కూనలమ్మ పదాలు..అలతి అలతి పదాలు..అద్భుతమైన అర్ధాలు..ఎన్నో జీవిత సత్యాలు..!!
ఆరుద్ర గారు రాసిన ఈ పుస్తకం నాకెంతో ఇష్టం. ఎప్పటిలాగానే అబిడ్స్ వెళ్ళినప్పుడు విశాలాంధ్రకి వెళ్లానొకరోజు. ఎదురుగా వున్న డిస్ ప్లే స్టాండు లో "కూనలమ్మ పదాలు" పుస్తకం కనిపించింది. నాకున్న అలవాటేంటంటే పుస్తకాలు కొనుక్కుని ఇంటికి వచ్చాక వాటన్నిటి మీదా నా సంతకం పెట్టి, పుస్తకం కొన్న తేదీ వేసిన తరవాతే పుస్తకం చదువుతాను (రెండు మూడు రోజులు ఆలస్యమైనా సరే సంతకం చెయ్యనిదే పుస్తకం చదవను).
అలాంటిది... అసలు "కూనలమ్మ పదాలు" లోపల కంటెంట్ ఏంటో చూద్దామని స్టాండు లోంచి తీసి పుస్తకం తెరిచిన దాన్ని అక్కడే, అలాగే నిలబడి మొత్తం పుస్తకం చదివేశాను. ఆ తరవాత ఇంకే పుస్తకం జోలికీ వెళ్ళలేదు. కూనలమ్మ పదాలు ఒక పాతిక కాపీలు కొనుక్కున్నాను(నాకు నచ్చిన పుస్తకం, నాకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వటం నాకో అలవాటు). ఎంతో ఇష్టంగా కూనలమ్మ పదాల్ని అందరికీ పంచిన నేను నా పుస్తకాన్ని ఉజ్జయినీ వెళ్ళినప్పుడు రైల్లో పోగొట్టుకున్నానండి.. ఆ తరవాత చాలా ప్రయత్నించాను, దొరకలేదు. మళ్ళీ మొన్న విశాలాంధ్ర కి వెళ్ళినప్పుడు అడిగితే మొదట లేవన్నాడు..అంతలోనే వెతికి మరీ తెచ్చిచ్చాడు "ఆఖరి కాపీ". నాకెంతో నచ్చిన ఆ పుస్తకం మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది. అందుకే నా ఈ చిన్ని ప్రయత్నం.
ముమ్మాటికీ...
"కూనలమ్మ పదాలు...వేనవేలు రకాలు...ఆరుద్రదే వ్రాలు...అంటారు శ్రీ శ్రీ..!!
కూనలమ్మ పదాలు...లోకానికి సవాలు...ఆరుద్ర చేవ్రాలు...అంటారు శ్రీ శ్రీ..!!
కూనలమ్మ పదాలు...కోరుకున్న వరాలు...ఆరుద్ర సరదాలు...అంటారు శ్రీ శ్రీ..!!"
ఇంత అందంగా శ్రీ శ్రీ గారితో ముందు మాట చెప్పించుకున్న ఈ కూనలమ్మ పదాలు...తన మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణకు పెళ్లి కానుకగా ఆరుద్ర రాసి ఇచ్చిన ఈ కూనలమ్మ పదాలు...అలతి అలతి పదాలు..అద్భుతమైన అర్ధాలు..ఎన్నో జీవిత సత్యాలు..!!
కూనలమ్మ పదాలు సుమారుగా నూటయాభై వరకు వున్నాయి. నాకెంతో నచ్చిన ఈ కూనలమ్మ పదాల్లోంచి కొన్ని మెచ్చు తునకలు..
"చిన్ని పాదములందు...చివరి ప్రాసల చిందు...చేయు వీనుల విందు...ఓ కూనలమ్మ..!!
కొంత మందిది నవత...కొంత మందిది యువత...కృష్ణ శాస్త్రిది కవిత...ఓ కూనలమ్మ..!!
కొంటె బొమ్మల బాపు...కొన్ని తరముల సేపు...గుండె వూయల నూపు...ఓ కూనలమ్మ..!!
