెద్ది గారి కుటుంబానికి చాలా సన్నిహితుడయ్యాట్ట) టీవీ లలో, స్టేజి షో లలో పాడుతూ వుంటారు.. మొన్నామధ్య కాస్త తీరికగా కనిపిస్తే అడిగి పాడించుకున్నాను ఈ పాట. అద్భుతంగా పాడారు. నాకీ పాట ఎందుకిష్టమో చెప్తే విని ఆశ్చర్య పోయారు అలా కూడా ఉంటారా (వింటారా) అంటూ..
సుతి మెత్తగా..మృదు మధురంగా సాగే ఈ పాట..శ్రీ తిరుపతమ్మ కధ సినిమాలోనిది. సి. నారాయణరెడ్డి గారు రాసి శంకర్ , పామర్తి గార్లు సంగీతాన్ని అందించగా..మనకోసమే గంధర్వ లోకం నించి వచ్చి తన గళం తో పాటల పూలు పూయించి తిరిగి అదే లోకానికి వెళ్ళిపోయిన ఘంటసాల గారు పాడగా విరిసిన పువ్విది.
పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా..!!పూవై!!
చల్లని గాలులు సందడి చేసే..
తోలి తోలి వలపులు తొందర చేసే..
జలతారంచుల మేలిముసుగులో
తలను వాల్తువేలా..బేలా..!!పూవై!!
మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఆ..ఆ..ఆ..
తెలిసెనులే నీ తలపులేమిటో...
తొలగిపోదువేలా...బేలా !!పూవై!!
తీయని వలపుల పాయసమాని..
మాయని మమతల ఊయలలూగి..
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా!!పూవై!!