23, మార్చి 2010, మంగళవారం

విమానాల్రావు అంకుల్




నా చిన్నప్పుడు అంటే నాకో పదీ-పదకొండేళ్ళప్పుడు...మా ఎదురింట్లో ఆంజనేయ స్వామి అని ఒక యాభై-యాభై ఐదేళ్ళ ఆయన వుండే వారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పని చేసేవారు. డైవోర్సీ. ఆయనకి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి అప్పటికే దూరదర్శన్ లో వీణ గ్రేడ్ 1 ఆర్టిస్ట్, పెళ్లి కూడా ఐపోయింది. అబ్బాయేమో ఇంటర్ చదువుతున్నాడు.

ఆయన్ని నేను విమానాల్రావు అంకుల్ అనీ, ఆయనేమో నన్ను "డార్లింగ్" అని "స్వీటీ" అని "అమ్మడూ" అని పిలిచేవారు. నేనంటే బాగా ఇష్టపడే వారు. అయన పిల్లల కంటే ఎక్కువ పెత్తనం చేసేదాన్ని ఆయన మీద నేను. ఎప్పుడు యే వూరికి టూర్ వెళ్ళినా సరే..నా కోసం ఏదో ఒక బహుమతి తెచ్చేవారు. ఇంటి దగ్గరే వుంటే... అమ్మడూ కాస్త ఈ ముసలాడికి కూడా కబుర్లు చెప్పమ్మా అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని తనే చెప్పేవారెన్నో కబుర్లు. వాళ్ళ అమ్మాయి నైనా అంత ప్రేమ గా చూసుకున్నారో లేదో అనుకునే వాళ్ళు అమ్మా, బామ్మా ఎప్పుడూ. 

భార్య లేకపోవడంతో ఇంటిపని, వంట పనీ అంతా అంకులే చేసేవారు. సరిగ్గా ఆయన వంటంతా పూర్తి చేసే సమయానికి నేను తయారయ్యేదాన్ని. అన్నీ పదార్ధాలు నేను ముందు రుచి చూశాకే వాళ్ళు తినేవాళ్ళు. అంత డిమాండ్ వుండేదన్నమాట నాకు వాళ్ళింట్లో. ఎంతగా వూళ్ళన్నీ తిరిగినా, ఎన్ని పెత్తనాలు చేసినా నిద్రకి మాత్రం బామ్మ కావాల్సిందే నాకు. 

ఇలా మనం యువరాణీ వారిలాగా ఒక వెలుగు వెలిగి పోతూ వుండగా..ఒకసారి విమానాల్రావు అంకుల్ ఏదో వూరెళ్ళినప్పుడు ఒక పేద కుటుంబం లో వితంతువుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు. నా చేతే వాళ్ళిద్దరికీ హారితి ఇప్పించి ఇంట్లోకి తీసుకెళ్ళారు అమ్మా వాళ్ళు. అంకుల్ ఆవిడని ఎందుకు తీసుకొచ్చారు..? అని నాకు సందేహం. పైగా నన్ను తీసుకెళ్ళకుండా పెళ్లి చేసుకొచ్చారని కోపం కూడా వచ్చింది. అందుకని రెండు రోజులు వాళ్ళింటికి వెళ్ళలేదు. 

రెండు రోజులు బిగదీసుకుని కూర్చున్నా, కానీ ఆవిడ అదే "అంకుల్ పెళ్ళాం ఆంటీ" ని సరిగ్గా చూడలేదుగా.. అందుకని మూడో రోజు పరిగెత్తుకెళ్ళా వాళ్ళింటికి ఆంటీ ని చూడడానికి. ఆవిడ పాపం బాగానే మాట్లాడింది. కానీ నాకే ఆవిడ నచ్చలేదు. ఆవిడ మా అమ్మ లాగా చీర కట్టుకోలేదనీ, సాఫ్ట్ గా మాట్లాడలేదనీ, ఓల్డ్ ఫాషన్ గా ఉందనీ, ఆంటీ నాకు నచ్చలేదనీ ఆమెని వాళ్ళమ్మా నాన్నల దగ్గరికి పంపెయ్యమనీ అంకుల్ తో చెప్పాను. అప్పుడు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని, ఆవిడ ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎందుకు వెనక్కి పంపకూడదో అంతా వివరంగా నాకర్ధమయ్యే విధంగా చెప్పి నన్ను కన్విన్స్ చేశారు(నిజానికి నన్ను కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేకపోయినా). నా ప్రవర్తన వల్ల ఆంటీ కి కూడా నేనంటే అంతగా పడేది కాదు. కానీ పాపం ఏనాడూ బయట పడేది కాదు. 