హాస్యమందున అఋణ...అందె వేసిన కరుణ...బుడుగు వెంకటరమణ...ఓ కూనలమ్మ..!!
ఎంకి పాటల దారి...ఎడద గుర్రపు స్వారి...చేయులే నండూరి...ఓ కూనలమ్మ..!!
చివరి ప్రాసల నాభి...చిత్రమైన పఠాభి...కావ్య సుధల షరాభి...ఓ కూనలమ్మ..!! "
నండూరి వారి ఎంకి నిజంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించిందేమో అనిపించిందీ పద్యంలో. ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ బాపూగారి బొమ్మలు. ప్రతీ పద్యానికీ తగినట్టుగా అందంగా, కొంటెగా వేశారు బొమ్మలు.
"భాగవతమున భక్తీ...భారతములో యుక్తి...రామ కధయే రక్తి...ఓ కూనలమ్మ..!!
బహుదినమ్ములు వేచి...మంచి శకునము చూచి...బయళుదేరఘ హా--చ్చి... ఓ కూనలమ్మ..!!
గుండెలో శూలమ్ము...గొంతులో శల్యమ్ము...కూళతో స్నేహమ్ము...ఓ కూనలమ్మ..!!
నరుడు మదిలో దొంగ...నాల్క బూతుల బుంగ...కడుగ జాలదు గంగ...ఓ కూనలమ్మ..!!
ఆత్మవంచన వల్ల...ఆడు కల్లల వల్ల...అగును హృదయము డొల్ల...ఓ కూనలమ్మ..!!
మనసు తెలుపని భాష...మంచి పెంచని భాష...ఉత్త సంద్రపు ఘోష...ఓ కూనలమ్మ..!! "
ఆరుద్ర గారు సిని కవిగానే తెలుసు నాకు ఈ కూనలమ్మ పదాలు చదివే వరకూ ..కానీ ఆయన కవిత్వమే కాక కధలూ..నవలలూ..నాటకాలూ..పత్రికా వ్యాసాలూ..ఇలా ఎన్నెన్నో రచనలు చేశారట. అది తెలిశాక చాలా ప్రయత్నం చేశా..ఇంకేమైనా వారి రచనలు దొరుకుతాయేమోనని..కానీ దొరకలేదు.
"మరియొకరి చెడు తేది...మనకు నేడు ఉగాది...పంచాంగ మొక సోది...ఓ కూనలమ్మ..!!
గుడి గోడ నలరారు...పడతి దుస్తుల తీరు...ఫిల్ములో సెన్సారు...ఓ కూనలమ్మ..!!
ఆశ తీరని తృష్ణ...అఘము తేలని ప్రశ్న...ప్రతిభ అడవుల జ్యోత్స్న...ఓ కూనలమ్మ..!!
తమలపాకు నములు... దవడతో మాట్లాళు...తానె వచ్చును తమిళు...ఓ కూనలమ్మ..!!
అడ్డు తగిలిన కొలది...అమిత శక్తులు గలది...అబల అగునా వెలది...? ఓ కూనలమ్మ..!!
అతివ పురుషుని దీటు...అనుచు నభమున చాటు...ఆడ కాస్మోనాటు...ఓ కూనలమ్మ..!!
నరము లందున కొలిమి...నాగుపాముల చెలిమి...అల్పబుద్ధుల కలిమి...ఓ కూనలమ్మ..!!
పరుల ఇంటను పెరిగే...పరుల పడతుల మరిగే...పరతత్త్వమై సురిగే...ఓ కూనలమ్మ..!! "
నిజ జీవితంలో మనకి ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులూ, ఆనందాలు..వెరసి ఆరుద్రగారు రాసిన ఈ కూనలమ్మ పదాలు. మనందరం తప్పనిసరిగా చదివి ఆకళింపు చేసుకుని ఆచరించాల్సిన జీవిత సత్యాలు.
సాహిత్యం ఆర్ణవమైతే....ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే....ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖ లేదు...ఆ శాఖ పై అతడు పూయించని పువ్వుల్లేవు. అతని "కూనలమ్మ పదాలు" ప్రతిపద రమణీయం....పదపద చమత్కారం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు.