21, మార్చి 2010, ఆదివారం

కలల అలలపై...



పాటలీ పుత్రాన్ని పాలించే చంద్రసేన మహారాజుకి ఇద్దరు భార్యలు. చిన్న రాణి రూపవతికి ముగ్గురు సంతానం. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన మహారాజుని పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో చిన్నరాణి తమ్ముడు వక్రకేతు ఉచ్చులు పన్నుతూ మేనల్లుళ్ళని చవటలుగా తయారు చేశాడు.  పట్టపురాణి గుణవతి సంతానం కోసం తపిస్తూ ఆ జగదంబని ప్రార్ధిస్తూ వుండేది. ఆమె పూజలకి సంతసించిన పార్వతి గుణవతిని  కరుణించమని పరమేశ్వరునికి  విన్నవించగా ఆ భక్తవ శంకరుడు భిక్షుక వేషంలో గుణవతి ఎదుట సాక్షాత్కరించి ఒక దివ్య ఫలం ప్రసాదించి అంతర్దానమవుతాడు. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదిస్తుంది. ఇది విన్న చంద్రసేన మహారాజు చాల సంతోషించి పట్టపురాణిని అభినందించాడు. కానీ ఈ వార్త విన్న చిన్న రాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంత దాకా వస్తే నేనున్నానుగా అక్క...అంటూ రూపవతిని సమాధాన పరిచాడు వక్రకేతు.  


త్వరలోనే పట్టపురాణి గుణవతి సులక్షణుడైన కుమారుణ్ణి కన్నది. భావి మహారాజు జన్మించాడని అందరూ మిక్కిలి సంతోషించారు. వక్రకేతు ఆస్థాన సిద్ధాంతులని సొమ్ముతో ప్రలోభ పెట్టి "పుట్టిన బిడ్డ సకల సద్గుణ సంపన్నుడే కాని..పుత్ర వీక్షణమైన మరుక్షణం తండ్రికి నేత్ర నష్టం" అని చెప్పిస్తాడు. సిద్ధాంతుల మాటలతో వ్యాకుల పడుతున్న మహారాజుని "బిడ్డని కేవలం అడవి లో వదిలి రావడమే కానీ చంపడం లేదుగా" అని తన వాక్చాతుర్యంతో అనునయించి,  ఒప్పించి... బిడ్డని చంపెయ్యమని చాటుగా భటులకి చెప్తాడు. అడవిలోకి తీసుకెళ్ళి ఆ బిడ్డని భటులు చంపబోగా పరమేశ్వరుడు భిక్షుకుని రూపంలో వచ్చి రక్షిస్తాడు. అదే దారిన వెళ్తున్న ఒక గొర్రెలకాపరి పిల్లవానిని చూసి ముచ్చట పడి ఇంటికి తీసుకెళ్ళి తానే పెంచుకుంటాడు సంతానం లేని ఆ గొర్రెలకాపరి. 


మహారాజుని పక్కకి తప్పించి అధికారం చేజిక్కించుకునే అవకాశం కోసం వక్రకేతు ఎదురు చూస్తుండగా..సంవత్సరాలు గడిచిపోతాయి. రాకుమారులు పెద్దవారవుతారు.  వేట కని చెప్పి మహారాజుని అడవికి తీసుకు వెళ్ళిన వక్రకేతు సమయం చూసి సేనాపతి దుష్టబుద్దితో కలిసి కుట్ర పన్ని మహారాజుకి విషం కలిపిన పానీయం ఇచ్చి తాగిస్తాడు. మర్నాడు వేటకు బయలుదేరి వెళ్ళిన మహారాజు ఒక లేడిని చంపబోగా గొర్రెల కాపరి పెంచుకున్న రాకుమారుడు (విజయుడు) అడ్డు పడి ఆ లేడిని రక్షిస్తాడు. అతడి రూప విలాసాలు చూసి ఆశ్చర్యపోయిన మహారాజు తేరిపార చూసే లోపు విషప్రభావం వల్ల రాజు చూపు పోతుంది. అందరూ ఆ యువకుడే రాజుగారి చూపు పోవడానికి కారణం అని అనగా అతను ఆశ్చర్యపోతాడు. రాజుగారి చూపు పోవడానికి నేనెలా కారణం అనుకుని తన సందేహ నివృత్తి కోసం కోటలోకి ప్రవేశించి అంతఃపురం లోకి వెళ్తాడు. అక్కడ తన జన్మ రహస్యం తెలుసుకుంటాడు. మహారాజు గారి కళ్ళు తిరిగి రావాలంటే గులేబకావళీ పుష్పం తెచ్చి కళ్ళకు తాకిస్తే మళ్ళీ కళ్ళు వస్తాయని రాజ వైద్యులు చెప్పగా విని..తాను తేవడానికి బయలుదేరతాడు. గులేబకావళీ పుష్పం తేవడానికి వెళ్ళిన అతను మార్గ మధ్యంలో ఏమేమి ఇబ్బందులు పడ్డాడు..ఎలా ఆ పుష్పాన్ని సాధించాడు...?  అన్నది ఈ "గులేబకావళి కధ" మిగతా సినిమా.  