ఒకసారి ఆవిడ వింటూ వుండగా అంకుల్ నన్ను "డార్లింగ్" అని పిలిచారు. ఆవిడ నేరుగా నా దగ్గరికి వచ్చి ఏమే "డార్లింగ్" అంటే ఏవిటి అనడిగింది(ఆవిడకి పాపం చదువు రాదు). నేను పెద్ద ఆరిందాలాగా "డార్లింగ్ అంటే ప్రియురాలు" ఆంటీ అన్నా. నాకేం తెలుసు అలా అనకూడదనీ.. పాపం ఆవిడ బాగా ఏడ్చింది. వెంటనే వెళ్లి అంకుల్ తో చెప్పా..ఆయన నా ఎదురుగానే ఆవిడ ని చడా మడా తిట్టారు. పసిపిల్ల దాని మీద నీకు అనుమానమా? అంటూ ఇంట్లోంచి ఆవిడని గెంటినంత పని చేశారు. నా వల్ల వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు అని అర్ధమై ఇంటికొచ్చి బామ్మకి చెప్పా. బామ్మ వెళ్లి సర్దుబాటు చేసింది. 

చిత్రంగా ఆ తరువాత ఆంటీ కూడా నాకు బాగా దగ్గరైంది. అలా ఆ కధ సుఖాంతం అయిన తరువాత చాలా రోజులకి మల్లీశ్వరి సినిమా టీవీ లో వచ్చింది. అప్పట్లో మాకు టీవీ లేదు. అందుకని సినిమా చూడాలంటే అంకుల్ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. అందరూ కింద కూర్చుని చూస్తే నేను మాత్రం దర్జాగా అంకుల్ పక్కనే రాణీ లాగా కూర్చుని చూశాను సినిమా. దాంతో ఆంటీకి బాగా కోపం వచ్చింది. కట్టుకున్న పెళ్ళాన్ని కింద కూర్చోపెట్టి ప్రియురాలిని పక్కన కూర్చోపెట్టుకుంటారా అంటూ బాగా గొడవ చేసింది. ఆవిడ బాధల్లా అంకుల్ నన్ను "డార్లింగ్" అని పిలవకూడదని. ఆవిడ ఎంత రెచ్చిపోతోందో ఆయన అంత తాపీగా "నువ్వేం చేసినా నేను దాన్ని డార్లింగ్ అనే పిలుస్తానని" ఖచ్చితంగా చెప్పెసరికీ..పాపం ఆంటీ..మౌనంగా ఉండిపోయింది.

ఆ తరువాత అంకుల్ ఎప్పుడూ నన్ను అలాగే పిలిచేవారూ.. ఆవిడ కూడా నెమ్మదిగా అలవాటు పడిపోయింది, నాతో ఇంటిమసి పెంచుకుంది. నేను వాళ్ళింటికి వస్తూండగా చూస్తే "ఏవండీ మీ ప్రియురాలోస్తోంది" అంటూ కేకేసేది అంకుల్ ని. ఆంటీ నాకు రకరకాల పిండి వంటలు చేసిపెడితే, నేను ఆంటీ కి చదవడం, రాయడం, అమ్మలాగా చీర కట్టుకోవడం (నిజంగానే నేర్పానండోయ్ అమ్మ దగ్గర నేర్చుకుని), చక్కగా జడ వేసుకోవడం, లాంటివన్నీ నేర్పానన్నమాట.

ఇలా వుండగా..హఠాత్తుగా ఒక రోజు అంకుల్ కి "సెరిబ్రల్ హేమోరేజ్" వచ్చింది. ఒక నెల రోజులు హాస్పిటల్ లో వున్నారు. తరవాత ఇంటికి వచ్చాక చాలా నెలలు పట్టింది కోలుకోడానికి. ఈ మధ్యలో అంకుల్ పిల్లలు ఆయన రెండో పెళ్లి చేసుకున్నందుకు పెద్ద రాద్ధాంతం చేసి ఆయన్నినానా మాటలన్నారు. మళ్ళీ రెండో సారి "సెరిబ్రల్ హేమోరేజ్" వచ్చింది. ఈ సారి కంప్లీట్ గా పారలైజ్ అయిపోయారు "నా ప్రియ నేస్తం".

తరవాత కొన్నాళ్ళకి ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు. అంకుల్ వాళ్ళు అలా వెళ్ళిపోవడం నాకు చాలా పెద్ద షాక్. నేను తేరుకోడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు బహుశా ఆయన జీవించి ఉంటారని అనుకోను. కానీ..ఇప్పటికీ విమానం శబ్దం విన్నా, రసగుల్లా తిన్నా(కోల్ కతా వెళ్ళిన ప్రతీ సారి రసగుల్లా నాకోసం తెచ్చేవారు), మల్లేశ్వరి సినిమా చూసినా, పాటలూ విన్నా, ఎవరు నన్ను అమ్మడు అని పిలిచినా "నా ప్రియ నేస్తం". విమానాల్రావు అంకులే మనసులో మెదులుతారు.

మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. 



21, మార్చి 2010, ఆదివారం

కలల అలలపై...



పాటలీ పుత్రాన్ని పాలించే చంద్రసేన మహారాజుకి ఇద్దరు భార్యలు. చిన్న రాణి రూపవతికి ముగ్గురు సంతానం. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన మహారాజుని పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో చిన్నరాణి తమ్ముడు వక్రకేతు ఉచ్చులు పన్నుతూ మేనల్లుళ్ళని చవటలుగా తయారు చేశాడు.  పట్టపురాణి గుణవతి సంతానం కోసం తపిస్తూ ఆ జగదంబని ప్రార్ధిస్తూ వుండేది. ఆమె పూజలకి సంతసించిన పార్వతి గుణవతిని  కరుణించమని పరమేశ్వరునికి  విన్నవించగా ఆ భక్తవ శంకరుడు భిక్షుక వేషంలో గుణవతి ఎదుట సాక్షాత్కరించి ఒక దివ్య ఫలం ప్రసాదించి అంతర్దానమవుతాడు. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదిస్తుంది. ఇది విన్న చంద్రసేన మహారాజు చాల సంతోషించి పట్టపురాణిని అభినందించాడు. కానీ ఈ వార్త విన్న చిన్న రాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంత దాకా వస్తే నేనున్నానుగా అక్క...అంటూ రూపవతిని సమాధాన పరిచాడు వక్రకేతు.  


త్వరలోనే పట్టపురాణి గుణవతి సులక్షణుడైన కుమారుణ్ణి కన్నది. భావి మహారాజు జన్మించాడని అందరూ మిక్కిలి సంతోషించారు. వక్రకేతు ఆస్థాన సిద్ధాంతులని సొమ్ముతో ప్రలోభ పెట్టి "పుట్టిన బిడ్డ సకల సద్గుణ సంపన్నుడే కాని..పుత్ర వీక్షణమైన మరుక్షణం తండ్రికి నేత్ర నష్టం" అని చెప్పిస్తాడు. సిద్ధాంతుల మాటలతో వ్యాకుల పడుతున్న మహారాజుని "బిడ్డని కేవలం అడవి లో వదిలి రావడమే కానీ చంపడం లేదుగా" అని తన వాక్చాతుర్యంతో అనునయించి,  ఒప్పించి... బిడ్డని చంపెయ్యమని చాటుగా భటులకి చెప్తాడు. అడవిలోకి తీసుకెళ్ళి ఆ బిడ్డని భటులు చంపబోగా పరమేశ్వరుడు భిక్షుకుని రూపంలో వచ్చి రక్షిస్తాడు. అదే దారిన వెళ్తున్న ఒక గొర్రెలకాపరి పిల్లవానిని చూసి ముచ్చట పడి ఇంటికి తీసుకెళ్ళి తానే పెంచుకుంటాడు సంతానం లేని ఆ గొర్రెలకాపరి. 


