9, మే 2010, ఆదివారం
అమ్మ
వెంకట రత్నమ్మ...రిటైర్డ్ హెడ్ మాస్టర్..
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎన్ని ఆగడాలు చేసినా, తన మీద ఎంత దౌర్జన్యం చేసినా, ఆస్తంతా తగలేసినా, సంపాదనలో ఒక్క రూపాయ ఇవ్వకపోయినా.. తనను భార్యగా గౌరవించడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడకపోయినా కేవలం తన ముగ్గురాడపిల్లల కోసం భరించింది. కానీ ఆ పిల్లలు పెద్ద వారై పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలతో సహా వచ్చి ఆమె మీద ఆధారపడితే..అల్లుళ్ళని ఏమైనా అంటే కూతుళ్ళు అన్యాయమైపోతారనే భయంతో..పిల్లల మీద మమకారం చంపుకోలేక..డెబ్భై ఐదేళ్ళ ఈ వయసులో కూడా తన సంపాదనతో వారందరినీ పోషిస్తోంది. తను కన్నకూతుళ్ళు, వాళ్ళు కన్న పిల్లలు..తననెంత ఈసడించుకున్నా..ఆమెకి వాళ్ళపై ప్రేమే కాని కోపం ఎన్నడూ రాలేదు. ఆ అమ్మకి విశ్రాంతి ఎన్నడో..?
అన్నపూర్ణ..రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్..
తన తరవాత ఐదుగురు తమ్ముళ్ళున్నారు కాబట్టి పై చదువులు చదివించలేనని తండ్రి చెప్తే ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి పదహారేళ్ళ వయసులోనే ఉద్యోగంలో చేరి తండ్రి కి ఆసరాగా నిలబడింది. తల్లిలా తమ్ముళ్ళని పెంచింది, చదివించింది. కుటుంబాన్ని నడపడానికి తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చింది..పెళ్ళైన రెండున్నరేళ్ళకే భర్త చనిపోతే..ఇద్దరు పసికందులతో ఒంటరిగా బ్రతుకు ప్రయాణం సాగించింది..ఊళ్లు తిరిగే ఉద్యోగంతో (ఎగ్జిక్యు టివ్ జాబ్) పిల్లల చదువులు సరిగ్గా సాగవని..వాళ్ళని హైదరాబాద్ లో నే వుంచి తను వారానికి పదిహేను రోజులకి వచ్చి వెళ్తూ..వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చింది..తండ్రి లేని పిల్లలని పల్లెత్తు మాట అనకుండా పువ్వుల్లో పెట్టి పెంచుకుంది..చక్కటి విద్య బుద్దులు చెప్పించింది..వాళ్ళ తో బాటూ తనూ చదువుకుని డిగ్రీ తెచ్చుకుంది. డిపార్ట్ మెంట్ లో సిన్సియర్, అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రిటైర్ అయ్యి...ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకి దూరంగా ఉంటూ పంచడానికి అవకాశం లేకపోయిన మమకారాన్ని ఇప్పుడు పంచుతూ అమ్మ...ప్రేమకి మారు పేరని చెప్పకనే చెప్తోంది.
అనసూయ(లేట్).. యు.డీ.సి. ఏ.పీ. స్టేట్ టెక్నికల్ బోర్డ్..
కోటి ఆశలతో పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన అమ్మాయి..భర్త మానసిక రోగి అని ఆ ఉద్రేకాన్ని తగ్గించడానికి సెడెటివ్స్ వాడుతున్నారని తెలిసి షాక్ అయింది. తప్పని సరై పరిస్థితులతో రాజీ పడింది. పిల్లలు పెద్దవాళ్ళు ఐతే తన కష్టాలన్నీ తీరిపోతాయనుకుంది. వాళ్ళకే కష్టమూ తెలీకుండా పెంచింది. కోరిన చదువు చెప్పించింది. ఉద్యోగ రీత్యా కొడుకు అమెరికా వెళ్తే..కూతురు చదువుని అటకెక్కించి ప్రేమ ప్రేమ అంటూ తనకు రెట్టింపు వయసు, పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి వ్యామోహంలో పడితే..అతి కష్టం మీద ఆ వ్యామోహం నించి బైటికి లాగి మళ్ళీ కాలేజి లో చేర్చింది. హమ్మయ్య కూతురింక మారిపోయింది.. చక్కగా చదువుకుంటోంది..అనుకుంటూ వుండగా ఆ అమ్మాయి మళ్ళీ ప్రేమలో పడింది. ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఈ క్రమం లో మానసిక వొత్తిడి లో తన అనారోగ్యం సంగతే గుర్తించలేకపోయింది. హఠాత్తుగా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే "బ్రెయిన్ ట్యూమర్..అడ్వాన్స్డ్ స్టేజి..ఆపరేషన్ చేసినా మూడేళ్ళ కంటే బ్రతకడం కష్టం" అని చెప్పారు ఎమర్జెన్సి ఆపరేషన్ చేసిన డాక్టర్స్. కూతురికి ఇవేమీ పట్టలేదు..తను ప్రేమించిన వ్యక్తితో(సకల అవలక్షణాభిరాముడు) తను కోరుకున్న జీవితం వైపు సాగిపోయింది. పిల్లలే తన జీవితం అనుకుని బ్రతికిన ఆమె కూతురు చేసిన పనికి తట్టుకోలేకపోయింది. కూతురి భవిష్యత్తు మీద బెంగతో జీవితం నించి సెలవు తీసుకుంది. తిరిగి రాలేని లోకాలకి వెళ్ళిపోయింది.
****
భగవంతుడు తను ప్రతీ చోట ఉండలేక అమ్మని సృష్టించాడట. అమ్మ ప్రేమకి ప్రతి రూపం ..అమ్మ మనసు నవనీతం..మాతృ ప్రేమకి వర్ణ వర్గ భేదాలు, ప్రాంతీయ, దేశ, విదేశ భేదాలు లేవు. అమ్మా...మమ్మీ...అమ్మీ...మామ్...పదమేదైనా... కటిక పేదవాడికైనా, కోట్లకి పడగలేత్తినా అమ్మ ప్రేమ సమానమే. మన సంతోషమే అమ్మ సంతోషం, మన దుఖమే అమ్మ దుఖం. పసితనాన తప్పటడుగు వేసే క్షణం నించి మన ప్రతి అడుగు వెనక అమ్మ..తప్పటడుగు తప్పుటడుగు కాకుండా నిరంతరం వెన్నంటి దారి చూపే అమ్మ.
"వాస్తవం" లో చెప్పిన ముగ్గురమ్మలూ...ఎందరో(కాదు కాదు అందరు) అమ్మలకి, వారి ప్రేమలకి, త్యాగాలకి ప్రతి రూపాలు. అందుకే మాతృమూర్తులందరికీ పాదాభివందనం. మీ ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష.
బ్లాగ్ మిత్రులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
శీర్షిక :
వాస్తవం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)