యన్.టే.రామారావు, జమున, నాగరత్నం, ముక్కామల, రాజనాల, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, హేమలత, మిక్కిలినేని..ఇలా తారాగణం అంతా అతిరధ మహారధులే. పాటలు రాసిన వారు సి.నా.రే అని అనుకున్నాను కానీ..అయన అన్నీ రాసినట్టు లేరు, మరి ఎవరు రాశారో తెలీదు. ఇకపోతే సంగీతం కూర్చినవారు జోసెఫ్-కృష్ణమూర్తి. అద్భుతంగా స్వరపరిచారు పాటలన్నీ.    


పైన  టైటిల్ ఏంటీ...ఈ కధేంటి...బొత్తిగా  పొంతన లేని ఈ రాతలేంటీ..అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నానండీ..

గులేబకావళి కధ సినిమాని..."నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని..కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ" అంటూ సి.నా.రే గారు రచించిన పాటని ఎవ్వరూ మర్చిపోరు. అంత గొప్ప పాట. రేడియో లో కానీ, టీవీ లో కానీ చాలా ఎక్కువగా వినే,  చూసే పాట, శ్రోతలందరూ ఎక్కువగా కోరుకున్న పాట.   అసలు ఈ సినిమాలో అన్నీ పాటలూ చాలా బాగుంటాయి. కానీ..."కలల అలలపై తేలెను..మనసు మల్లె పూవై.."ఈ పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.  గులేబకావళీ పుష్పం తేవడానికి యక్ష లోకం వెళ్ళిన విజయుడు (రాకుమారుడు) యక్ష రాజు కుమార్తె కలలో కనిపించి ఆమెతో కలిసి పాడిన పాట.  ఘంటసాలగారూ, జానకి గారు పాడిన పాట...నాకెంతో ప్రియమైన పాట మీతో పంచుకోవాలని నా ఆశ.  ఈ క్రింది లింకులో పాటని చూస్తూ వినచ్చు.



"కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...

జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు
తడిసి తడియని కొంగున...ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము...మరులు గొలుపు తున్నందుకు..

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికానిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము...బిగి కౌగిట కలదన్నది..

కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...కలల అలల పై..".




4 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

సినిమా మొత్తం చూపించేశారు కదా!! రామారావు-జమున చాలా బాగుంటారండీ.. నాకు 'నన్ను దోచుకుందువటే..' పాత కొంచం ఎక్కువ ఇష్టం..

ప్రణీత స్వాతి చెప్పారు...

'నన్ను దోచుకుందువటే..' నాకూ ఆ పాట చాలా ఇష్టమండీ. కాకపోతే "కలల అలల పై" పాట ఇంకా చాలా సాఫ్ట్ గా వుంటుంది గమనించారా..? పైగా ఈ పాట ఎవరూ పెద్దగా విన్నట్టు అనిపించదు. అందుకని పరిచయం చెయ్యాలనిపించింది.

కొత్త పాళీ చెప్పారు...

టపా అంతా ఎంత ఆసక్తిగా చదివానో! నాకు ఇలాంటి జానపద అద్భుత కథలంటే చాలా ఇష్టం మీరే సొంతంగా ఇటువంటి కథలు రాయగలరేమో చూడండి!

వాజసనేయ చెప్పారు...

naku nannudochukonduvate ante chala istam