మహారాజుని పక్కకి తప్పించి అధికారం చేజిక్కించుకునే అవకాశం కోసం వక్రకేతు ఎదురు చూస్తుండగా..సంవత్సరాలు గడిచిపోతాయి. రాకుమారులు పెద్దవారవుతారు.  వేట కని చెప్పి మహారాజుని అడవికి తీసుకు వెళ్ళిన వక్రకేతు సమయం చూసి సేనాపతి దుష్టబుద్దితో కలిసి కుట్ర పన్ని మహారాజుకి విషం కలిపిన పానీయం ఇచ్చి తాగిస్తాడు. మర్నాడు వేటకు బయలుదేరి వెళ్ళిన మహారాజు ఒక లేడిని చంపబోగా గొర్రెల కాపరి పెంచుకున్న రాకుమారుడు (విజయుడు) అడ్డు పడి ఆ లేడిని రక్షిస్తాడు. అతడి రూప విలాసాలు చూసి ఆశ్చర్యపోయిన మహారాజు తేరిపార చూసే లోపు విషప్రభావం వల్ల రాజు చూపు పోతుంది. అందరూ ఆ యువకుడే రాజుగారి చూపు పోవడానికి కారణం అని అనగా అతను ఆశ్చర్యపోతాడు. రాజుగారి చూపు పోవడానికి నేనెలా కారణం అనుకుని తన సందేహ నివృత్తి కోసం కోటలోకి ప్రవేశించి అంతఃపురం లోకి వెళ్తాడు. అక్కడ తన జన్మ రహస్యం తెలుసుకుంటాడు. మహారాజు గారి కళ్ళు తిరిగి రావాలంటే గులేబకావళీ పుష్పం తెచ్చి కళ్ళకు తాకిస్తే మళ్ళీ కళ్ళు వస్తాయని రాజ వైద్యులు చెప్పగా విని..తాను తేవడానికి బయలుదేరతాడు. గులేబకావళీ పుష్పం తేవడానికి వెళ్ళిన అతను మార్గ మధ్యంలో ఏమేమి ఇబ్బందులు పడ్డాడు..ఎలా ఆ పుష్పాన్ని సాధించాడు...?  అన్నది ఈ "గులేబకావళి కధ" మిగతా సినిమా.  


యన్.టే.రామారావు, జమున, నాగరత్నం, ముక్కామల, రాజనాల, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, హేమలత, మిక్కిలినేని..ఇలా తారాగణం అంతా అతిరధ మహారధులే. పాటలు రాసిన వారు సి.నా.రే అని అనుకున్నాను కానీ..అయన అన్నీ రాసినట్టు లేరు, మరి ఎవరు రాశారో తెలీదు. ఇకపోతే సంగీతం కూర్చినవారు జోసెఫ్-కృష్ణమూర్తి. అద్భుతంగా స్వరపరిచారు పాటలన్నీ.    


పైన  టైటిల్ ఏంటీ...ఈ కధేంటి...బొత్తిగా  పొంతన లేని ఈ రాతలేంటీ..అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నానండీ..

గులేబకావళి కధ సినిమాని..."నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని..కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ" అంటూ సి.నా.రే గారు రచించిన పాటని ఎవ్వరూ మర్చిపోరు. అంత గొప్ప పాట. రేడియో లో కానీ, టీవీ లో కానీ చాలా ఎక్కువగా వినే,  చూసే పాట, శ్రోతలందరూ ఎక్కువగా కోరుకున్న పాట.   అసలు ఈ సినిమాలో అన్నీ పాటలూ చాలా బాగుంటాయి. కానీ..."కలల అలలపై తేలెను..మనసు మల్లె పూవై.."ఈ పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.  గులేబకావళీ పుష్పం తేవడానికి యక్ష లోకం వెళ్ళిన విజయుడు (రాకుమారుడు) యక్ష రాజు కుమార్తె కలలో కనిపించి ఆమెతో కలిసి పాడిన పాట.  ఘంటసాలగారూ, జానకి గారు పాడిన పాట...నాకెంతో ప్రియమైన పాట మీతో పంచుకోవాలని నా ఆశ.  ఈ క్రింది లింకులో పాటని చూస్తూ వినచ్చు.



"కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...

జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు
తడిసి తడియని కొంగున...ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము...మరులు గొలుపు తున్నందుకు..

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికానిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము...బిగి కౌగిట కలదన్నది..

కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా...నీవే ఇక నేనై...కలల అలల పై..".




15, మార్చి 2010, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు








బ్లాగ్ మిత్రులందరికీ

"వికృతి"

నామ సంవత్సర 

ఉగాది 

శుభాకాంక్షలు